నవతెలంగాణ – జన్నారం
మండలం కిష్టాపూర్ గ్రామంలో కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పర్యటించారు. కిష్టాపూర్ గ్రామ శివారులో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఏటీసీలో ఉన్న అధునాతనమైన యంత్రాల వివరాలను ప్రిన్సిపల్ బండి రాములును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న కస్తూరిబా పాఠశాలను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచిగా విద్య బోధన చేయాలని సూచించారు.. ఆధునిక సాంకేతిక వృత్తి విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక వృత్తి విద్య కోర్సులను సద్వినియోగం చేసుకొని అభ్యర్థులు స్వయం ఉపాధి పొందాలని తెలిపారు. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఈ కేంద్రాలలో వృత్తి విద్య కోర్సులను అందించడం జరుగుతుందని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి ఇంటర్మీడియట్ కొరకు అదనంగా నిర్మిస్తున్న గదుల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ విద్య సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.. కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.