Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాడార్‌ సెంటర్‌ వల్ల అటవీ నష్టాన్ని పూరించండి

రాడార్‌ సెంటర్‌ వల్ల అటవీ నష్టాన్ని పూరించండి

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికారాబాద్‌ జిల్లా దామగుండంలోని అటవీ ప్రాంతంలో రాడార్‌ కేంద్ర ఏర్పాటు వల్ల అటవీ సంపద నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. చెట్లను కొట్టేస్తే వాటిని వేరే ప్రాంతంలో నాటి బతికించాలని సూచించింది. చెట్లపై ఉండే జీవవైవిధ్యానికి నష్టం చేకూరకుండా చేయాలని కోరింది. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని తెలిపింది. రాడార్‌ కేంద్రం ఏర్పాటు వల్ల అటవీ ప్రాంతంలో చెట్లకు చేకూరే నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

రాడార్‌ ప్రాజెక్ట్‌ కేంద్రానికి 2,900 ఎకరాల దామగుండం అటవీ భూములను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దామగుండం ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ జేఏసీ వేసిన పిల్‌పై తదుపరి విచారణ వచ్చేనెల 20వ తేదీకి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రాజెక్ట్‌ కోసం 2,900 ఎకరాలకుపైగా భూమిని కేటాయించినప్పటికీ, ఈ ప్రాంతంలోని భారీ వృక్షాలు, జంతువులు, పక్షులకు నష్టం చేకూతుందని పిటిషనర్‌ వాదించారు. చెట్ల నరికివేత తక్కువగా ఉండాలనీ, ప్రాథమిక క్లియరెన్స్‌ ఈ షరతులను పాటించాలని అమికస్‌ క్యూరీ వివేక్‌ జైన్‌ కోర్టుకు తెలిపారు. అనివార్యమైతేనే చెట్ల నరికివేత చేపడతామని వివరించారు.

నల్లగండ్ల నాలా ఆక్రమణపై పిల్‌
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నల్లగండ్లలోని నాలాను ఆక్రమించి వెర్టెక్స్‌ కింగ్‌స్టన్‌ పార్క్‌ ప్రాజెక్టు పనులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌కు నెంబర్‌ కేటాయించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు రిజిస్ట్రీకి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నల్లగండ్లలోని నాలాను మెస్సర్స్‌ వెర్టెక్స్‌ హోమ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఆక్రమించిందనే పిల్‌కు నెంబర్‌ కేటాయింపునకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తిరస్కరించింది. పిల్‌పై విచారణ చేస్తామని ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -