ఉదయం నుండి భార్యను ఒత్తిడి చేస్తున్నాడు రమేష్. కాని వాణి ససేమిరా అంటున్నది. కాని రమేష్ పట్టు విడవటం లేదు. సాయంత్రం అయ్యింది. ఇంకా వాణిమీద ఒత్తిడి పెంచుతూనే ఉన్నాడు.
రమేష్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఏడాది కిందే రిటైర్‌అయ్యాడు. అయన నిఖార్సైన సంఘీయుడు. ఎవరేమనుకున్నా నిక్కర్ ధరించి సంఫ్‌ు సమావేశాలకు హాజరయ్యేవాడు. ఆఫీసర్ హోదాలో ఉండి నిక్కర్ వేసు కోవటమేంటి? అనే కామెంట్లను రమేష్ ఏనాడూ ఖాతరు చేయలేదు! ఆయన నిబద్ధత అలాంటిది!
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శృతి ఇంటికి వచ్చింది. వెంటనే రమేష్ కూతురికి కంప్లైంట్ చేశాడు.
”మీ అమ్మని హాస్పిటల్‌కి రమ్మంటే రావటం లేదు! చూడమ్మ!”
”ఎందుకమ్మా హస్పిటల్‌కి వెళ్లనంటున్నావట!” అడిగింది శృతి.
”నాకేమయ్యిందే! నేను బాగానే ఉన్నాను. ఆరోగ్యం బాగా ఉన్నపుడు హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లాలే?’ చిరాగ్గా ప్రశ్నించింది వాణి.
”అమ్మకి బాగానే ఉందట! మరి హాస్పిటల్‌కి ఎందుకు నాన్నా? తండ్రిని అడిగింది. శృతి.
”వెళ్లాక అదే తెలుస్తుందిలే!” అంటూ వాణిని బలవంతంగా హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు రమేష్.
డాక్టర్ లక్ష్మి, ఆ పట్టణంలో పేరుమోసిన వైద్యురాలు. రమేష్ ఫ్యామిలీ డాక్టర్. వాణీ, లక్ష్మీ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా.
”ఏమిటి ఇలా వచ్చారు?” నవ్వుతూ అడిగింది డాక్టర్ లక్ష్మి.
”అంతా బాగానే ఉన్నాము! పొద్దటినుండి ఈయన హాస్పిటల్‌కి వెళదామంటూ తగాదా పడుతున్నాడు. ఇప్పుడు బలవంతంగా నన్ను తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడో నువ్వే అడుగు!” అన్నది వాణి విసురుగా.
”ఏమిటీ విషయం !” రమేష్‌ను అడిగింది డాక్టర్.
”అదీ! అదీ…. !” నసుగుతున్నాడు రమేష్.
”డాక్టర్ వద్ద దాస్తారేంటి? చెప్పండి!” కోపంగా అన్నది వాణి.
”వాణికి పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయ్యాలి” అనేశాడు రమేష్.
డాక్టర్ లక్ష్మి, వాణి ఇద్దరూ నిర్ఘాంతపోయారు.
డాక్టర్ కాబట్టి లక్ష్మి తొందరగానే తేరుకున్నది.
”ఇప్పుడెందుకు అలాంటి ఆపరేషన్ చేయాలి! శృతి బాగానే ఉందికదా!” అడిగింది. డాక్టర్.
”బాగానే ఉంది! కాని ఒక్కతే ఉంది!” అన్నాడు రమేష్.
”ఒక్కత్తే ఉండటమేమిటి? మీతో కలిసే ఉంది కదా!”అయోమయంగా అడిగింది డాక్టర్.
”మాతో కలిసి ఉంది నిజమే! మాకు ఒక్కతే సంతానం! ఇంకా ఇద్దరు పిల్లలు కావాలి!” అన్నాడు రమేష్.
”ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా?” అడిగింది డాక్టర్.
”ఇందులో అర్థం కానిదేముంది? మేము హిందువులం! మేము ముగ్గురు పిల్లలను కనాలని పెద్దాయన ఆదేశించాడు. మేము పాటించాలి. అందుకే వాణికి పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయమంటున్నాను” అన్నాడు రమేష్.
”ఇందులో నా ఇష్టాయిష్టాలతో నిమిత్తమేమీ లేదా?” తేరుకుని అడిగింది వాణి.
”శృతి పుట్టగానే ఒక్కరే చాలంటూ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నావు. నేను వద్దంటున్నా మీరి ద్దరూ వినలేదు! అప్పుడు నీ ఇష్టప్రకారం ఆపరేషన్ చేయించుకున్నావు! ఇప్పుడు నా ఇష్టప్రకారం, మా సిద్ధాంతం ప్రకారం ఆపరేషన్ రివర్స్ చేయించుకో!’ అన్నాడు రమేష్ మొండిగా.
”శృతి పుట్టినప్పుడే వాణిి ఆరోగ్యం బాగాలేదు. ఎంతో కష్టపడి తల్లీబిడ్డలను కాపాడాను. మరీ డెలివరీ అయితే వాణి మనకు దక్కదని చెప్పిన తర్వాతే ఆపరేషన్ చేశాను. ఇప్పుడు వాణి వయస్సు 56ఏండ్లు ఈ వయస్సులో ఆమె పిల్లలను కనలేదు!” నిష్కర్షగా చెప్పింది డాక్టర్.
”వాణిని మీరు ఎలాగైనా కాపాడతారు. నాకుతెలుసు. అందుకే పిల్లలు అయ్యేలా ఆపరేషన్ చేయండి!” అన్నాడు రమేష్.
”నేను కాపాడేసంగతి తర్వాత! వైద్యపరంగా ఈ వయస్సులో ఎవరైనా పిల్లలను కనటం అసంభవం!” అన్నది డాక్టర్ లక్ష్మి.
”అయితే నేను ప్రత్యామ్నయం చూసుకోవాలన్నమాట! అన్నాడు సాలోచనగా రమేష్.
”అంటే ఏమిటి ?” విస్మయంగా అడిగింది వాణి.
”ఇంకో పెండ్లి చేసుకుంటాను! ఇద్దరు పిల్లల్ని కంటాను!” అన్నాడు రమేష్ పట్టుదలగా.
వాణి కండ్లు తిరిగి పడపోబోయి తమాయించుకుంది.
”ఇప్పుడు మీకో బాలాకుమారి దొరుకుతుందా? పెండ్లి చేసుకుంటానని ఉవ్విళ్లూరుతున్నారు! మీ వయస్సు కూడా అరవై దాటింది కదా! అయినా ఎందుకు ఇంకో ఇద్దరు పిల్లల్ని కంటానని పట్టుదలగా ఉన్నారు!” నవ్వుతూ అడిగింది డాక్టర్ లక్ష్మి.
”మా పెద్దాయన చెప్పాడు. మేము క్రమశిక్షణ గల సేవకులం. ఒక ఆదేశం వచ్చిందంటే, ప్రాణాలు ఉన్నంత వరకు దాన్ని పాటించాల్సిందే. లేకపోతే మా క్రమశిక్షణకు అర్థం లేదు. పైగా ప్రతి హిందువు ముగ్గురు పిల్లల్ని కనటం ద్వారా సమాజాన్ని బాలెన్సు చేయగలం! లేకపోతే, ముస్లిం జనాభా పెరిగి హిందువులను అణిచివేస్తారు!” అన్నాడు రమేష్.
”గత వంద సంవత్సరాల నుండి ఇదే చెబుతున్నారు! ఏమైనా మారిందా? హిందువుల జనాభానే పెరిగింది కదా! ముస్లిం, క్రైస్తవులు మనుషులు కారా! రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఉండవచ్చు కదా! ఇది లౌకికదేశమని రాజ్యాంగం చెబుతుంది! దాన్ని అమలు చేయరా మీరు!” అడిగింది డాక్టర్ లక్ష్మి.
”మాకు మనుస్మృతి కన్నా వేరే రాజ్యాంగం లేదు! మా పెద్దాయన ఆదేశాలు మాకు శిలాశాసనాలు! ఇంతకు ముందు చెప్పినట్లు మా ప్రాణాలున్నంత వరకు వాటిని పాటించితీరుతాం!” అన్నాడు రమేష్.
”మీ నాయకుడు చెప్పింది ఆచరించని వాళ్లు మీలోనే ఉన్నారు తెలుసా! ఒకాయన పెండ్లే చేసుకోలేదు! ఇక ఆయన ముగ్గురు పిల్లల్ని ఎలా కంటాడు? మరొక నాయకుడు భార్యకు దూరంగా ఉన్నాడు. ఆయనకూ పిల్లలు పుట్టే అవకాశము లేదు! మీరు మాత్రం పిల్లలను కంటానని తొందర పడుతున్నారు. ఇది మీకు తగునా?” అడిగింది డాక్టర్.
”వాళ్లకు మా సంస్థ మినహాయింపు నిచ్చింది!” అన్నాడు రమేష్ బింకంగా.
”మినహాయింపు ఇస్తే అది క్రమశిక్షణ ఎలా అవుతుంది?” అంటే వీలైన ఆదేశాలు పాటిస్తారు! సాధ్యం కాని వాటికి మినహాయింపునిస్తారన్న మాట! అసలు మీసంస్థ చెప్పేది ఒక్కటైనా మీ నాయకులు పాటిస్తున్నారా? దేశీయ ఉత్పత్తులు వాడమంటారు.కానీ మీరు వాడే సరుకులన్నీ విదేశీసరుకులే! ట్రంప్‌తో దోస్తీ చేస్తారు. కానీ ట్రంప్ మాత్రం దేశాన్ని దెబ్బతీసే సుంకాలు విధిస్తే నోరెత్తి మాట్లాడరు. ఇంకో తమాషా ఏమిటంటే, అదే ట్రంప్ తన దేశపు పత్తి మీద సుంకాలు ఎత్తివేయమంటే జీ హుజూర్ అంటూ సుంకాలు ఎత్తివేసి అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటారు! భారత దేశంలోని పత్తి రైతులు ఏమైపోతారో ఆలోచించరా?” అడిగింది డాక్టర్ లక్ష్మి.
”అవన్నీ రాజకీయాలు! మాది దేశభక్తియుత సాంస్కృతిక సంస్థ! ప్రభుత్వానికి సలహాలు మాత్రమే ఇస్తాం! అది అమలు చేయటం, చేయకపోవటం వారిష్టం!” అన్నాడు రమేష్,
”దేశభక్తి గురించి మీరు చెబితేనే వినాలి! దేశ స్వాతంత్య్రం కోసం మీ సంస్థ ఎలాంటి ఆందోళన చేయలేదని బ్రిటిష్‌వారే ఒక సర్టిఫికేటును మీకు ఇచ్చారు! ఆది మీ దేశభక్తా లేక బ్రిటిష్ రాజుగారి మీద ఉన్న భక్తా? దేశాన్ని బ్రిటిష్ దాస్యం నుండి విడిపించటం దేశభక్తి కాదని, మేం సంస్థలో చేరటమే దేశభక్తి అని మీరు నిర్వచిస్తారు కాబోలు! ఇక సంస్కృతి అంటే ఏమిటో కూడా వద్దే నేర్చుకోవాలి! యుద్ధరంగంలో శత్రువైన ముస్లీం సేనాపతి భార్య తన గుడారానికి వచ్చి శరణువేడితే, తన సోదరిలా ఆమెను గౌరవించి, ఆమెకు చీర, సారెలు పెట్టి, ఆమెకు రక్షణగా భటులను ఇచ్చి పంపిన శివాజీనే మతోన్మాదిగా మార్చిన సంస్కృతి మీది! సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనది మాతృ భాష. అలాంటి మాతృ భాషలు లేకుండా చేసి హిందీని రుద్దచూస్తున్న మీరా సంస్కృతి గురించి చెప్పేది! దేశంలో రోజూ వేల కొద్దీ మహిళలపై లైంగికదాడులు జరుగు తున్నాయి! ఆ మహిళలూ హిందువులే, లైంగికదాడులు చేసేది మన హిందువులే! రేపిస్టులకు కోర్టు జైలుశిక్ష విధిస్తే, ఆ శిక్షను రద్దు చేసి, రేపిస్టులను విడుదల చేసిన ప్రభుత్వం మీరు చెప్పిన సంస్కృతినే పాటిస్తున్న దా? ఇక చివరగా మీ అధినాయకుడు ఆదేశించి నట్లు మీరు ఎలాగోలా ఇంకో ఇద్దరు పిల్లల్ని కనవచ్చు! కాని వారు ఆడపిల్లలైతే లైంగికదాడికి గురయ్యే సంస్కృతి నేడు సమాజంలో ఉంది! మీకు పుట్టేవారు మగపిల్లలే అయితే, వారే ఇతర ఆడపిల్లలపై లైంగికదాడి చేసే సంస్కృతి మన సమాజంలో పెరిగింది! ఏదికావాలో మీరే తేల్చుకోండి!” అన్నది డాక్టర్ లక్ష్మి.
”వద్దు! నాకు పిల్లలే వద్దు!” అన్నాడు రమేష్.
– ఉషాకిరణ్