Monday, November 3, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో కంపెనీల ఇష్టారీతి దోపిడీ

ఏపీలో కంపెనీల ఇష్టారీతి దోపిడీ

- Advertisement -

– మూడేళ్లల్లో వసూలు చేసిన ప్రీమియం రూ.5,850 కోట్లు
– రైతులకు చెల్లించిన పరిహారం రూ.930 కోట్లు
– వాతావరణ బీమాకు రూ.1,567 కోట్లు తీసుకొని ఇచ్చింది సున్నా
– అన్నదాతకు అక్కరకు రాని పంటల బీమా
అమరావతి :
కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాలు.. తరచు విపత్తులతో నష్టాలను చవిచూస్తున్న రైతులకు అక్కరకు వచ్చే బదులు ఇన్సూరెన్స్‌ కంపెనీల ఇష్టారీతి దోపిడీకి బాగా పనికొస్తున్నాయని గడచిన మూడేళ్ల అనుభవాలు కుండబద్దలు కొడుతున్నాయి. ఈ విచ్చలవిడి దోపిడీలో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలదే హవా. కేంద్ర స్కీంలు ఫసల్‌ బీమా, పునర్వ్యస్థీ కరించిన వాతావరణ బీమా పథకాల్లోకి 2022 ఖరీఫ్‌ నుంచి నాటి వైసిపి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చేరింది మొదలుకొని టిడిపి కూటమి సర్కార్‌ తొలి ఏడాది 2024 రబీ వరకు రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కంపెనీలకు దాదాపు రూ.5,860 కోట్లు చెల్లించగా, విపత్తుల బారినపడ్డ రైతులకు ఇప్పటికి చెల్లించిన పరిహారం రూ.930 కోట్లు మాత్రమే. కంపెనీలు రూ.4,930 కోట్లు లాభాలు మూటగట్టుకున్నాయి. వసూలు చేసిన గ్రాస్‌ ప్రీమియంలో కేవలం 15 శాతమే రైతులకు తిరిగి పరిహారం రూపంలో చెల్లించాయి. గడచిన మూడేళ్లల్లో ఫసల్‌ బీమా కింద కంపెనీలు రూ.4,294 కోట్లు గ్రాస్‌ ప్రీమియం వసూలు చేసి రూ.930 కోట్లు రైతులకు పరిహారం చెల్లించాయి. వాతావరణ ఆధారిత బీమా కింద రూ.1,560 కోట్లు ప్రీమియం తీసుకొని రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. మొత్తంగా కంపెనీలు 85 శాతం లాభాలను తమ బొక్కసంలో వేసుకున్నాయి. ఇంత భారీ లాభం మరే వ్యాపారంలోనూ ఉండదేమో! కంపెనీలకు చెల్లించే ప్రీమియం సొమ్మును అన్నదాతలకు మళ్లించి నేరుగా సాయం చేస్తే కొంత మేరకైనా నగదు సాయం వారి చేతికందేది.

సాగుదార్లకు సున్నం
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అంతకుముందున్న పంటల బీమా పథకాలను రద్దు చేసి 2016 ఖరీఫ్‌ నుంచి ఫసల్‌, వాతావరణ బీమాలను తీసుకురాగా, ఆ సమయంలో ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న టిడిపి ప్రభుత్వం మన రాష్ట్రంలోనూ వాటిని మక్కిమక్కికి అమలు చేసింది. రైతులకు ఆ స్కీముల వలన ప్రయోజనం కలగట్లేదంటూ 2019లో అధికారంలోకొచ్చిన వైసిపి ఆ ఏడాది రబీ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి కంపెనీలతో ప్రమేయం లేకుండా తానే నిర్వహించింది. తదుపరి కేంద్రం ఒత్తిళ్లతో, 2022 ఖరీఫ్‌ నుంచి కేంద్ర పథకాల్లో చేరింది. ఆ సంవత్సరం ఫసల్‌ స్కీము ఒక్కటే కంపెనీల నిర్వహణకు అప్పగించి వాతావరణ బీమాను తానే నిర్వహించింది. 2023 ఖరీఫ్‌ నుంచి రెండు పథకాలనూ కంపెనీల నిర్వహణకు అప్పగించింది. తొలేడాది ఖరీఫ్‌లోనే ఫసల్‌ స్కీంలో చెప్పుకోతగ్గ స్థాయిలో రైతులకు పరిహారం అందింది. అటు వైసిపి హయాంలో కానీ నేటి కూటమి ప్రభుత్వంలోకానీ కంపెనీల నుంచి పరిహారం అందింది చాలా తక్కువ. వైసిపి సర్కార్‌ ప్రీమియం నిధులు సకాలంలో చెల్లించకపోవడం వలన క్లెయిములు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం తన హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు. పైగా ఉచిత పంటల బీమా ఎత్తేసి రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించుకోవాలని నిబంధనలు మార్చడం తో పథకాలు అంతంతమాత్రంగా తయారయ్యాయి.

కొసరంత..
కంపెనీలు రంగప్రవేశం చేశాక 2022 ఖరీఫ్‌లో ఫసల్‌ బీమాలో 25.28 లక్షల మంది రైతులు చేరితే 3.43 లక్షల మందికి పరిహారం అందింది. ఆ ఏడాది రబీలో 15.22 లక్షల మందికిగాను 64 వేల మందికి, 2023 ఖరీఫ్‌లో 22.68 లక్షల మందికిగాను 98 వేల మందికి, ఆ ఏట రబీలో 12.92 లక్షల మందికిగాను 1.43 లక్షల మందికి కొద్దిపాటి పరిహారం దక్కింది. కూటమి వచ్చాక 2024 ఖరీఫ్‌లో ఉచిత పంటల బీమా అమలు చేశారు. ఆ సీజన్‌లో 24.05 లక్షల మంది రైతులు ఫసల్‌ బీమాలో చేరగా 82 వేల మందికి 8.53 కోట్ల పరిహారం అందింది. ఆ సంవత్సరం రబీ నుంచి ఉచిత బీమా ఎత్తేశారు. అప్పుడు 2.91 లక్షల మంది రైతులు పథకంలో చేరగా ఒక్క క్లెయిము కూడా సెటిల్‌ కాలేదు.

వెదర్‌.. జీరో
2023 ఖరీఫ్‌ నుంచి వాతావరణ బీమా నిర్వహణ కంపెనీల చేతుల్లోకి వెళ్లింది. ఆ సీజన్‌లో వెదర్‌ బేస్డ్‌ స్కీంలో 7.40 లక్షల మంది రైతులు చేరారు. వందల కోట్ల ప్రీమియం కంపెనీల గల్లా పెట్టెల్లో పడగా ఒక్క రూపాయి అయినా రైతులకు చెల్లించలేదు. 2023 రబీలో 1.92 లక్షల మంది రైతులు, కూటమి సర్కార్‌ వచ్చాక 2024 ఖరీఫ్‌లో 8 లక్షల మంది, ఆ ఏడాది రబీలో 15 వేల మంది వాతావరణ బీమా పథకంలో నమోదుకాగా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. ఈ కాలంలో విపత్తులు లేవా అంటే అదేమీకాదు. తుపాన్లు, భారీవర్షాలు, వరదలు, కరువులతో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లినా కంపెనీలు రైతులకు పరిహారం ఇవ్వలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -