Wednesday, April 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేరళంతో తెలంగాణను పోల్చడం సీఎం రేవంత్‌రెడ్డి అవివేకం

కేరళంతో తెలంగాణను పోల్చడం సీఎం రేవంత్‌రెడ్డి అవివేకం

- Advertisement -

మోడీకి బీ-టీమ్‌గా రేవంత్‌రెడ్డి
తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్‌కు అక్కడా.. ఇక్కడా పుట్టగతులుండవ్‌
ఐక్యరాజ్యసమితి మాటలు బేఖాతర్‌ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సామ్రాజ్యవాద దేశాలకు మోకరిల్లుతున్న మోడీ
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
పేదరికం పూర్తిగా నిర్మూలన చేసిన కేరళం రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తిస్తే.. తెలంగాణ సీఎం మాత్రం నేటికీ దారిద్రరేఖకు దిగువన ఉన్న తెలంగాణను ఆ రాష్ట్రంతో పోల్చడం ఆయన అవివేకానికి నిదర్శనమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి కేసు నుంచి బయట పడటానికి మోడీకి బీటీమ్‌గా మారారని ఆరోపించారు. ఉద్యమ పార్టీ సీపీఐ(ఎం)పై రేవంత్‌రెడ్డి తీరు మార్చుకోపోతే కేరళంతోపాటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలు అమలు చేయకుండా.. వారి పాలన గురించి చెప్పుకోలేని దుర్భర స్థితిలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని విర్శించారు. కేరళంలో సాగుకు యోగ్యం కాని భూములే అధికంగా ఉన్నా.. అక్కడి శాస్త్రీయ పద్ధతితో సాగు చేసి రైతుల కష్టాలను తీర్చిన ఘనత ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానిదని చెప్పారు. 100 శాతం అక్షరాస్యత ఉన్న కేరళంలో విద్యారంగానికి వార్శిక బడ్జెట్‌లో 13 శాతం నిధులు కేటాయిస్తే.. 76 శాతం అక్షరాస్యత ఉన్న తెలంగాణ లో 8 శాతం నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కేరళంలో వార్శిక బడ్జెట్‌ లక్ష 98 వేల కోట్లలో 13 శాతం విద్యారంగానికి కేటాయిస్తే.. 3లక్షల కోట్లపైగా ఉన్న తెలంగాణ బడ్జెట్‌లో 8.5శాతం మాత్రమే కేటాయించారని విమర్శించారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలు విస్మరించడంతో పీజీలు, డిగ్రీలు చేసిన వారు అడ్డాకూలీలుగా బతుకుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో వేలాది మంది రూ.5 బోజనం చేస్తూ.. కోచింగ్‌లకు పోయి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కేరళం తరహా పాలన తెలంగాణలో ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. కేరళంలో ఏదైనా కారణం చేత పరిశ్రమలు మూతపడితే కార్మికులు రోడ్డున పడరాదని ప్రభుత్వమే తిరిగి కంపెనీని తెరిచి కార్మికులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. తెలంగాణలో కొత్త కంపెనీలో ఏమోకానీ ఉన్న కంపెనీలే మూత పడుతున్నాయన్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మోడల్‌ అన్న రేవంత్‌రెడ్డి.. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి మహిళకూ నెలకు రూ.2500, రైతు కూలీలకు ఏడాదికి 12వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, దళిత యువత కోసం రూ.12 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో లక్షలాది ఎకరాల ఫారెస్టు, పోడు భూములు ఉండగా ఎకరా అయినా పేదలకు పంచకపోగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 50 వేల ఎకరాలు లాక్కున్నారని గుర్తు చేశారు. కేరళంలో 5లక్షలతో పక్కా ఇండ్ల నిర్మాణం చేసి పేదలకు ఇచ్చారని వివరించారు. అక్కడ విద్య, వైద్యం 90 శాతం ప్రభుత్వ పరిధిలోనే నడుస్తోందని, తెలంగాణలో వైద్యం అందక ఆదివాసీలు పిట్టల్లా రాలుతున్నా రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో బుల్డోజర్‌ పాలన నడుస్తోందని, పేదల ఇండ్ల జోలికెళ్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. వందల కోట్లు ఖర్చు చేసి గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించి.. వందల పరిశ్రమలు, లక్షల కోట్లలో పెట్టుబడులు వస్తాయని చెప్పిన సీఎం తెలంగాణకు కనీసం వెయ్యి కోట్లు కూడా తేలేదని విమర్శలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ విధ్వంసానికి కారణమౌతున్న సామ్రాజ్యవాది అమెరికా దేశాధ్యక్షులు ట్రంపునకు మన ప్రధాని మోడీ మోకరిల్లుతూ.. యుద్ధాన్ని వ్యతిరేకించడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. అనేక దేశాల సలహాలతోపాటు ఐక్యరాజ్య సమితి సూచనలను సైతం బేఖాతర్‌ చేస్తూ.. ఇరాన్‌ను ఒక్క రోజుతో మట్టుబెడతానని హెచ్చరించడం ట్రంప్‌ యుద్ధ దాహానికి నిదర్శనమన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌ ఇజ్రాయిల్‌తోపాటు వెనెజుల, క్యూబా వంటి దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించడం అగ్రరాజ్య ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎ.రాములు, కార్యదర్శివర్గ సభ్యులు కిల్లెగోపాల్‌, కురుమూర్తి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -