Sunday, September 14, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికారుణ్యత

కారుణ్యత

- Advertisement -

ఒక్కోసారి మనం చిత్రమైన సంఘటనలను చూస్తాము. బహునాటకీయంగా ఉంటూ హాస్యం పండిస్తుంటాయి. ప్రవృత్తికి భిన్నంగా, ఆలోచనలకు ఆపోసిట్‌గా మాట్లాడటమో, ప్రవర్తించటమో ఎవరైనా చేస్తున్నప్పుడు ఆశ్చర్యచకితులమవుతాం. సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా కనపడుతుంటాయి. తన చేతులతోనే ఎదుటి మనిషిని కత్తితో పొడిచి, చేతికి అంటిన రక్తాన్ని…అబ్బో ఈరక్తాన్ని నేను చూడలేనని కడిగేసుకోవటం చిత్రసన్నివేశాల్లో కనిపి స్తుంది. అనేక కథలూ మనకున్నాయి. నిత్యం ఏ జీవినో ఆహారంగా తీసుకోకుండా బతకలేని తోడేళ్లు, జీవహింసపై ఉపన్యాసాలు దంచితే ఎలా ఉంటుంది! వేటాడటం నాగరికం కాదని క్రూరమృగం ప్రకటించడం విన్నపుడు భలే చిత్రంగా అనిపించదూ! ఇలాంటి సంఘటనలూ, సందర్భలూ చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గల్పిక గుర్తుకొస్తూఉంటుంది. ఇద్దరు వ్యక్తులు, ఒకడు బక్కపలచనివాడు హింసలేకుండా ఏదీ ఉండదనీ, చివరి గెలుపు హింస ద్వారానే జరుగుతుందనీ, రెండవవాడు కండలు తిరిగిన బలాఢ్యుడు అహింసదే గెలుపని, అదే శిరోధార్యమని వాదనకు దిగుతారు. ఇద్దరూ చాలా భీకరంగా వాదోపవాదాలు చేస్తూ గొడవ పెరుగుతుంది. సమాజంలో ప్రకృతితో ఘర్షణ ఉంటుంది. పదినెలలు మోసిన తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికీ తన రక్తాన్ని ధార పోస్తుంది అని బక్కపలచనివాడి వాదనకు బలం చేకూరుతుండగా, బలాఢ్యుడికి కోపం వచ్చి, లేదు అహింసయే, నేను చెప్పేదే నిజమైనది అని కోపోద్రికుడై, ప్రతివాదిపై లంఘించి తలపై మోది చంపేప్తాడు. ఇదిగో చూడండి అహింస అనే నా వాదనే గెలిచింది అని విజయగర్వాన్ని ప్రదర్శిస్తాడు. ఇదీ కథ. ఇలాంటి వాళ్లు అహింసను, శాంతిని గురించి మాట్లాడటము బహుచిత్రము కదా!

ఇప్పుడు మన ప్రధాని మోడీగారి ప్రకటన చూసిన మీదట ఇవన్నీ గుర్తుకువస్తున్నాయి. నేపాల్‌లో హింస చెలరేగటాన్ని చూసి, దయార్ద్ర హృదయం చలించిపోయింది. నేపాల్‌లో జరిగిన విధ్వంసంలో అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధను కలిగించింది. ఇప్పుడక్కడ స్థిరత్వం, శాంతి నెలకొనాలని, అక్కడి సోదర సోదరీమణులను శాంతికి మద్దతివ్వమని కోరడం చాలాబాగుంది. ఎవరైనా కోరుకోవడం వేరు, మన మోడీగారు శాంతిని కోరుకుని, ప్రాణాలపై వేదన పడటం కొంత కొత్తగా అనిపించింది. ఇదే మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మారణకాండలో వందలాది మంది చంపబడటం, దానికి ప్రభుత్వం పరోక్షంగా తోడ్పడటం చరిత్ర నెత్తుటిపుట మనకింకా గుర్తేఉంది.అప్పుడు ఈయన హృదయం చెమ్మగిల్లలేదు. అయ్యో అని కూడా అనలేదు. ఢిల్ల్లీలో ఎన్‌ఆర్‌సి ఉద్యమం, షహన్‌బాద్‌ హింసకు కారకులు, శాంతియుత రైతు ఉద్యమంపై పోలీసుల హింసాత్మకదాడులు, హత్యలు చేయడాన్ని కూడా మన మోడీ గొంతు మాట్లాడించలేకపోయింది.

మొన్న ఉగ్రదాడిలో మరణించిన కాశ్మీర్‌ యాత్రికుల గురించీ కన్నీటి బొట్లులేవు! అంతెందుకు ఈ దేశంలోనే మణిపూర్‌ అనేక నెలలుగా హింస చెలరేగి నిట్ట నిలువునా తెగబడుతుంటే హృదయం చలించాలి, కన్నీళ్లు రావాలి, ఏమైనది? ఆ గొడవలకు సూత్రధారులే వీళ్లు కదా! కగార్‌ పేరుతో బస్తర్‌, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఆదివాసీ అమాయకులను, నక్సలైట్లను కాల్చివేస్తున్నప్పుడూ ఈయన గుండె నిబ్బరంగానే ఉంది. ఇక మనదేశంలో అనేక దశాబ్దాలుగా సత్సంబంధాలు కలిగి ఉన్న పాలస్తీనా గాజాలో రెండేండ్లుగా విధ్వంసం సృష్టిస్తూ వేలాది మందిని, పసిపిల్లలను ఇజ్రాయిల్‌ చంపుతుంటే, ఈ కరుణామయుని గుండె కరగలేదు.కనీస మానవత్వం ఉన్నవారెవరైనా గాజాపై దాష్టీకాన్ని వ్యతిరేకిస్తారు కదా! పోనీ ఖండించకపోగా, అట్లాంటి క్రూరత్వానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌కు అతిథ్యమిచ్చి వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం ఎంత దారుణ కారుణ్యత! ఇలాంటి వ్యక్తులు నేపాల్‌ను చూసి తెగ బాధపడిపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది.

ఇక ఎన్నికల బాండ్లపేరుతో, అదానీ, అంబానీలకు లక్షలాది కోటుల రాయితీలుగా ఎగ్గొట్టిన బడాబాబులకు కొమ్ముకాయటం, ఓట్‌చోరీతో ఎన్నికల్లో గెలవటం వెనకాల ఉన్న అవినీతి నేపాల్‌కంటే ఎన్నోరెట్లు ఎక్కువ కాదా! దశాబ్దానికి పైగా సామాన్య ప్రజలపై పన్నులు వసూలు చేసి, భారాలు మోపి జనం మూలుగులు పీల్చిన ఈ పరి పాలనపై తిరుగుబాట్లు రాకుండా, ప్రశ్నించేవాళ్లను నిర్భందించి, అణచివేస్తున్నప్పు మీకు శాంతి పలుకులు అవసరమే. ”స్వయంగా నియంతగా ఉంటూ సామాన్యుల రక్తాన్ని పీల్చుకుంటూ అవినీతి పరులకు, మోసగాళ్లకు పోషకుడిగా ఉన్న వ్యక్తి, నేపాల్‌లో శాంతికోసం విజ్ఞప్తి చేస్తున్నాడని” సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఐ.పి.సింగ్‌ అన్న మాటలు వాస్తవమనే అనిపిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -