కుటుంబ సభ్యులకు అందించిన ఏడీఈ వెంకటరత్నం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పరిహారం ఏదైనా బాధితులకు సకాలంలో పొందితేనే సార్ధకత.పరిహారం అందించాలనే ఆతృత అధికారుల దృష్టిలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ప్రమాదం జరగాలని ఎవరూ కోరుకోరు కాని ప్రమాద బాధితులకు మేలు చేయాలనే సామాజిక బాధ్యత కలిగివుండటం అధికారుల చిత్త శుద్ధికి తార్కాణం.
అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం కు చెందిన పసుపులేటి చిన్న పోలయ్య(50),దమ్మపేట మండల వాసి చిట్టేటి సూర్య చంద్రం( 45) గతేడాది (2024) పామ్ ఆయిల్ తోటలో గెలలు కోస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించారు. ఆయా ప్రమాద బాధితులకు తెలంగాణా ఉత్తర విద్యుత్ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ 10 లక్షల నష్ట పరిహారం మంజూరి అయింది.
ఆ మొత్తాన్ని మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం తన కార్యాలయంలో ఏడీఈ బి.వెంకటరత్నం అందజేసారు. గతేడాది ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదాల ద్వారా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నాలుగు కుటుంబాలకు రూ.20 లక్షలు మంజూరు అయ్యాయని ఏడీఈ వెంకటరత్నం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
ముఖ్యంగా అశ్వారావుపేట మరియు దమ్మపేట మండలాల పరిధిలో పామ్ ఆయిల్ తోటలలో పనిచేసేటప్పుడు గెలలు కోసేటప్పుడు విద్యుత్ లైన్ లో పట్ల జాగ్రత్తగా ఉండాలని, నాణ్యమైన ఐఎస్ఐ మార్క్ కలిగిన విద్యుత్ పరికరాలనే వినియోగించాలని అన్నారు. ఉతికిన బట్టలు అర బెట్టు కోడానికి ఐరన్ తీగల కి బదులుగా నైలాన్ దారంను వాడుకోవాలని సూచించారు. రైతుల స్టార్టర్స్ , మోటార్ పంపు సెట్ లను ఎర్తింగ్ చేసుకోవాలని, పశువుల్ని లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరలో ఉంచ కూడదని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ లైన్స్ తెగిపడిన, కరెంట్ స్తంభాలు విరిగి పడినట్లు గుర్తించినా వెంటనే విద్యుత్ సిబ్బందికి గాని, తెలంగాణ ఉత్తర విద్యుత్ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి కాల్ చేయాలని తద్వారా వినియోగదారులు ప్రమాద రహిత విద్యుత్ ను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట,దమ్మపేట ఏఈ లు జి.రవి,సాయి కిరణ్, సబ్ ఇంజనీర్లు కే.విజయ్ క్రిష్ణ, ఎం.శివ శంకర్,ఇతర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.