యూనివర్సిటీ ముఖద్వారం వద్ద ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల నిరసన..
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలి
పరీక్షలు వాయిదా వేయాలి రిజిస్టర్ కు వినతి పత్రం అందజేత
ప్రయివేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతోనే గత్యంతరం లేక కళాశాలలను మూసివేసామని, ప్రయివేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ లోని ముఖద్వారం వద్ద ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేంటనే బకాయిలు విడుదల చేయాలని, యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పరీక్షలు వాయిదా వేయాలని, ఇతర సమస్యలపై డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ మాట్లాడుతూ .. గత కొన్నేళ్లుగా తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తమకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వస్తేనే కళాశాల నడిపే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నాలుగు రోజుల నుండి కళాశాలలను నిరవధికంగా బంద్ చేసి తమ నిరసన తెలుపుతున్నామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకై చేస్తున్న బంద్ ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వినతి పత్రం అందజేసినట్లు వివరించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసే విధంగా సహకరించాలని రిజిస్ట్రార్ విన్నవించారు. ఒకవైపు కళాశాలలు బంద్ ఉండడంతో విద్యార్థులు పరీక్షా ఫీజులు కూడా కట్టడానికి రాలేకపోయారని ఇంకా దాదాపు 40% శాతం మంది విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ కళాశాలల బంద్ పూర్తయ్యే వరకు పరీక్షల సమయ సారిణిని విడుదల చేయొద్దని, అదేవిధంగా పరీక్షా ఫీజు చెల్లించే చివరి తేదీని కూడా పెంచాలని కోరారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో తమ కళాశాలలు కోలుకోలేని విధంగా మారిపోయాయని, ఇప్పుడు కళాశాలలు తెరిచినా గాని సిబ్బంది పనిచేయడానికి రావడానికి సుముఖంగా లేరని జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసి, ఇటు యజమాన్యానికి అటు అధ్యాపకులకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, తమను ఆదుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కళాశాల యాజమాన్యాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్య అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి ,నరాల సుధాకర్ తో పాటు మారయ్య గౌడ్, శంకర్, శ్రీనివాసరాజు, గురువేందర్ రెడ్డి, అరుణ్, గిరి రమణ, సత్యం ,దత్తు, విజయ్, గంగాధర్ ,చందన్ ,గంగారెడ్డి, రషీద్, షకీల్, వెంకట్, కిషన్ తోపాటు జిల్లాలోని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు,తదితరులు పాల్గొన్నారు.



