– పలు గ్రూపుల విశ్లేషణలు
– అమెరికా ప్రజలపై ఏడాదిగా రూ.3.3 లక్షల అదనపు భారం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తన సన్నిహిత మిత్రుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్‌తో కలిసి తీసుకుంటున్న వినాశకర నిర్ణయాలతో ఆ దేశ ప్రజానీకం సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల అమెరికన్ల ఖర్చులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలను, వ్యాపారస్తులను, స్టాక్ మార్కెట్లను సైతం టారిఫ్‌లు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ అనాలోచిత సుంకాల కారణంగా అమెరికాలోని సాధారణ ప్రజల కుటుంబాలపై ఒక్కొ కుటుంబపై సగటున ఏడాదికి రూ.3.3 లక్షలు చొప్పున అదనంగా భారం పడనుంది. ఈ మేరకు పలు సంస్థలు అంచనాలు వేశాయి. న్యూయార్క్‌కు చెందిన డెమోక్రాట్ నేత, అమెరికా సెనెట్ మైనారిటీ నేత చుక్ షుమర్ మాట్లాడుతూ, సుంకాల వల్ల ప్రజల ఖర్చులు పెరుగుతాయని ట్రంప్ ఎన్నడూ ఓటర్లకు పూర్తిగా వివరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టారిఫ్‌లతో అమెరికన్ల ఖర్చులు పెరుగుతాయని, సగటున ఏడాదికి నాలుగు వేల డాలర్లు (దాదాపు రూ.3.3 లక్షలు) చొప్పున ఒక్కొ కుటుంబంపై అదనంగా భారం పడుతుందని ఆయన వాపోయారు. రాజకీయ సైద్ధాంతికంగా వేర్వేరు భావజాలాలు కలిగిన ఐదు గ్రూపులు యాలే బడ్జెట్ ల్యాబ్, అమెరికన్ యాక్షన్ ఫోరం, ట్యాక్స్ ఫౌండేషన్, అర్బన్ ఇన్‌స్టిట్యూట్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ ట్యాక్స్ పాలసీ సెంటర్; సిఎన్‌ఎన్ వార్తా సంస్థ ఈ అంచనాలను వెల్లడించాయి. అయితే ఇవన్నీ కూడా కెనడా, మెక్సికో సహా వివిధ దేశాలపై సగటను 10 శాతం టారిఫ్‌లను పెంచుతూ ఈ ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ చేసిన ప్రకటనల ప్రభావాన్ని అనుసరించి లెక్కగట్టిన అంచనాలు. దేశాల వారీగా ట్రంప్ ప్రకటించిన అధిక టారీఫ్‌ల ప్రభావాన్ని ఈ అంచనాల్లో లెక్కలోకి తీసుకోలేదు. అవి కూడా కలిపితే అమెరికన్లు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సివుంటుందని ఐదు గ్రూపులు హెచ్చరించాయి. ఈ ఐదు సంస్థలు అదనపు భారంపై వేసిన అంచనాలు ఏడాదికి 3,100 నుండి 4,900 డాలర్లు వరకు వున్నాయి. వీటి సగటును తీసుకుంటే షుమర్ చెప్పిన 4 వేల డాలర్లు వుంటుంది. ఇక ఐదవ గ్రూపు అంచనా అయితే 1243 డాలర్లు మేరకు అదనపు భారం వుంటుందని పేర్కొంది. ఈ టారిఫ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ మేరకు చొచ్చుకుపోతాయనే అంశంపై వివిధ గ్రూపులు వివిధ రకాలుగా అంచనాలు వేశాయి. దాన్ని బట్టే వ్యయం అంచనాలు కూడా వున్నాయి. ఏప్రిల్ 2కు ముందు ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రాతిపదికనే ఈ అంచనాలు వేశారు. అంటే అన్ని దేశాల ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు, చైనా ఉత్పత్తులపై మాత్రం 145 శాతం టారిఫ్‌లు వుంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వాటి ఆధారంగానే ఈ గ్రూపులు అంచనా వేశాయి. ప్రధానంగా తక్కువ ఆదాయ కుటుంబాలు బాగా దెబ్బతింటాయని విశ్లేషణల్లో వెల్లడైంది. అలాగే జీవన నాణ్యత కూడా దెబ్బతింటుందని, ప్రజలు ఖర్చును భరించేలక నాసిరకం ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతారని భావిస్తున్నారు.
ట్రంప్ సుంకాలతో సామాన్యులు విలవిల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES