బాధితులను పరామర్శించిన నాయకులుొ ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి
ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి : సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్
ఖమ్మంనగరంలోని వెలుగుమట్ల పరిధిలో గల భూదాన్ నిర్వాసితులను సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ నాయకులు గురువారం పరామర్శించారు. భూదాన్ భూములలో ఇండ్లు లేని సుమారు వెయ్యి నిరుపేద కుటుంబాలు గత కొన్ని సంవత్స రాలుగా ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఆ ఇండ్లను రెండు రోజుల క్రితం రెవెన్యూ, మునిసిపల్, పోలీసు సిబ్బంది సం యుక్తంగా నివాసితులను ఖాళీ చేయించి, ఆ ఇండ్లను ధ్వంసం చేశారు. బాధితులను అంబేద్కర్ భవన్‌కు తరలించారు. ఈ ఘటనను ఖండిస్తూ గురువారం జిల్లాకు చెందిన కమ్యునిస్టు పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ భవన్‌కు వెళ్ళి భూనిర్వాసిత బాధితులను పరామర్శించారు.
సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సిపిఐ(ఎం) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, మధు తదితరులు బాధి తులను పరామర్శించి అండగా ఉంటా మని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ వెలుగుమట్ల ఘటన చాలా అమానుషం అన్నారు. నిరుపేదలకు, ఇండ్లు లేని వారికి వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని, ఆ భూములకు పట్టాలున్నాగానీ రెవెన్యూ రికార్డులలో నమోదు లేదని, దౌర్జన్యంగా వందల మందిని ఇండ్లలో నుంచి ఖాళీ చేయించి ఇండ్ల కూల్చివేత దుర్మార్గమన్నారు. వారికి తిరిగి ఇండ్లను నిర్మించి ఇచ్చే వరకు కమ్యునిస్టు పార్టీలు కలిసి పోరాడతామని అన్నారు.
నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారుల దౌర్జన్యంను ఖండించారు. సొంత ఇంటి కళ నెరవేర్చే ప్రభుత్వం మాదే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మబలుకుతూ ఈ రకంగా పేదలపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన బాధితులకు అక్కడే ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ళ జాబితాలో వారికి ఇండ్లు కేటాయించాలని, ప్రతి ఇంటికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్ళి కలెక్టర్ అనుదీప్‌కి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తగు న్యాయం చేస్తాముని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెలుగుమట్ల సంఘటనా స్థలికి వెళ్ళి అధికారులు కూల్చిన బాధితుల ఇండ్ల నష్టాన్ని అంచనా వేశారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు వై.విక్రమ్, సింగు నరసింహారావు, భారతి, ఎర్రా శ్రీను వాసురావు, రామయ్య, సాంబశివరెడ్డి, మెరుగు సత్యనారాయణ, సివై.పుల్లయ్య, వై.ప్రకాష్, ఝాన్సీ శిరోమణి, ఎస్కే కాశీం, గొర్రెపాటి రమేష్, రామయ్య, శ్రావణ్, మస్తాన్, శ్రీకాంత్, ఉదయ్ పాల్గొన్నారు.



