సిగాచీ బాధిత కుటుంబాలకు అండగా సీఐటీయూ
కోటి రూపాయలిస్తామని రూ.25 లక్షలే ఇవ్వడం దుర్మార్గం
ఈ ఘోరఘటనకు కారణమైన పరిశ్రమపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : అంజయ్యభవన్ ఎదుట ధర్నాలో చుక్కరాములు, పాలడుగు భాస్కర్, ఎస్.వీరయ్య
కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిగాచీ పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రకటించిన రూ. కోటి పరిహారం రెండు, మూడు రోజుల్లో ఇవ్వకుంటే సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీస్తామనీ, ఆయన ఇంటి ఎదుట ధర్నా చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య హెచ్చరించారు. సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 54 మంది కార్మికులకు చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ లోని కార్మిక శాఖ కమిషనరేట్ (అంజయ్య భవన్) ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామనీ, ఆ కంపెనీపై చట్టపర చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
అంతకుముందు ధర్నానుద్దేశించి చుక్క రాములు మాట్లాడుతూ… యాజమాన్యంతో ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇప్పిస్తామన్న హామీ వంద రోజులైనా నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు. కంపెనీ యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడమేంటని ప్రశ్నించారు. ఘోర దుర్ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా కార్మిక, పరిశ్రమల శాఖలు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని నిలదీశారు. తీవ్రంగా గాయపడిన కార్మికులు జీవచ్ఛంలా పడి ఉండాల్సిందేననీ, వారికి కూడా పూర్తి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి జీతాలివ్వకుంటే అదే కంపెనీని నమ్ముకుని బతుకుతున్న కార్మికులు కుటుంబాల జీవనం ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. అదే విధంగా పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. సిగాచీ బాధిత కార్మికులకు న్యాయం జరిగే వరకు సీఐటీయూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ కంపెనీలో పనిచేసే కార్మికుల్లో అత్యధిక మంది బీహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్, అస్సాం, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులేననీ, బాధిత కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయి నెలల తరబడి కంపెనీ ఆర్థిక సహాయం కోసం ఇక్కడ పడిగాపులు కాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజు హడావిడి చేసిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? యాజమాన్యంతో ఇప్పిస్తుందా? అనే విషయాన్ని వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు.
ఎస్.వీరయ్య మాట్లాడుతూ… ప్రమాద ఘటన జరిగిన మరుసటి రోజు ముఖ్యమంత్రి, మంత్రులు ఘటనా స్థలాన్ని సందర్శించి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున యాజమాన్యంతో నష్టపరిహారం ఇప్పించి ఆదుకుంటామని హామీనిచ్చి నేటికీ న్యాయం చేయకపోవడం దుర్మార్గమన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ఇప్పించడం లేదని నిలదీశారు. కాలం చెల్లిన యంత్రాలు, రియాక్టర్లతో సిగాచీ యాజమాన్యం పని చేయిస్తుంటే కార్మిక, పరిశ్రమల శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. జీవచ్ఛవాలుగా పడి ఉన్న క్షతగాత్రులైన కార్మికులకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కార్మిక కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఒకే విడతలో ఇవ్వాలని కోరారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కమిటీ కన్వీనర్ ఎ.మాణిక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్, ఎస్వీ.రమ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, పద్మశ్రీ రాష్ట్ర నాయకులు సోమన్న, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగారెడ్డి, నాయకులు శాంతకుమార్, రాజు, తలారి శ్రీనివాస్, నాగ ప్రసాద్, వెంకటేష్, చంద్రయ్య, బంగార్రాజు, పుల్లంరాజు, శంకరయ్య, నరసింహారెడ్డి సిగాచీ పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.