‘పిప్పల్‌కోటి’ నిర్వాసితులను ఆదుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి రిజర్వాయర్ నిర్వాసితులకు ‘భూసేకరణ చట్టం 2013’ ప్రకారం పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోతున్న రైతుల భూములను పరిశీలించి బాధితులతో మాట్లాడినట్టు ప్రకటించారు. 2018లో ఎగువన పిప్పల్‌కోటి రిజర్వాయర్ కరకట్ట పనులను ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుందన్న ఆశతో తమ అవసరాలకు అప్పులు చేశారని తెలిపారు. పరిహారం అందక, అప్పులు తీర్చలేక ఇప్పటికే నలుగురు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల జీవన పరిస్థితులు దయనీయంగా మారిన నేపథ్యంలో వారికి వెంటనే నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలనీ, వ్యవసాయ కార్మిక కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు.
”పెన్‌గంగా నదిపై చనాఖ-కోర్ట గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. ఇక్కడ కేవలం 0.8 టీఎంసీల నీరు మాత్రమే వున్న చోట వర్షాకాలంలో 5 టీఎంసీలకు పైగా వచ్చే విధంగా నీటి సద్వినియోగం కోసం ‘పిప్పల్‌కోటి రిజర్వాయర్’ కరకట్ట పనులు ప్రారంభించింది. 1.4 టీఎంసీల నిల్వ సామర్థ్యం కోసం 1200 ఎకరాల్లో రిజర్వాయర్‌ను, 180 ఎకరాల విస్తీర్ణంలో 4.2 కిలోమీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణాన్ని చేపట్టింది. ఇది కాకుండా కాల్వలు, నీటి నిల్వ కోసం మరో 1000 ఎకరాల సేకరణకు పూనుకున్నది. ఇప్పటికీ మొత్తం 198 మంది రైతుల దగ్గర భూసేకరణ చేశారు. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, ఏండ్లు గడిచినా పూర్తి కాలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.369 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెరిగింది. తీసుకున్న భూములకు 2018లో అప్పటి ప్రభుత్వం ఎకరాకు రూ.8 లక్షలని చెప్పి, రూ.7.8 లక్షలే ఇస్తామని జీవో నెం.120ని తెచ్చింది….” అని జాన్‌వెస్లీ లేఖలో ప్రస్తావించారు.
ఒకవైపు భూముల విలువలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎకరాకు రూ.18 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని జాన్‌వెస్లీ ఆ లేఖలో పేర్కొన్నారు. నష్ట పరిహారం కోసం మూడేండ్ల క్రితమే రైతులు నెలరోజుల పాటు నిరసనలకు దిగారని తెలిపారు. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు రైతులకు మద్దతు ప్రకటిస్తూ, అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. నేటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధిత రైతులు మరోసారి పోరాటాన్ని ప్రారంభించారన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించి, రిజర్వాయర్ పనులను సత్వరమే పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జాన్‌వెస్లీ కోరారు.
భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES