అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటాం
రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు.. ఆరునెలల్లో నివేదిక కోరుతాం
ఉద్యోగులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.. నేను ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయనీ, వాటి పునర్విభజన కోసం త్వరలో రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సెంట్రల్ అసోసియేషన్- 2026 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదనే మార్చినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అన్నీ రాజకీయ పార్టీలతో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామని వివరించారు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది రాష్ట్రాన్ని నడపలేరనీ, 10.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని సీఎం అన్నారు.
మనమంతా ఒకే కుటుంబమనీ, వేర్వేరు కాదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. ఉద్యోగులే మా ప్రభుత్వ సారధులు, వారధులని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ. కోటి బీమా ఇవ్వాలని నిర్ణయించామని, ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ. 12 వేల కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయనీ, పన్ను వసూళ్లల్లో అవకతవకలు అరికడితే రావాల్సిన నిధులు వస్తాయని, పన్నులు పెంచాల్సిన అవసరం లేదని, సరిగ్గా వసూళ్లు చేస్తే చాలని అభిప్రా యపడ్డారు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్క య్యారని అనుకుంటున్నారని చెబుతున్నారని వివరించారు. మనమంతా ఒకే కుటుంబమనీ, కుటుంబంలో కుమ్మక్కులు ఏముంటాయని అన్నారు.
ఉమ్మడి కుటుంబంలో కలిసుంటే చూడలేనివారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారని తెలిపారు. ఒక శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్లను పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 8లక్షల కోట్ల అప్పుల భారాన్ని మాపై మోపిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.18 వేల కోట్లనీ, కానీ ప్రతినెలా రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సి వస్తున్నదని వివరించారు. సగటు మధ్యతరగతి వ్యక్తి గౌరవంగా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రభుత్వానిది కూడా అదే పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గెజిటెడ్ ఆఫీసర్ల కోసం కార్యాలయం నిర్మాణానికి సహకరిస్తామన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందిద్దామనీ, మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.



