– కగార్ నరమేధం ఫాసిజం : సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్రెగుట్టల్లో కూంబింగ్‌ను ఆపేయాలనీ, కగార్ పేరుతో నరమేధాన్ని సృష్టించటం ఫాసిజమేనని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో మావోయిస్టులను ఏరివేత పేరుతో నరమేధానికి పాల్పడుతున్నదని విమర్శించారు. ఎనిమిదిన్నర లక్షల మిలటరీ బలగాలతో 700 క్యాంపులతో ఆ ప్రాంతం మీద, ఆదివాసీల మీద, మావోయిస్టు పార్టీ మీద శతృ దేశాలపై చేసే యుద్ధం తరహాలో బీభత్సం సృష్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టు నేతల నిర్మూలనే ధ్యేయంగా పెద్ద కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారన్నారు. తెలంగాణా రాష్ట్ర బలగాలతో సహా నలువైపులా కూంబింగ్ జరుగుతున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామికంగా పరిపాలించాల్సిన ప్రభుత్వం ప్రజల మీదనే యుద్ధం చేయటమేంటని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ చర్యకు పాల్పడటం వాటి స్వభావాన్ని బట్టబయలు చేస్తున్నదని పేర్కొన్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్‌ను ఆపాలనీ, అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పరచాలని డిమాండ్ చేశారు. అడవిలో నిక్షిప్తమైన విలువైన ఖనిజాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఈ దమనకాండకు కేంద్రం పాల్పడుతున్నదని విమర్శించారు. జల్, జంగిల్ హమారా నినాదంతో సాగే ఆదివాసీ బిడ్డల జీవితాలను, అడవిని కాపాడుకోవాలనేే అంశాలపై ప్రజాస్వామిక వాదులు తమ స్పందన తెలుపాలని కోరారు.
భయానక పరిస్థితులు : సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ
కేంద్ర పోలీసు బలగాలు రెండు రోజులుగా కర్రెగుట్టల్లో భారీఎత్తున మోహరించడంతో తీవ్ర భయానక పరిస్థితులు ఏర్పడ్డాయనీ, వాటిని వెంటనే వెనక్కి తీసకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ కూంబింగుల్లో ఎప్పుడు, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్నప్పటికీ, కేంద్రం ముందుకు రావడం లేదన్నారు. లొంగిపోవడాని కొస్తున్న వారిని సైతం చంపేశారని గుర్తు చేశారు. మరికొంత మంది తెలంగాణ రాష్ట్రానికి వస్తూంటే, వారిపై ‘ఉపా’ కేసులు మోపుతున్నారని తెలిపారు. జైళ్లలోనూ చేతులకు బేడీలు వేసి హింసిస్తున్నట్టుగా పౌర హక్కుల నాయకులు ప్రకటిస్తున్నారన్నారు. ఇది రాజ్యాంగాన్నీ, చట్టాలనూ ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కర్రెగుట్టల నుండి సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలనీ, మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లొంగిపోవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఆపరేషన్ కగార్-2ని ఉపసంహరించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
కర్రెగుట్టల్లో కూంబింగ్‌ను ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



