రాత్రి 8 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
భారత్, ఓమన్ పోరు నేడు
నవతెలంగాణ-అబుదాబి
ఆసియా కప్ 2025లో ఇప్పటికే సూపర్4 బెర్త్ సాధించిన టీమ్ ఇండియా గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో మరో పసికూనతో ఢీకొీట్టనుంది. గ్రూప్-ఏలో వరుసగా యుఏఈ, పాకిస్తాన్‌లపై మెరుపు విజయాలు సాధించిన భారత్.. సూపర్ 4లో మరోసారి పొరుగు దేశం పాకిస్తాన్‌తో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అంతకుముందు, గ్రూప్ దశ చివరి, నామమాత్రపు మ్యాచ్‌లో నేడు ఓమన్‌తో తలపడనుంది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఓమన్ నేడు భారత్‌తో మ్యాచ్‌ను 2026 టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీకి గొప్ప సన్నద్ధతగా భావిస్తోంది.
మార్పులు ఉంటాయా? :
భారత్ తొలి రెండు మ్యాచులు దుబాయ్ లో ఆడింది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం. కానీ అబుదాబిలో స్పిన్‌కు అంత అనుకూలత లభించదు. ఇక్కడ పేసర్లకు వికెట్ల వేటలో అనుకూలత ఎక్కువ ఉంటుంది. తుది జట్టు కూర్పుపై పిచ్ స్వభావం ప్రభావం చూపవచ్చు. జశ్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభిస్తే.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలు తుది జట్టులోకి వచ్చే వీలుంది. అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఒకరికి విశ్రాంతి దక్కవచ్చు. బ్యాటింగ్ లైనప్‌లో మిడిల్ ఆర్డర్‌కు అవకాశాలు రాలేదు. వికెట్ కీపర్‌గా చోటు నిలుపుకున్న సంజు శాంసన్.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మిడిల్‌కు మారాడు. కొత్త స్థానంలో సంజుకు బ్యాట్ పట్టే అవకాశం రాలేదు. దీంతో జితేశ్ శర్మకు నేడు అవకాశం కష్టమే. లోయర్ ఆర్డర్‌లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో రింకు సింగ్‌కు సైతం నిరీక్షణ తప్పదేమో. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, ఓమన్ తలపడటం ఇదే ప్రథమం కానుంది. ఏ ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు గతంలో పోటీపడలేదు.