Friday, June 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌నకు షాక్‌

ట్రంప్‌నకు షాక్‌

- Advertisement -

అప్రజాస్వామికం అంటూ అధ్యక్షభవనం గగ్గోలు చట్టపరంగా సవాలు చేసే అవకాశం
ఇరాన్‌ యుద్ధాన్ని ఆపాలంటూ ప్రతినిధిసభ తీర్మానం
అనుకూలంగా ఓటేసిన నలుగురు రిపబ్లికన్లు
అప్రజాస్వామికం అంటూ అధ్యక్షభవనం గగ్గోలు
చట్టపరంగా సవాలు చేసే అవకాశం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రతినిధిసభ షాక్‌ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలని, తదుపరి సైనిక చర్యలకు దిగవద్దని ఆయనకు సూచిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 215 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా 208 మంది వ్యతిరేకించారు. అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంతో ట్రంప్‌నకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. యుద్ధాన్ని అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి ఇది సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని కాంగ్రెస్‌ ప్రకటించకపోయినా లేదా సైనిక చర్యకు అనుమతి ఇవ్వకపోయినా ఇరాన్‌ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని ట్రంప్‌నకు సూచిస్తూ ప్రవేశపెట్టిన యుద్ధ అధికార తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు.

తీర్మానాన్ని సమర్ధించిన రిపబ్లికన్లు
రాజకీయ మిత్రుల కోసం ట్రంప్‌ ఉద్దేశించిన 1.8 బిలియన్‌ డాలర్ల ‘పరిహార నిధి’ ప్రణాళికను కాంగ్రెస్‌లోని సంప్రదాయవాదులు వెనక్కి తీసుకున్న కొద్ది రోజులకే బుధవారం జరిగిన ఓటింగ్‌ రిపబ్లికన్‌ పార్టీలోని విభేదాలకు సంకేతంగా నిలిచింది. రిపబ్లికన్‌ సభ్యులు థామస్‌ మస్సీ, బ్రియాన్‌ ఫిడ్జ్‌పాట్రిక్‌, టామ్‌ బారెట్‌, వారెన్‌ డేవిడ్‌సన్‌ డెమొక్రాట్లతో చేయి కలిపి తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. గతంలో వ్యతిరేకంగా ఓటేసిన డెమొక్రాట్‌ సభ్యుడు జేర్డ్‌ గోల్డెన్‌ ఈసారి మద్దతు తెలిపారు. ‘యుద్ధాన్ని ప్రకటించాల్సింది కాంగ్రెస్‌ మాత్రమే. ఆ హక్కును మనం కచ్చితంగా కాపాడుకోవాలి’ అని మిచిగాన్‌కు చెందిన రిపబ్లికన్‌ సభ్యుడు బారెట్‌ అన్నారు. ‘సరైనదేనని భావించిన దానికి నా మనస్సాక్షి ప్రకారం ఓటేస్తాను. దానినే అంగీకరిస్తాను’ అని చెప్పారు. ప్రతినిధిసభకు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ ప్రతినిధి, డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు గ్రెగొరీ మీక్స్‌ మాట్లాడుతూ ఇరాన్‌పై అధ్యక్షుడు ట్రంప్‌ సాగిస్తున్న చట్టవిరుద్ధమైన, ఖరీదైన యుద్ధాన్ని ఇరు పక్షాలు తిరస్కరించాయని చెప్పారు. ఈ తీర్మానం ఇరాన్‌ యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే దిశగా వేసిన ముందడుగు అని అభివర్ణించారు. యుద్ధంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో ట్రంప్‌ విఫలమయ్యారని, పైగా దేశంలో ఇంధన ధరలను పెంచారని, ఇరాన్‌ అణు కార్యక్రమానికి దౌత్య పరమైన పరిష్కారం కనుగొనడాన్ని మరింత క్లిష్టతరం చేశారని విమర్శించారు. ‘తీర్మానం ఆమోదం పొందడం ఓ కీలక మలుపు. మధ్యప్రాచ్యంలో మరో నిరవధిక యుద్ధాన్ని కోరుకోని రిపబ్లికన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది’ అని తీర్మానానికి కో-స్పాన్సరర్‌ అయిన మీక్స్‌ అన్నారు.

అర్హతే లేదన్న అధ్యక్ష భవనం
ఇరాన్‌ యుద్ధంపై ప్రతినిధిసభ ఆమోదించిన తీర్మానాన్ని ట్రంప్‌ గౌరవిస్తారా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు తీర్మానానికి అర్హత లేదని అధ్యక్షభవనం చెబుతోంది. అధ్యక్షుడి అధికారాలను కుదించేందుకు చేసిన అప్రజాస్వామిక ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది. అయితే తీర్మానం ఆమోదం పొందడం మామూలు విషయమేమీ కాదు. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలికేలా చూడాలని ఈ తీర్మానం అధ్యక్షభవనంపై ఒత్తిడి తెస్తోంది. ట్రంప్‌ యుద్ధ అధికారాలకు బ్రేకులు వేయాలని ప్రతినిధిసభ ప్రయత్నించడం ఇది నాలుగోసారి. సెనెట్‌లో కూడా గత నెలలో ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టారు. అయితే దానిపై ఇంకా పూర్తి స్థాయి ఓటింగ్‌ జరగలేదు. రిపబ్లికన్ల ఆధిపత్యం కింద ఉన్న సెనెట్‌లో కూడా ఈ తీర్మానం ఆమోదం పొందితే అప్పుడు అధ్యక్షుడి సంతకం అవసరం ఉండదు. అయినా దానిని చట్టపరంగా సవాలు చేసే అవకాశం ఉంటుంది.

అడ్డంకి తప్పదా ?
యుద్ధ వ్యతిరేక తీర్మానానికి ఇంకా సెనెట్‌ ఆమోదం లభించనప్పటికీ అధ్యక్షుడి అధికారాలకు కళ్లెం వేయడానికి జరిగిన ఓ అరుదైన ప్రయత్నంగా ఇది నిలుస్తుందని రాయిటర్స్‌ వార్తా సంస్థ వ్యాఖ్యాన ించింది. తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క డెమొక్రాట్‌ కూడా ఓటు వేయలేదు. ఏడుగురు సభ్యులు మాత్రం తమ ఓట్లను నమోదు చేయలేదు. ప్రతినిధిసభలో తీర్మానం ఆమోదం పొందినప్పటికీ దానికి అధ్యక్షభవనంలో అడ్డంకి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దానిని వీటో చేసే అధికారం ట్రప్‌కు ఉంటుంది. యుద్ధ అధికార తీర్మానాన్ని ప్రతినిధిసభ ఆమోదించినప్పటికీ దానికి రాజ్యాంగ బద్ధత ఉంటుందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. రిపబ్లికన్ల నియuంత్రణలో ఉన్న ప్రతినిధిసభలో గతంలో మూడు సార్లు తీర్మానాలను ప్రవేశపెట్టి నప్పటికీ స్వల్ప తేడాతో వీగిపోయాయి. సెనెట్‌లో ఏడు ప్రయత్నాలు విఫలమైన తర్వాత గత నెలలో ఇలాంటిదే వేరొక తీర్మానం ముందుకు వచ్చింది.

అధికారపక్షంలో పెరుగుతున్న అసంతృప్తి
ట్రంప్‌ చర్యలపై రిపబ్లికన్‌ పార్టీ సభ్యులలో అసంతృప్తి పెరుగుతోందని తాజా ఓటింగ్‌ నిరూపించింది. ట్రంప్‌ తెర పైకి తెచ్చిన పరిహార నిధిని పలువురు రిపబ్లికన్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాలలో అనుభవం లేకపోయినా తనకు నమ్మకస్తుడైన గృహ రుణాల రెగ్యులేటరును నిఘా విభాగానికి తాత్కాలిక డైరెక్టరుగా నియమించాలన్న ట్రంప్‌ నిర్ణయాన్ని కూడా వారు వ్యతిరేకించారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -