గాడిదల సభ జరుగుతున్నది. గాడిదలు అనేకం హాజరయ్యాయి. అక్కడికి కూసే గాడిదలూ వచ్చాయి, మేసే గాడిదలూ వచ్చాయి. కూసే గాడిదలంటే ఎప్పుడూ మేయని గాడిదలని కాదు. మేసే గాడిదలంటే ఎప్పుడూ కూయని గాడిదలని కాదు. కూసే గాడిదలూ మేస్తయి. మేసే గాడిదలూ కూస్తయి. కూయడం, మేయడం అన్న లక్షణాలు అన్ని గాడిదలకూ వున్నాయి.
సభ సాగుతూ వుంటే కూసే గాడిదలు కూస్తూ వున్నాయి. మేసే గాడిదలు మేయడంతో పాటు వింటూ వున్నాయి, మేసేక తామూ కూయవచ్చులే అనుకుంటూ. కూసే గాడిదలు కూడా కూయడం అయ్యాక తామూ మేయవచ్చులే అనుకుంటూ కూస్తూ వున్నవి.
గాడిదలంటే అందరికీ చులకన. పెద్ద పెద్ద కళ్లు ముఖంలో వుంటే అందం అంటారు. కానీ మనకు ఇంతింత కళ్లు వున్నా అందంగా వున్నామని ఎవరూ అనరు. ‘క్యూట్ డాంకీ’ అని ఎవరూ పొగడరు అని ఓ గాడిద వాపోయింది.
గాడిదలంటే అందరికీ చులకన. పక్క వాయిద్యాలతో పని లేకుండా, మైకు అవసరం అసలే లేకుండా పాడమనండి మా స్థాయిలో ఎవరినైనా. అయితేనేం మన గానకళా కౌశలాన్ని ఎవరూ మెచ్చుకోరు అని దిగులు వెళ్లగక్కింది ఓ గాడిద.
గాడిదలంటే ఎవరికీ కళ్లకు అగపడవు. చూపుకి ఆనవు. మన పొట్ట బానలాగా, డ్రమ్ములాగా వుంటుందని ఒప్పుకుందాం. అయితే పంచభక్ష్య పరమాన్నాలు కావాలని మారం చేశామా ఏనాడైనా? ఏది దొరికితే అది మెక్కేస్తున్నామే. రుచీ పచీ అని దేబరించకుండా ఏది దొరికితే దాన్ని కాదనకుండా, ఒద్దనకుండా పొట్ట పగిలేట్టు నింపుకుంటున్నామే. ఏ చెత్తయినా కాదనకుండా స్వీకరిస్తున్నామే. అందుకోసమైనా భేష్ అనవచ్చు కదా! జిందాబాద్‌లు కొట్టవచ్చుకదా! అటూ పొట్ట ఎగదోసిందో గాడిద.
ఇట్లా గిట్లాగ కూసే గాడిదలు, చెవుల గురించీ, పొట్టి తోక గురించీ, వెనక్కాళ్లల్లో తమకు వున్న ‘తన్నే బలం’ గురించీ కూసి సభను కంటిన్యూ చేశాయి. అసలు ఈమధ్య ప్రతివాడూ గాడిదల గురించే మాట్లాడ్డం ఫ్యాషనైపోయింది. యూట్యూబుల్లో వేలం వెర్రిగా వెక్కిరించడం మామూలైపోయింది అని గాడిదలు వాపోయినయి.
అసలు లోకంలో ఇన్ని జంతువులున్నా ప్రతి అడ్డగాడిదా, ‘గాడిద కొడుకా’ అన్న తిట్టుని నాలుక చివరన ఎందుకుంచుకోవాలి? అని ప్రశ్నించిన గాడిదలు సుదీర్ఘ చర్చల అనంతరం ఒక కన్ల్యూజన్‌కి వచ్చాయి.
గాడిదలయినా, గుర్రాలయినా ఒకటే. ఆకారంలో పెద్ద తేడా లేదు. ఓ పిసరంత ఎత్తు తక్కువైనా గాడిదలు గుర్రాలకేమీ తిసిపోవని తేల్చాయి గాడిదలు. నాలుక్కాళ్లూ, తోకా, పొడవాటి ముఖంలో ఈ పక్కా ఆ పక్కా ‘లెన్సు’లూ అంతా డిటోయే. కానీ ప్రాబ్లమ్ అల్లా రంగే అని కొన్ని గాడిదలు బల్లగుద్దేయి. తెలుపు కాని తెలుపు, బూడిదకాని బూడిదా ఓ రంగేనా? ప్రపంచంలో జనం రంగు చూసుకుని విర్రవీగుతున్నారని, రంగుల వల్లే జాతులు ఏర్పడ్డాయని, రంగుల కారణంగానే గుర్రాలు గుర్రాలయ్యాయని, రంగుల వల్ల గుర్రాలు గాడిదలు కాకుండా గుర్రాలయి పోయాయని, అంచేత రంగు చూసుకుని అవి తెగ నీల్గుతున్నాయని, రంగు కారణంగానే కంచర గాడిదలు, గాడిదలు కాంకుడా వంటిమీద పట్టీల కారణంగా కంచర గాడిదలయి జంతు ప్రదర్శన శాలల్లో ఏ క్లాస్ ఖైదీలుగా ఎంజారు చేస్తున్నవని గాడిదలు ఏకగ్రీవంగా ఒపీనియన్ తెలియజేశాయి.
గాడిదలుగా పిలవబడుతున్న తమ ఒంటికి కామన్ రంగు వుండడం అన్ కామన్ గనుక తమకీ, నలుపో, ఎరుపో, గోధుమో, చాక్లెటో రంగు కావాలని, వీలయితే ఒకటి రెండు రంగులు మిక్స్ చేస్తే తమ బ్యూటీ మరింత పెరుగుతుందని గుర్రాలకిలేని పసుపు రంగూ, బంగారు రంగూ కూడా జత చేస్తే, నిలువు గళ్లూ, అడ్డం గళ్లూ కూడా యాడ్ చేస్తే తమ ప్రిస్టేజ్ పెరుగుతుందని తీర్మానించి డిమాండ్ చేశాయి.
గాడిదల సామూహిక సమ్మెను ఆపడానికి గాడిదలతో పాటు, మనుషుల్నీ, గాడిదల లక్షణాలున్న అనేక ప్రాణుల్ని తయారు చేసిన మేకర్ గాడిదలన్నింటికీ ఏషియన్ పెయిట్సు వేసేశాడు. లోపల రంగు ఏదో తెలీకుండా పైపైన రకరకాల రంగులలో వున్న గాడిదలు లోకం నిండా హడావిడిగా తిరగాడసాగాయి. ఏ గాలివానకి వాటి రంగులు తుడ్చిపెట్టుకుపోతాయో కానీ, సాగినంత కాలం సాగించుకోడానికి అద్దుకున్న రంగుల్తో దర్జాగా డాబుగా తిరగాడసాగాయి గాడిదలు.
రంగులు వేసుకుంటే మాత్రం గుణంలో మార్పు వుండదు కదా. పులి తోలు కప్పుకున్న గాడిదలు గాండ్రించలేవు కదా. టెంపరరీగా రంగులు వేసుకుని, అసలు రంగు బయటపడకుండా తిరుగుతున్న గాడిదలు గుర్రాల్లాగా గుగ్గిళ్లే తింటామన్న గర్రా మాత్రం పట్టుకోలేదు. పిజ్జాలు, బర్గర్లు, పంచభక్ష్య పరమాన్నాలే కావాలని మొండికేయకుండా దొరికిన కాడికి, అందిన కాడికి, ఏ చెత్త దొరికినా కాదనకుండా, పొట్టని డ్రమ్ముగా వాడుకుని, నింపుకుంటున్నాయి.
కూసే గాడిదలు కూస్తున్నాయి. మేసే గాడిదలు మేస్తున్నాయి. కూసేగాడిదలంటే ఎప్పుడూ మేయని గాడిదలని కాదు. మేసేగాడిదలంటే ఎప్పుడూ కూయని గాడిదలని కాదు. కూయడం, మేయడం అన్న లక్షణాలు అన్ని గాడిదలకూ వున్నాయి.
– చింతపట్ల సుదర్శన్
9299809212



