సీఈఓలతో ఈసీ సన్నాహక భేటీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పాన్-ఇండియా ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)కు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందుకు సన్నాహకంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈఓలు)తో బుధవారం సమావేశమైంది. గతంలో చివరిసారిగా జరిపిన ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించిన రికార్డులు, ప్రస్తుత ఓటర్ల జాబితాల పరిస్థితిపై ఆరా తీసింది. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఏయే అర్హతా పత్రాలు అవసరమో వారి నుంచి వివరాలు తెలుసుకుంది. ఈసీ త్వరలోనే పాన్-ఇండియా సర్ ప్రక్రియపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల ప్రారంభంలో కానీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావచ్చు. ప్రతి ఏటా జరిపే వార్షిక ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) బదులుగా ఈసారి సర్‌ను చేపడతారు. 2026 జనవరి 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఈఓలతో జరిగిన భేటీని సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్‌ఎస్ సంధు, వివేక్ జోషీ ప్రారంభించారు. దేశంలో మొత్తం ఓటర్లు ఎందరు? చివరిసారిగా జరిగిన సవరణకు సంబంధించిన అర్హతా తేదీ, చివరిసారిగా జరిగిన సవరణల ఆధారంగా ఓటర్ల జాబితాల పరిస్థితి వంటి అంశాలపై సీఈఓలు వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితాల సవరణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
త్వరలోనే పాన్-ఇండియా ‘సర్’
- Advertisement -
- Advertisement -