Wednesday, July 23, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిబరిలో కమ్యూనిస్టు నేత : సంకుల సమరంగా చిలీ అధ్యక్ష ఎన్నికలు!

బరిలో కమ్యూనిస్టు నేత : సంకుల సమరంగా చిలీ అధ్యక్ష ఎన్నికలు!

- Advertisement -

చిలీ చరిత్రలో, బహుశా లాటిన్‌ అమెరికా చరిత్రలో ఇతర పార్టీల పేరుతో కమ్యూనిస్టులుగా, మార్క్సిస్టులుగా ఉన్నవారు పోటీ చేసి గెలిచిన ఉదంతాలున్నాయి గానీ ఒక కమ్యూనిస్టు పార్టీ నేత జీనెటె జారా విశాల వేదిక పేరుతో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన తరఫున పోటీ చేయటం ఇదే ప్రథమం. గతంలో పాబ్లో నెరూడా, గ్లాడీ మారిన్‌ పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావితం చేయలేదు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని చూసినపుడు ఒక కరుడు గట్టిన కమ్యూనిస్టుగా పేరున్న జీనెటె జారా పోటీకి దిగటం చిన్న విషయమేమీ కాదు, సంకుల సమరంగా సాగనున్న పోటీలో 51 ఏండ్ల లాయర్‌, మాజీ మంత్రి అయిన ఆమె గెలిస్తే లాటిన్‌ అమెరికా వామపక్ష రాజకీయాల్లో అదొక మైలు రాయి అవుతుంది. పదిపార్టీలతో కూడిన చిలీ ఐక్య సంఘటన వామపక్ష కూటమి అభ్యర్థి ఎంపికకు జూన్‌29న జరిగిన పోటీలో 60శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ నేత ముందంజలో ఉండటంతో అమెనే అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం అదే ఫ్రంట్‌ నేత గాబ్రియెల్‌ బోరిక్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండవసారి పోటీ చేసే అవకాశం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జారా మంత్రిపదవికి రాజీనామా చేశారు.

జూలై 14వ తేదీన జీనెటె జారా చిలీ ఎన్నికల ట్రిబ్యునల్‌ కార్యాలయానికి వెళ్లి తనను బలపరిచిన పార్టీల నేతలతో కలసి అధికారికంగా విశాల వేదిక పేరుతో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర ప్రంట్‌ తరఫున అభ్యర్థిగా నమోదు చేసుకున్నారు (మన దగ్గర నామినేషన్‌ వంటిదే). నలుగురు మితవాద పార్టీల నేతలు ఆమెతో మొదటి రౌండ్‌లో పడనున్నారని వార్తలు. ఆగస్టు 18వ తేదీలోగా కనీసం 35వేల ఓటర్ల సంతకాల ప్రతిపాదనతో వచ్చిన ప్రతి ఒక్కరిని అభ్యర్థిగా అంగీకరిస్తారు. కొందరు స్వతంత్రులు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. పార్లమెంటు ఎన్ని కలు కూడా ఒకేసారి జరగనున్నందున వివిధ పార్టీలతో కూటములు ఆ సీట్ల సర్దుబాటు యత్నాల్లో ఉన్నాయి. అధ్యక్ష పదవికి తొలి రౌండ్‌లో పోటీ పడినప్పటికీ దామాషా విధానం గనుక కొన్ని పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో సర్దుబాటు చేసుకుంటున్నాయి. వామపక్ష కూటమి క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీతో అవగాహనకు వచ్చేందుకు చూస్తున్నట్లు వార్తలు.

లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు రంగంలో ఉన్న చోట అమెరికా సిఐఏ, మిత వాద, ఫాసిస్టు శక్తులు, నేరగాండ్ల ముఠాలు, వారికి మద్దతుగా నిలిచే మీడియా మొత్తంగా వామపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. చిలీలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే అందరూ రంగంలోకి దిగారు. పచ్చిమితవాది కాస్ట్‌ ప్రధాన స్రవంతి మితవాదిగా ముందుకు రావటం, కమ్యూనిస్టులు పోటీలో ఉండటంతో చిలీ రాజకీయాలను నేరాలు వణికిస్తున్నట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. మితవాద శక్తులకు విజయావకాశాలు ఉండటంతో నవంబరులో జరిగే ఎన్నికలకు ముందు సంఘటిత నేరాలు రాజకీయాలకు ఒక రూపం ఇస్తున్నట్లు పేర్కొన్నది. హింసాత్మక చర్యలు గత పదేండ్లలో రెట్టింపు అయిన కారణంగా జనాలు మిగతా అంశాల కంటే అలాంటి శక్తుల నుంచి రక్షణే ప్రధాన ఎన్నికల అంశంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. దీంతో మూడవసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జోస్‌ ఆంటోనియో కాస్ట్‌కు లబ్ది కలిగినట్లు పేర్కొన్నది. ఇంకా నాలుగు నెలల వ్యవధి ఉండగానే ఒక అభ్యర్థి ముందున్నట్లు చిత్రించటం జనాలను ప్రభావితం చేసే యత్నాలలో ఒకటని వేరే చెప్పనవసరం లేదు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక తప్ప అనుకూలం కాదు.

నేరాలు చిలీలో కొత్త కాదు, వాటిని మాదకద్రవ్యాల ముఠాల వంటి కొన్ని శక్తులు పెంచి పోషిస్తున్నాయి. అలాంటి శక్తులపై చర్యలు తీసుకొనే చిత్తశుద్ధి ఇతర అభ్యర్థులకు లేదని కాస్ట్‌ నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ చెప్పుకుంటున్నది.
లాటిన్‌ అమెరికాలో ఒక విచిత్రమైన స్థితి. అందులో మంచీ,చెడూ రెండూ ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష పద్ధ్దతిలో జరిగితే పార్లమెంటు ఎన్నికలు దామాషా విధానంలో ఉంటాయి. అందువలన అధ్యక్ష పదవిని గెలుచుకున్నవారు పార్ల మెంటులో మెజారిటీ సాధిస్తారని చెప్పలేము. 2021లో జరిగిన చిలీ ఎన్నికల్లో తొమ్మిది పార్టీల వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ గెలిచినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీ లేదు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి వామపక్ష కూటమిలో ఐదు మాత్రమే ఉన్నాయి. చిలీ పోడెమాస్‌ మాస్‌ నాలుగు మితవాద పార్టీల కూటమి 25.43 శాతం ఓట్లతో 155 స్థానాలున్న దిగువ సభ డిప్యూటీస్‌లో 53 సీట్లు తెచ్చుకొని పెద్ద కూటమిగా ఉంది. కమ్యూనిస్టులతో పాటు మరో నాలుగు వామపక్ష పార్టీల కూటమి 20.94శాతం ఓట్లు 37 సీట్లు తెచ్చుకోగా కమ్యూనిస్టులు 12 మంది ఉన్నారు. వామపక్షాలు, ఉదారవాద పార్టీలతో కూడిన ఆరు పార్టీల కూటమి 17.16 శాతం ఓట్లు 37 సీట్లు తెచ్చుకుంది. మిగతా సీట్లను ఇతర పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్ధి తెచ్చుకున్నాడు. ఇలాంటి పరిస్థితేఈ ఏడాది కూడా పునరావృతమైతే కమ్యూనిస్టు జారానే కాదు ఏ పార్టీ గెలిచినా తాము నమ్మిన విధానాలను పూర్తిగా అమలు జరపటానికి కుదరదు, రాజీ పడాల్సిందే. గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వం అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది. అందువలన ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు జరపకపో వటంతో విఫలమైందనే విమర్శలను ఎదుర్కోక తప్పటం లేదు.ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి, అదే మితవాదులు అధ్యక్షులుగా గెలిచినా వారికీ ప్రతిఘటన ఉంటుంది, అది కొంతమేరక ప్రజాఅనుకూల స్థితి.ప్రపంచంలో పెన్షన్‌ సంస్కరణలు కార్మికవర్గానికి ఎంతో నష్టదాయకమైనందున ఆ విధానాన్ని సంస్కరించాలని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నించినా పూర్తిగా కుదరలేదు.

లాటిన్‌ అమెరికాలో 1970 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తొలి వామపక్ష నేత సాల్వడార్‌ అలెండీపై 1973లో మిలిటరీ జనరల్‌ అగస్టో పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. దాన్ని ఎదుర్కొనే క్రమంలో తుపాకి పట్టిన అలెండీ ఆ పోరులో అమరుడుయ్యాడు. అధికారానికి వచ్చిన పినోచెట్‌ 1980లో తన నియంతృత్వాన్ని సుస్థిరం గావించుకొనేందుకు ఒక రాజ్యాంగాన్ని రుద్దాడు. వాడు విధిలేని స్థితిలో 1990లో గద్దె దిగాడు. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రయత్నించి ఒక ముసాయిదాను తయారు చేసి 2022లో జనం ఆమోదానికి పెడితే దాన్ని ఓటర్లు తిరస్కరించారు. అది వామపక్ష భావజాలంతో కూడి ఉందని, విప్లవాత్మకంగా, చాలా పెద్దదిగా ఉందంటూ మీడియా, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున జనం చెవుల్లో విద్వేషాన్ని నూరిపోశాయి. తర్వాత 2023లో నూతన రాజ్యాంగ మండలి మరొక రాజ్యాంగాన్ని ప్రతిపాదించింది. అది మితవాదంతో, మార్కెట్‌ శక్తులకు అనుకూలంగా ఉందనే విమర్శలు వచ్చాయి. జనం దాన్ని కూడా తిరస్కరించారు. ఏతావాతా నియంత పినోచెట్‌ రాజ్యాంగమే ఇప్పుడు అమల్లో ఉంది. కార్మికవర్గానికి అనుకూలమైన రాజ్యాంగం లేకుండా అధికారంలో ఉన్నప్పటికీ వామపక్షాలకు అనేక పరిమితులు ఉంటాయన్నది చిలీ నేర్పిన గుణపాఠం.

పినోచెట్‌ ఎంతగా జనం నుంచి దూరమయ్యాడంటే వాడి పేరు చెప్పుకొని ఎన్నికల్లో పోటీ చేసేందుకు తర్వాత కాలంలో ఎవరూ ధైర్యం చేయలేదు. అయితే పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎనిమిదేండ్లు మిలిటరీ అధిపతిగా, 2006లో చచ్చేంతవరకు సెనెటర్‌గా ఉండేం దుకు పాలకులు సానుకూలంగా ఉన్నారు. జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ మూడవసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇతడు పినోచెట్‌ మద్దతుదారు. పినోచెట్‌ భావజాలంతో ఉన్నవారు గానీ, కమ్యూనిస్టులుగానీ ఇంతవరకు చిలీలో గెలవలేదని, 2025 ఎన్నికలు అసాధారణ మైనవని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పాట్రిసియో నవియా చెప్పాడు. కరోనా సమయంలో అధికారంలో ఉన్న వారి వైఫల్యం 2021ఎన్నికల్లో వామపక్షం గెలవటానికి అవకాశం కల్పించిందని కొందరు చెబుతారు. పినోచెట్‌ అధికారం నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో అమరుడు సాల్వెడార్‌ అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీ నేత మిచెల్లీ బాచ్‌లెట్‌ రెండుసార్లు, మరో ఉదారవాద నేత ఒకసారి మితవాదులు రెండుసార్లు ఎన్నికయ్యారు. అందువలన అలాంటి సూత్రీకరణలు చెల్లవు. అయితే బాచ్‌లెట్‌ పాలన మీద కూడా జనంలో అసంతృప్తి వల్లనే తర్వాత ఎన్నికల్లో వామపక్ష నేతలు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న చిలియన్లు ఆరుశాతం( పది లక్షల మంది) కీలకంగా మారనున్నారని చెబుతున్నారు. గతంలో కూడా వారు ఉన్నారు, అయితే ఈ సారి ఒక కమ్యూనిస్టు నేరుగా రంగంలోకి దిగుతున్న కారణంగా మితవాద శక్తులకు మద్దతుగా వారు పనిచేస్తారని వారి ఓట్లు ఫలితాన్ని తారు మారుచేస్తాయని సూత్రీకరిస్తున్నారు.

కాడెమ్‌ సంస్థ తాజా ప్రజాభిప్రాయసర్వేలో కమ్యూనిస్టు జారాకు 29శాతం, మితవాద కాస్ట్‌కు 27, మిగతా మితవాద శక్తులందరికీ 25శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల నిబంధనావళి ప్రకారం ప్రత్యక్ష పద్ధతిలో జరిగే ఎన్నికలలో 50శాతంపైగా ఓట్లు తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య డిసెంబరు నెలలో మరోసారి ఎన్నికలు జరిపి విజేతను తేలుస్తారు. మితవాదుల మొత్తం ఓట్లు 52శాతం ఉన్నాయి గనుక గంపగుత్తగా రెండవ దఫా ఓటింగ్‌లో పడతాయి గనుక కమ్యూనిస్టు గెలిచే అవకాశం లేదని సూత్రీకరిస్తున్నారు. గత ఎన్నికలలో తొలి దఫా ఏడుగురు పోటీ చేశారు.కాస్ట్‌కు 27.91శాతం ఓట్లు రాగా వామపక్ష అభ్యర్థి గాబ్రియల్‌ బోరిక్‌ 25.82శాతంతో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ముగ్గురు మితవాదులకు వచ్చిన మొత్తం ఓట్లు 53.51శాతం ఉన్నప్పటికీ తుది పోరులో బోరిక్‌ 55.87శాతం ఓట్లతో విజయం సాధించాడు. అప్పుడు కూడా ఎన్నికల పండితులు కాస్ట్‌ గెలుపు గురించి జోశ్యాలు చెప్పారు. ఇదే కాడెమ్‌ సంస్థ ఆ ఎన్నికలలో జరిపిన చివరి సర్వేలో కాస్ట్‌ 29, బోరిక్‌ 27శాతం ఓట్లతో మొదటి రెండు స్థానాల్లో ముందున్న ఉన్నట్లు చెప్పింది. కాడెమ్‌ అనే సంస్థ తాజాగా ప్రకటించిన రేటింగ్‌ ప్రకారం జారా 29, కాస్ట్‌ 27, కొద్ది నెలల క్రితం ప్రధాన నేతగా ముందుకు వచ్చిన మరో మితవాద నాయ కురాలు ఎవలిన్‌ మత్తరు 14శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. కమ్యూనిస్టు జారా జూలై ఆరవ తేదీన ఒక సంస్థ సర్వేలో ఆమెకు 39శాతం మద్దతు వున్నట్లు తేలింది. ఇంకా నాలుగు నెలల వ్యవధిలో ఏ మార్పులు జరుగుతాయో, ఏ అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది.
ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -