Monday, July 28, 2025
E-PAPER
Homeజాతీయంస్పోర్ట్స్‌, స్పేస్‌ స్టార్టప్‌లు పెట్టేందుకు రండి

స్పోర్ట్స్‌, స్పేస్‌ స్టార్టప్‌లు పెట్టేందుకు రండి

- Advertisement -

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశంలో స్పోర్ట్స్‌, స్పేస్‌ స్టార్టప్‌లు పెట్టేందుకు యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువత ఆ దిశగా ఆలోచనలు చేయాలని కోరారు. ఆదివారం 124వ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. క్రీడా రంగంలోని స్టార్టప్‌లకు పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు. ఇటీవలి కాలంలో భారత్‌లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని, అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. శుభాన్షు శుక్లా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)కు వెళ్లి వచ్చాక దేశమంతా ఆనందంతో పొంగిపోయిందన్నారు. అలాగే, చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసిన తరువాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు, చిన్నారులు సైతం అంతరిక్ష రంగం మీద ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. దేశంలో విద్యార్థులు స్పేస్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని, ప్రతి విద్యార్థి ఓ కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారని తెలిపారు. దేశంలో ఐదేండ్ల క్రితం 50 కంటే తక్కువ స్పేస్‌ స్టార్టప్స్‌ మాత్రమే ఉండేవని, ప్రస్తుతం స్పేస్‌ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్‌ ఉన్నాయని వివరించారు. ‘ఇన్‌స్పైర్‌ మనక్‌ అభియాన్‌’ ఈ పథకం విద్యార్థులు ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమమని, ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని దీనికి ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ఆగస్టు 23న నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా దేశ ప్రజలు తమ సూచనలు, సలహాలు పంపాలని పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -