Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ స్థాయిలో కమిటీలు

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ స్థాయిలో కమిటీలు

- Advertisement -

వాహనదారులకు క్షేత్రస్థ్రాయిలో అవగాహన కల్పించాలి : కలెక్టర్లకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం
రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులపైనా అధికారులతో సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రహదారి ప్రమాదాల నివారణకు గ్రామ స్థాయిలో ”రోడ్డు భద్రత” కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ”అరైవ్‌ అలైవ్‌” కార్యక్రమం అమలుపై గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ, ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. వాహనాల సంఖ్య పెరగడం, అతి వేగంతో నడపడమే ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లు రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, స్థానిక పరిస్థితులకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తక్షణమే నిర్వహించి, వారాంతర ”అరైవ్‌ అలైవ్‌” కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి 18వరకు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులే బాధితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గత మూడు నెలల్లో రోడ్డు భద్రత చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్టు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీఆర్‌వో ప్రియాంక, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి

రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన అంశాలపై సీఎస్‌ గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్‌రాజ్‌, జయేష్‌రంజన్‌, నవీన్‌మిట్టల్‌, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఆర్‌.వి కర్ణన్‌, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ వినరు కష్ణారెడ్డి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కమీషనర్‌ సజన, దక్షిణ మండలం విధ్యుత్‌ సరఫరా సంస్థ ఎండీ జితేష్‌పాటిల్‌ , మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌ మను చౌదరి తదితర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే అండర్‌ బ్రిడ్జిలు, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ప్రజా రవాణా మరింత మెరుగు పరచడం తదితర 21 అంశాలపై సమీక్షించారు. ఈ పెండింగ్‌ అంశాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ప్రధానంగా మున్సిపల్‌, జలమండలి, రెవెన్యూ, విద్యుత్‌, రోడ్లు భవనాల శాఖల అధికారులు సంయుక్త తనిఖీలను నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ రైల్వే ప్రాజెక్టుల పెండింగ్‌ అంశాలపై త్వరలోనే రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం జరగనుందనీ, ఈ లోపు ప్రతీ పెండింగ్‌ అంశానికి తగిన నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

‘అరైవ్‌ అలైవ్‌” షెడ్యూల్‌

ఏప్రిల్‌ 13 : గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు
ఏప్రిల్‌ 14 : అంబేద్కర్‌ విగ్రహాల వద్ద రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించడం
ఏప్రిల్‌ 15 : ”చిల్డ్రన్‌ రోడ్‌ సేఫ్టీ డే” … నాలుగేండ్లకు పైబడిన పిల్లలకు సీట్‌ బెల్ట్‌ వినియోగంపై అవగాహనకార్యక్రమాలు
ఏప్రిల్‌ 16 : ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు-హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వినియోగాన్ని ప్రోత్సహించడం,
సోషల్‌ మీడియాలో అవగాహన సందేశాలు, ఫోటోలు పంచుకోవడం
ఏప్రిల్‌ 17 : ”గోల్డెన్‌ అవర్‌” అత్యవసర స్పందన శిక్షణ కార్యక్రమాలు
ఏప్రిల్‌ 18 : ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులకు కౌన్సెలింగ్‌-ప్రవర్తనా మార్పు, ట్రాఫిక్‌ నియమాల పాటించడంపై దృష్టి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -