నవతెలంగాణ – హైదరాబాద్ : మదురో దంపతుల విడుదల కోసం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్ ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా బంధించి, న్యూయార్క్ జైలుకి తరలించిన సంగతి తెలిసిందే. మదురోను నిర్బంధించిన నేపథ్యంలో వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీరోడ్రిగజ్‌ను తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిందిగా వెనిజులా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల అనంతరం ఆదివారం రోడ్రిగజ్ తన మొదటి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మదురో విడుదల కోసం కమిషన్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. తన సోదరుడు, జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ మరియు విదేశాంగ మంత్రి య్వాన్ గిల్‌లను కమిషన్‌కు ఉపాధ్యక్షత వహించాల్సిందిగా కోరారు. సమాచార మంత్రి ఫ్రెడ్డీ నానెజ్ కూడా కమిషన్‌లో ఉంటారని ప్రకటనలో తెలిపారు.
అమెరికాకు సహకరించకుంటే మదురో కంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని రోడ్రిగజ్‌ను ట్రంప్ హెచ్చరించారు. వెనిజులాకు అమెరికా బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. కొత్త నాయకత్వం తమకు సహకరించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవాణా ద్వారా వచ్చిన నగదుతో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న (నార్కో టెర్రరిజం) ఆరోపణలపై మదురో దంపతులను నేడు న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం.



