పిప్పల్‌కోటి నిర్వాసితులకు పరిహారం తగ్గింపు అన్యాయం..
భూనిర్వాసితుల పక్షాన సీపీఐ(ఎం) పోరాటాలు
రైతుకు అన్యాయం చేస్తే ఉపేక్షించం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రాజెక్టుల పేరుతో భూములు సేకరించి పరిహారం అందించడంలో భూనిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, చట్ట ప్రకారం వారికి పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. నిర్మాణాలకు నిధులు పెంచుతూ.. రైతులకు పరిహారం చెల్లించేందుకు నిర్ణయించిన ధరను మాత్రం తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించి, పరిహారం కోసం పోరాటం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు. రైతుల పక్షాన సీపీఐ(ఎం) పోరాటాలు చేస్తోందని, రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భూనిర్వాసితులకు మార్కెట్ ధర ప్రకారం మూడింతలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో కోల్పోయి న భూమికి బదులు భూమివ్వాలని, అలా కాకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ రింగ్‌రోడ్డు చుట్టూ ఏర్పాటు చేస్తున్న రైల్వేలైన్ కోసం భూసేకరణ చేపట్టిన ప్రభుత్వం మార్కెట్ ధరకు మూడింతలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పిప్పల్‌కోటి భూనిర్వాసితులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం అయితే.. ఎకరానికి రూ.కోటి 20లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ రైతులు అడుగుతున్న రూ.18లక్షలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి పరిహారం కోసం ఎదురు చూసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిహారం సాధించుకోవడానికి పోరాటాలు చేసేందుకు రైతులు ముందుకు రావాలని, రాష్ట్ర రాజధానిలోని ప్రజాభవన్‌ను ముటడ్డించి ప్రభుత్వం మెడలు వంచుదామని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, జిల్లా సీనియర్ నాయకులు లంక రాఘవులు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొళ్ల కిరణ్, పిప్పల్‌కోటి భూనిర్వాసితుల సంఘం కన్వీనర్ నసీరొద్దీన్, కోకన్వీనర్ దోనిపెల్లి స్వామి పాల్గొన్నారు.
జాన్‌వెస్లీకి భూనిర్వాసితుల ఘన స్వాగతం
గ్రామానికి చేరుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నాయకులకు రైతులు వర్షంలోనూ ఎడ్లబండ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా గ్రామ ముఖ్య కూడలికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ముందు భూనిర్వాసిత రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.