Wednesday, August 5, 2026
E-PAPER
Homeజాతీయంరీల్స్‌‌లో మోడీ బిజీ.. ముఖం చాటేస్తున్న షా

రీల్స్‌‌లో మోడీ బిజీ.. ముఖం చాటేస్తున్న షా

- Advertisement -

ఢిల్లీ నిరసనల్లో పోలీసు చర్యపై రెండు వారాలైనా స్పందించని కేంద్రం
పార్లమెంటు సమావేశాలకు డుమ్మా

అమిత్‌ ‌షా రావాలంటూ ప్రతిపక్షం పట్టు పార్లమెంటు ఉభయసభల్లో వరుస ఆందోళనలు
వాటిమధ్యే కీలక బిల్లుల ఆమోదం మోడీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. ప్రజాస్వామ్య దేశానికి కీలకమైన పార్లమెంటుతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. ‘హలో ఫ్రెండ్స్‌’ అంటూ ప్రధాని మోడీ రీల్స్‌‌లో బిజీగా ఉంటున్నారు. ఇక ఢిల్లీలో గతనెల 20న జరిగిన ‘పార్లమెంట్‌ ‌మార్చ్‌’ నిరసనల సందర్భంగా విద్యార్థులు, యువకులపై పోలీసుల దాష్టీకం, ఆ తర్వాత పెట్టిన కేసులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా ఇప్పటికీ పార్లమెంటులో వివరణ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన పార్లమెంటుకే హాజరుకావట్లేదు. ఢిల్లీ నిరసనలు గడిచి రెండు వారాలవుతున్నా దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోడీ, అమిత్‌‌షాల తీరు పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) ‌బాష్పవాయువు, లాఠీచార్జి, పెల్లెట్‌ ‌గన్స్‌ ఉపయోగించడంపై కేంద్రం సమాధానం చెప్పాలని ప్రతిపక్షం రెండు వారాలుగా డిమాండ్‌ ‌చేస్తున్నా.. అమిత్‌ ‌షా మాత్రం సభకు రాకపోవడం గమనార్హం. ఢిల్లీ పోలీసు విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేస్తున్నందున జంతర్‌‌మంతర్‌ ‌వద్ద జరిగిన ఘటనలపై కేంద్ర హోం మంత్రి నేరుగా పార్లమెంటు కు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ప్రతిపక్షం వాదిస్తోంది. లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అమిత్‌ ‌షాను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే ప్రధాని మోడీకి డిమాండ్‌ను వినిపించారు. మరోవైపు ప్రధాని మోడీ కూడా పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉంటూ సోషల్‌ ‌మీడియాలో రీల్స్‌ ‌చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయన గతానికి భిన్నంగా యువతను ఆకర్షించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా ఐదు రీల్స్ విడుదల చేశారు. అయితే ఇందులో విద్యార్థుల నిరసనలు, ఢిల్లీ పోలీసుల చర్యలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షం ఇదే విషయాన్ని ప్రజలకు గుర్తుచేస్తున్నది.

​అమిత్‌ ‌షా ప్రస్తావనే రాకుండా రాజ్యసభలో చైర్మెన్‌ ఆంక్షలు
రాజ్యసభలో ఎంఎస్‌ఎంఈ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు అజయ్ మాకెన్, సీపీఐ(ఎం) సభ్యుడు జాన్ బ్రిట్టాస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యురాలు డోలా సేన్, ఇతర సభ్యులు హోంమంత్రి గైర్హాజరు, నిరుద్యోగం, విద్యార్థుల నిరసనల అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే, సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షుడు హరివంశ్ మాత్రం పలుమార్లు జోక్యం చేసుకుని బిల్లుకు సంబంధించిన అంశాలకే పరిమితమవాలని సూచించారు. సభా నాయకుడు, బీజేపీ నేత జేపీ నడ్డా కూడా బిల్లుతో సంబంధం లేని వ్యాఖ్యలు రికార్డులో ఉండకూడదని అన్నారు. సీపీఐ సభ్యుడు సందోష్ కుమార్ పి. మాట్లాడుతూ… ‘‘ఎంఎస్‌ఎంఈ అంటే.. మినిస్టర్‌ ‌షా మస్ట్‌ ఎక్స్‌‌క్యూస్‌’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దానిని కూడా చైర్మెన్‌ అడ్డుకోవడం గమనార్హం.

​చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం!
​బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకునే విషయంలోనూ కేంద్రం సరైన సాంప్రదాయాన్ని పాటించడం లేదన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన బిల్లులే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభలో సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026ను దాదాపు పది నిమిషాల్లోనే ఆమోదించగా, రాజ్యసభలో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు-2026 కూడా పరిమిత చర్చతోనే ఆమోదం పొందింది. గత వారం కూడా వందేమాతరం అవమానాన్ని శిక్షార్హ నేరంగా చేసే బిల్లును లోక్‌సభలో కేవలం పదిహేను నిమిషాల్లో ఆమోదించడంపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

​నిరసనలపై కొనసాగుతున్న కేంద్రం మౌనం
గతనెల 20న జరిగిన నిరసనల అనంతరం అమిత్ షా.. కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే విద్యార్థులు, యువత, నిరసనకారుల మీద ఢిల్లీ పోలీసుల చర్యలపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ప్రధాని మోడీ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తనపై నినాదాలు చేసిన యువతను ‘‘క్షమించానని’’ చెప్పినా.. నిరసనకారులపై పోలీసుల బలప్రయోగం, యువతులకు వస్తున్న బెదిరింపులు, డాక్సింగ్ ఆరోపణలు వంటి అంశాలను ప్రస్తావించకపోవడం గమనార్హం. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేకపోతే.. వారిపై కేసులు ఉపసంహరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. కేంద్రం ఇచ్చిన హామీని బాధ్యతగా అమలు చేయాలని కూడా ఆదేశించింది. అయితే ఈ విషయంలోనూ కేంద్రం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం మాత్రం కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌కు వచ్చి ఢిల్లీ పోలీసుల చర్యలపై సమగ్ర వివరణ ఇవ్వాలని, నిరసనలపై చర్చ నిర్వహించాలని పట్టుబడుతోంది. మరోవైపు ప్రభుత్వం ఇదేం పట్టనట్టు పార్లమెంటులో ఆ గందరగోళం మధ్యే బిలుల్ని ఆమోదింపచేసుకుంటున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -