Sunday, March 1, 2026
E-PAPER
Homeకవితవర్ణ స్వరం

వర్ణ స్వరం

- Advertisement -

ప్రకృతి ఒక మౌన రాగాన్ని ఆలపిస్తోంది,
ఒక కొత్త ‘వర్ణ స్వరం’ వినిపిస్తోంది!
మనుషుల మనసుల మధ్య సాగే స్నేహ ప్రవాహం.
ముఖంపై పూసిన గులాల్‌…
కులమతాల ముసుగులను చెరిపివేస్తోంది,
ఎవరో తెలియని పరాయివాడిని కూడా
ఆత్మీయంగా హత్తుకునేలా చేస్తోంది.
లోకమంతా రంగుల జాతర…
కంటికి కనిపించేవన్నీ అశాశ్వత చిత్రాలే!
నీటి చుక్క తగిలితే కరిగిపోయే రంగులు,
కాలం గడిస్తే వెలిసిపోయే వన్నెలు.
కానీ, చెదరనిది… వీడనిది…
ఒక్కటే… అది మనిషి రంగు!
నలుపు రంగులో నిందలు వెతకకు,
అది చీకటిని చీల్చుకొచ్చే ధైర్యం కావచ్చు.
తెలుపు రంగులో కేవలం శాంతిని చూడకు,
అది శూన్యాన్ని నింపే త్యాగం కావచ్చు.
రంగు ఏదైనా… రూపం ఏదైనా…
లోపల ప్రవహించే రక్తం ఎరుపు ఒక్కటే!
మాటల్లో మమకారం పూస్తే – వెన్నెల రంగు,
చేతల్లో సాయం మెరిస్తే – బంగరు రంగు,
కష్టాల్లో తోడు నిలిస్తే – అభయ హస్తపు రంగు.
గుండె లోతుల్లో తడి ఉంటేనే మనిషి మనిషిగా కనిపిస్తాడు.
తడి ఆరిపోతే… ఎన్ని రంగులు అద్దుకున్నా వథా!
రా రమ్మని పిలిచే ఆత్మీయత,
నేనున్నానని భరోసా ఇచ్చే నిశ్శబ్దం, కన్నీళ్లు తుడిచే చిరునవ్వు…
ఇవే కదా మనిషి వేయాల్సిన శాశ్వత వర్ణాలు!
బయటి లోకాన్ని రంగులతో ముంచెత్తుదాం,
రంగుల హంగామా ముగిశాక మన నిజమైన ”వర్ణ స్వరం”.
ప్రతి రంగు ఒక భాష…ప్రతి చుక్క ఒక భావం,
ద్వేషాల నలుపును కడిగేద్దాం, ఈర్ష్యల బూడిదను వదిలేద్దాం.
కంటిపాపల్లో ఇంద్రధనుస్సును నింపుకొని,
మనిషిని మనిషిగా ప్రేమించే
మమతల రంగును ప్రపంచమంతా చల్లుదాం.
ఈ వర్ణ స్వరం
ఈ రంగుల స్నేహం అనంతం!
తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008 577 834

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -