811 టీఎంసీల నికర జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది ఆయనే
కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చారు.. స్వాగతిస్తున్నాం
నీళ్లు, నిధులు, నిజాల గురించి మాట్లాడుకుందాం
ఉమ్మడి రాష్ట్రంలోకన్నా ఆయన హయాంలోనే తెలంగాణకు అన్యాయం
కేసీఆర్, కేటీఆర్‌లు ఆర్థిక ఉగ్రవాదులు
హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య గొడవలో కవిత బలి
బీఆర్‌ఎస్-బీజేపీ ఒకటేనని తేలుతోంది కేసీఆర్ కోరితే జనవరి 2 నుంచే అసెంబ్లీ
పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందు కు మాజీ సీఎం కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన కోరితే జనవరి 2వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ స్థాయికి, ఆయన వయస్సుకు అగౌరవం కలుగకుండా చూస్తామని హామీనిచ్చారు. ప్రధాన ప్రతిపక్షనేతగా వివిధ అంశాలపై చట్టసభల్లో మాట్లాడాలి తప్ప రోడ్లమీద కాదంటూ చురకలంటించారు. పదేండ్ల పాటు రాష్ట్రంపై కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి జరిగిన ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌లో పరివర్తన వస్తుందని ఆశించామన్నారు. కానీ, అబద్ధాలే పెట్టుబడిగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వివిధ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కలుగులోంచి ఎలుకను లాగినట్టు ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్‌ను బయటకు లాక్కొచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో జలదోపిడీ ఎక్కువగా జరిగిందంటూ లెక్కలు వివరించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు కేసీఆర్ మరణశాసనం రాశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు బాండ్ పేపర్‌పై రాసిచ్చిందే కేసీఆర్ అనీ, ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తామనే భయంతోనే ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పారు.
ఆయన తన హయాంలో కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారే తప్ప, పాలమూరు-రంగారెడ్డిపై ఎన్నడూ దృష్టి పెట్టలేదని వివరించారు. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో మక్తల్, నారాయణపేట, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, రాజీవ్‌సాగర్, సీతారామ ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. పదేండ్లలో రూ.2 లక్షల కోట్లను నీటిపారుదలపై ఖర్చుచేశారనీ, ఆ డబ్బులన్నీ ఎటు పోయాయని నిలదీశారు. కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకత్వాన్ని సరిచేసుకుంటూ రాష్ట్రాన్ని క్రమంగా గాడిలో పెడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.6,800 కోట్లు ఖర్చుచేసిందని ప్రకటించారు. బీఆర్‌ఎస్ హయాంలో సమర్పించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ సరిగా లేదనే కారణంతోనే కేంద్రం దాన్ని తిప్పి పంపిందని గుర్తుచేశారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ వాటా కచ్చితంగా ఇవ్వాల్సిందేనంటూ తాము కొట్లాడుతున్నామన్నారు.
కానీ కేసీఆర్ తన హయాంలో తెలంగాణకు 34 శాతం నీటి వాటా కావాలని సంతకం పెట్టి, మిగతా 64 శాతం ఆంధ్రకు కేటాయించారని విమర్శించారు. ఈ నిజాల్ని నిగ్గుతేల్చేందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తరలించుకుపోతున్నారంటూ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారనీ, అసలు ఆ అవకాశం ఇచ్చిందే ఆయనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలపై బీఆర్‌ఎస్ ఏనాడూ స్పందించలేదని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి న్యాయనిపుణులతో చర్చించి సుప్రీం కోర్టులో, అపెక్స్ కౌన్సిల్‌లో ట్రిబ్యునల్‌లో ఉన్న వివాదాల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. వరి దిగుబడి విషయంలో కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. కాళేశ్వరం కూలిపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2025 ఖరీఫ్‌లో 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని గుర్తుచేశారు.
కుమ్ములాటలవల్లే బయటకొచ్చారు
బీఆర్‌ఎస్‌లోని అంతర్గత కుమ్ములాటలను చూసే కేసీఆర్ బయటకొచ్చారు తప్ప, ప్రజలపై ప్రేమతో కాదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్-హరీశ్‌రావు మధ్య తగువులాటలో కవితను బయటకు తరిమేశారని సానుభూతి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు ఐరన్‌లెగ్‌గా ముద్ర పడ్డదని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు పార్టీని అప్పజెప్తే, తన గతేం కావాలనే ఉద్దేశంతో హరీశ్‌రావు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. హరీశ్‌కు అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కితే రూ.5 వేల కోట్ల మేర ఉన్న ఆ పార్టీ స్థిర, చర ఆస్తులన్నీ దక్కుతాయనీ, ఇదే ఆయన ఆశ అని విశ్లేషించారు. రాష్ట్ర అప్పుల సహా అసెంబ్లీలో వివరిస్తామనీ, కేసీఆర్ రూ.8.11 లక్షల కోట్లు అప్పు తెచ్చి తమ ప్రభుత్వంపై రుద్దారని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అప్పులపై 11.05 శాతంగా ఉన్న వడ్డీని 7.25 శాతానికి తగ్గించగలిగామని వివరించారు. రుణాలు తీర్చాల్సిన కాలపరిమితిని 12 ఏండ్ల నుంచి 30 ఏండ్లకు పెంచగలిగామన్నారు. ఇటీవల ప్రధాని మోడీ బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేసినట్టు పత్రికల్లో చూశాననీ, అంటే ఆయనపై సీబీఐ ఎంక్వైరీలన్నీ వెనుకపట్టు పట్టినట్టేనా అని వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌పై విచారణను కేంద్రం ఎందుకో ముందుకు సాగనివ్వడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. దీన్నిబట్టే బీఆర్‌ఎస్-బీజేపీ బంధం తెలిసిపోతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ, ఏపీలకు చెందిన నీటి వాటాలు, కృష్ణాజలాలు, బడ్జెట్‌లు, అప్పులు, వాటికి వడ్డీల గురించి సోదాహరణంగా వివరిస్తూ వాటిలోని సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సుదీర్ఘంగా వివరించారు.



