– అమిత్ షాపై మండిపడిన మాజీ న్యాయమూర్తులు
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఎంపికకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పలువురు మాజీ న్యాయమూర్తులు తప్పుపట్టారు. సల్వాజుడుం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును షా తప్పుగా అర్థం చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పేరు పెట్టి విమర్శలు చేయవద్దని హితవు పలికారు. ఒకప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన కురియన్ జోసెఫ్, మదన్ బి లోకుర్, జె.చలమేశ్వర్ సహా 18 మంది మాజీ న్యాయమూర్తుల నుంచి అమిత్ షాకు విమర్శలు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా నిలిపిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన ఓ రూలింగ్‌లో సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇచ్చారంటూ అమిత్ తీవ్రమైన ఆరోపణ చేశారు. దీనిని తప్పుపడుతూ మాజీ న్యాయమూర్తులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ రాజకీయవేత్త కోర్టు తీర్పుకు ‘పక్షపాత పూరితంగా తప్పుడు అర్థాన్ని’ ఇవ్వడం న్యాయమూర్తులను కలవరపాటుకు గురిచేస్తుందని వారు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నక్సలిజాన్ని కానీ, దాని భావజాలాన్ని కానీ స్పష్టంగా లేదా బలవంతపు సూచన ద్వారా సమర్ధించలేదని గుర్తు చేసింది. ‘భారత ఉప రాష్ట్రపతి పదవి కోసం జరిపే ప్రచారం సైద్ధాంతిక పరమైనదే అయినప్పటికీ దానిని నాగరికంగా, గౌరవప్రదంగా నిర్వహించవచ్చు. ఏ అభ్యర్థి భావజాలాన్ని అయినా విమర్శించడం తగదు’ అని మాజీ న్యాయమూర్తులు తమ సంయుక్త ప్రకటనలో చురక వేశారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన మాజీ న్యాయమూర్తుల్లో ఏకే పట్నాయక్, అభరు ఓకా, గోపాల గౌడ, విక్రమ్‌జిత్ సేస్ కూడా ఉన్నారు. వీరితో పాటు హైకోర్ట్ మాజీ న్యాయమూర్తులు…అంజనా ప్రకాష్, సి.ప్రవీణ్ కుమార్, ఎ.గోపాల్ రెడ్డి, జి.రఘురామ్, కె.కన్నన్, కె.చంద్రు, బి.చంద్రకుమార్, కైలాష్ గంభీర్ కూడా సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు.
ఏం జరిగిందంటే…
‘సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి సాయం చేసిన వ్యక్తి. ఆయన సల్వాజుడుం తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఇవ్వకపోతే 2020 నాటికే నక్సలిజం అంతమై ఉండేది. సల్వాజుడుం తీర్పు ఇచ్చిన భావజాలం ద్వారా ప్రేరణ పొందిన వ్యక్తి ఆయన’ అని అమిత్ షా ఆరోపించారు. దీనిపై సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ తీర్పు ఇచ్చింది తాను కానని, అది సుప్రీంకోర్టు తీర్పు అని, దానిని అమిత్ షా పూర్తిగా చదివి ఉంటే సందర్భాన్ని అర్థం చేసుకుని ఉండేవారని చెప్పారు. 2011లో సల్వాజుడుంపై తీర్పు ఇచ్చిన సుప్రీం బెంచ్‌లో సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్‌ఎస్ నిజ్జార్ సభ్యులు. సల్వాజుడుంను రద్దు చేయాలని బెంచ్ ఆదేశించింది. మావోయిస్టుల తిరుగుబాటును ఎదుర్కోవడానికి గిరిజన యువకులను ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించుకోవడం చట్టవిరుద్ధమని తీర్పు చెప్పింది.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై వ్యాఖ్యలు దురదృష్టకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES