పెట్టుబడులకనుగుణంగా లేని రేట్లు 30 శాతం పతనమైన ధర బంగినిపల్లి, తోతాపురి ధరల క్షీణత దిగుబడి తగ్గినా ధర పెరగని స్థితి అనుకూలించని వాతావరణం తెగుళ్లతో నాణ్యతలేమి నిలిచిపోయిన అమెరికాకు ఎగుమతులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మామిడి రైతులు డీలా పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులకనుగుణంగా ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఆశించిన ధర రాకపోవడంతో కోతలు చేపట్టకుండానే తోటలను వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్డు పక్కన, డంపింగ్ యార్డుల్లో మామిడికాయలను పార బోస్తున్నారు. సాధారణంగా దిగుబడి తగ్గితే పంట ధర పెరుగుతుంది. కానీ మామిడి విషయంలో దిగుబడితోపాటు ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. తెగుళ్లతో నాణ్యత పడిపోవడం దీనికి ఒక కారణం కాగా.. ఈ పరిస్థితిని లాభంగా మార్చుకుంటున్న సిండికేట్ వైఖరి మరో కారణంగా రైతులు చెబుతున్నారు. రూ. లక్షల్లో పెట్టుబడు లు పెడితే రూ. వేలల్లో రాబడి ఉందని వాపోతున్నారు.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
నూజివీడు రకం మామిడికి దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఉంటోంది. అమెరికాకు కూడా మామిడి ఎగుమతి అయ్యేది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఈ ఏడాది ఎగుమతి చేసే పరిస్థితి లేదు. మామిడి సాగు వరుస నష్టాలు, తుపానుల ధాటికి క్రమంగా తగ్గుతూ వస్తోంది. మామిడి తోటలను తొలగించి ఆ స్థానంలో పామాయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో పూత ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా నల్లతామర తెగులుతో సుమారు 50 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపరి (కలెక్టర్ కాయలు), చిన్నరసాలు, పెద్దరసాల సాగు అధికంగా ఉంటుంది. ఇవి దేశ, విదేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధం కారణంగా ఇప్పుడా పరిస్థితి లేదు.
దేశీయ మార్కెట్‌కే పరిమితం
ఈ ఏడాది దేశీయ మార్కెట్‌కే మామిడి పరిమితమైంది. దీనివల్ల సరైన ధర లభించడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధానంగా బంగినపల్లి, తోతాపరిలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు అవుతుంటాయి. చిన్నరసాలు, పెద్దరసాలు ఆంధ్రప్రదేశ్‌లో విక్రయాలు సాగుతుంటాయి. ఈ క్రమంలో గతంలో బంగినపల్లి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు, తోతాపురి టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల ధరకు విక్రయించారు. ఈ సీజన్ ప్రారంభంలో పంట దిగుబడి లేకపోవడంతో బంగినపల్లి రకం టన్ను ధర రూ. 50 వేల వరకు పలికి, క్రమక్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.15- 20 వేలకు చేరింది. అలాగే తోతాపరి కూడా ప్రారంభంలో కొంత మెరుగ్గా ఉన్నా ప్రస్తుతం ధర రూ.10 వేలకే పరిమితమైంది. రాష్ట్రంలో బంగినపల్లి, తోతాపరి, సువర్ణరేఖ వంటి రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఖమ్మం, మంచిర్యాల, వనపర్తి వంటి జిల్లాలు మామిడి సాగులో ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 38,746 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 19,463, మధిరలో 5,483, అశ్వారావుపేటలో 4,823, పాలేరులో 2,409, ఖమ్మంలో 1,953, వైరాలో 1,930, ఇల్లందులో 1,744, కొత్తగూడెంలో 576, పినపాకలో 319, భద్రాచలంలో 42 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
భిన్న పరిస్థితులు
ఏటా మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు విజయవాడ మ్యాంగో మార్కెట్ ద్వారా ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రధానంగా నూజివీడు వెరైటీకి మహారాష్ట్ర, గుజరాత్‌లో మంచి డిమాండ్ ఉండటంతో అక్కడ వ్యాపారులు ప్రత్యేకంగా స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దేశీయ మార్కెట్‌లో నూజివీడు హవా పూర్తిగా తగ్గింది. నూజివీడు తరహా తెలంగాణ మామిడికి మాత్రం కొంత డిమాండ్ పెరుగుతోంది.
పెట్టుబడులూ వచ్చేలా లేవు
మామిడితోటలో పూత ఆలస్యమవటం, మంచు ప్రభావంతో పిందెలు రాలిపోవటంతో 30-35శాతం మాత్రమే కాయలుగా మారాయి. గతేడాది కన్నా ఈసారి అధిక ఆర్థిక భారం పడేలా ఉంది. మార్కెట్ ఆశించిన ధర లేదు.. పెట్టుబడి ఖర్చులూ పూడే పరిస్థితి లేదు. తెగుళ్లు, అకాల వర్షాల నుంచి కాయలను కాపాడుకోవటానికి రక్షణ సంచులు తొడుగుతున్నాం. కాయ సంరక్షణ కూడా ఇబ్బందికరంగా ఉంది.
- జక్కంపూడి కిశోర్, మామిడి రైతు, చండ్రుపట్ల, కల్లూరు



