Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకమర్షియల్‌ సిలిండర్ల కటకట

కమర్షియల్‌ సిలిండర్ల కటకట

- Advertisement -

బంద్‌కు చేరువలో హోటళ్లు
కట్టెల పొయ్యికి మారుతున్న వైనం
ఫుడ్‌ ఐటెమ్స్‌ తగ్గిస్తున్న యాజమానులు
పూరీ, దోశ, రోటి, ప్రైడ్‌ రైస్‌కు రాంరాం
కిలో రూ. 7 నుంచి రూ. 25కు పెరిగిన కట్టెల ధర
అన్నం, కూరకే వర్కింగ్‌ హాస్టల్స్‌ పరిమితం
హోటల్‌ కార్మికులది దయనీయ పరిస్థితే

అమెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో కమర్షియల్‌ సిలిండర్ల కొరత తీవ్రమవుతున్నది. దీని ప్రభావంతో హోటల్‌ రంగం కుదేలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, కేటరింగ్‌ యూనిట్లు గ్యాస్‌ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అవసరమైన సిలిండర్లు పూర్తిస్థాయిలో అందకపోవడంతో వంటగదులు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే కొన్ని చిన్న హోటళ్లు మెనూలను తగ్గించగా, మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నాయి.

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అమెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో కమర్షియల్‌ సిలిండర్ల కొరత తీవ్రమవుతున్నది. దీని ప్రభావంతో హోటల్‌ రంగం కుదేలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, కేటరింగ్‌ యూనిట్లు గ్యాస్‌ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అవసరమైన సిలిండర్లు పూర్తిస్థాయిలో అందకపోవడంతో వంటగదులు వెలవెలబో తున్నాయి. ఇప్పటికే కొన్ని చిన్న హోటళ్లు మెనూలను తగ్గించగా, మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నాయి. సిలిండర్లు అందకపోవడంతో చాలా చోట్ల హోటళ్లను మూసేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నిల్వ చేసుకున్న సిలిండర్లతో ప్రస్తుతం కొన్ని హోటల్స్‌ నడుస్తున్నాయి. ఎక్కువ సమయం ఉడికే ఆహార పదార్ధాలను వండటం ఆపేశాయి. రోట్టె, దోశ, పూరి, రుమాలీ రోటీ, ఫ్రైడ్‌ రైస్‌, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌ వంటి ఆహార పదార్ధాలకు గిరాకీ ఉన్నా…వాటిని వండటం మానేశాయి. తక్కువ సమయంలో ఉడికే అన్నం, పప్పు వంటి వాటిని మాత్రమే అందిస్తున్నాయి.

ఇవి కూడా అడ్వాన్స్‌ సిలిండర్‌ ఉన్నంతవరకే వండుతారట. ఆ తర్వాత హోటళ్లను మూసేస్తామని యాజమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల సమీపంలో ఉన్న హోటళ్లు మరింత కష్టకాలాన్ని ఎదురుకుంటున్నాయి. రోగుల అటెండర్లు ఎక్కడెక్కడి నుంచో ఆస్పత్రికి వస్తారు. వారికి ఆహారం అందుబాటులో ఉండదు. కాబట్టి టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ హోటల్‌లో తిని రోగులకు సేవలు అందిస్తారు. అటువంటి వారికి కూడా ఈ పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌, ప్యూచర్‌ సిటీ, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బిర్యానీ హోటళ్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులు కూడా ఎక్కువే. సిలిండర్ల కొరతతో ఎక్కువ చోట్ల ప్రముఖ బిర్యానీ హోటళ్లు తీవ్ర ఇబ్బందులతో నడుస్తున్నాయి. వీటితోపాటు వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లు, ప్రభుత్వ హాస్టళ్లు కూడా మెను తగ్గించుకున్నట్టు చెబుతున్నాయి. సిలిండర్లు దొరకపోతే రూముల్లో ఎలక్ట్రిక్‌ స్టౌవ్‌లు పెట్టి వండి పెడుతున్నారు. వీటిపై అన్నం, కూర తప్ప ఇతర ఫ్రై ఐటెమ్స్‌ వండటం వీలు కాదని చెబుతున్నారు.

కట్టెలకు భలే గిరాకీ
సిలిండర్ల కొరత ప్రభావం ఆహార పదార్థాలపై తీవ్రంగా పడుతున్నది. గతంలో కట్టెల పొయ్యి ద్వారా కాలుష్యం పెరుగుతుందని గ్యాస్‌ పొయ్యిలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కట్టెల పొయ్యిలకు భలే గిరాకీ పెరిగింది. ఫంక్షన్‌ హాళ్లు, పెళ్లిళ్లు, పేరంటాలు జరిగిన చోట కట్టెలను ఉపయోగించి భోజనాలు రెడీ చేస్తున్నారు. కాచిగూడలో ఓ వెజిటేరియన్‌ హోటల్‌లో కట్టెల పొయ్యి పెట్టి వంటలు చేస్తున్నారు. కాచిగూడ, నారాయణ గూడ, సికింద్రాబాద్‌, హైవేల పక్కనున్న హోటళ్లు విధిలేని పరిస్థితుల్లో కట్టెల పొయ్యి మీద వండేందుకు చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు కేజీ కట్టెలు రూ. ఏడు రూపాయలు ఉండగా, ప్రస్తుతం రూ. 25 డిమాండ్‌ చేస్తున్నారని హోటల్‌ యాజమానులు చెబుతున్నారు. వచ్చే పది రోజుల్లో కట్టెలకు మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నది. సిలిండర్ల ధరలు పెరగడం లేదా బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా టిఫిన్లు, భోజనాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఫలితంగా ఆ భారం వినియోగదారులపై పడనుంది.

కార్మికులది దయనీయ పరిస్థితి
హోటళ్లలో పని చేసే కార్మికులు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. వారికి వేతనంతోపాటు ఉండటానికి ఆశ్రయం, ఫుడ్‌ వంటి సౌకర్యాలు హోటల్‌ యాజమాన్యం కల్పిస్తుంది. పెద్ద హోటళ్లు అయితే నెలవారీ వేతనం ఇచ్చి మిగతా అంశాలను పట్టించుకోవు. ప్రస్తుతం హోటళ్లు సంక్షోభంలోకి కూరుకుపోతున్నా నేపథ్యంలో ఉన్న కార్మికుల పరిస్థితి కూడా దయనీయంగా మారుతోంది. హోటల్‌ బంద్‌ అయితే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి ఉపాధిపై ప్రభావం పడనుంది. ఆన్‌లైన్‌ బుకింగులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గిగ్‌ వర్కర్లు కూడా ఆందోళనలో ఉన్నారు.

ఫ్రైడ్‌ రైస్‌ బంద్‌
షా నవాజ్‌, హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ సిలిండర్ల కొరత వల్ల ఫ్రైడ్‌ రైస్‌ బంద్‌ పెట్టాం. రోటి చేయడం లేదు. కట్టెల పొయ్యి మీద బిర్యానీ వండుతున్నాం. కట్టెల ధరలు కూడా పెంచారు.

60 ఐటెమ్స్‌ చేస్తాం… ప్రస్తుతం 11కే పరిమితమయ్యాం.
ప్రతాప్‌ నాయక్‌, శ్రీ గణేష్‌ దర్శిని
మా హోటల్‌కు ఆస్పత్రికి వచ్చే వారు ఎక్కువగా వస్తారు. వారి అభిరుచిని దృష్టిలో ఉంచుకుని 60 ఐటెమ్స్‌ సిద్ధం చేస్తాం. ప్రస్తుతం 11 ఐటెమ్స్‌కే పరిమితం చేస్తున్నాం. ఆ తర్వాత అన్నం, పప్పుకే పరిమితమవుతాం. ఇక్కడ కట్టెల పొయ్య పెట్టడంసాధ్యం కాదు. కాబట్టి సిలిండర్లు రాకపోతే హోటల్‌ బంద్‌ చేస్తాం.

మూడు పూటలు అన్నమే : సాయి ప్రియ హాస్టల్‌ యాజమాని
మాది వర్కింగ్‌ ఉమెన్స్‌ హాటల్‌. సాధారణంగా ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం బోజనం, డిన్నర్‌లో రోటీ, చపాతి ఉంటాయి. సిలిండర్ల కొరతతో మూడు పూటలు అన్నమే పెడుతున్నాం.

బ్లాక్‌ దందా
కమర్షియల్‌ సిలిండర్‌ కొరతను ఆసరా చేసుకుని డిస్ట్రిబ్యూటర్లు వాటిని బ్లాక్‌ చేస్తున్నట్టు హోటళ్ల యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 2200 ఉన్న సిలిండర్‌ను రూ. 4వేలు నుంచి రూ 5500లకు అమ్ముకుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు లక్షల కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఎనిమిది లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మొత్తంగా రూ.150 కోట్ల మార్కెట్‌ నడుస్తోంది. వీటికి గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. సిలిండర్‌ కోసం ఫోన్‌ చేస్తే కూడా ఎత్తడం లేదని చెబుతున్నారు. అక్కడి నుంచి రాకపోతే మేమేం చేస్తామంటూ చిరాకు పడుతున్నారు. వాళ్లు చెప్పిన ధర చెల్లించిన వారికి సరఫరా చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. దీంతో చిన్న, మధ్యతరగతి హోటల్‌ యాజమానులు తమ వ్యాపారాన్ని బంద్‌ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -