రాష్ట్రంలో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-కొణిజర్ల
గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని చిన్న మునగాల గ్రామంలో రైతులతో కలిసి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పెసర పంట పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వచ్చే పెసర పంట ఎందుకూ పనికి రాకుండా పొలంలోనే మొలకెత్తి బూజు పట్టి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, వరి ఇతర పంటలూ ముంపునకు గురయ్యాయని, కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు పడటంతో రైతులకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు.
కౌలు రైతులు.. ఎకరాకి రూ.20వేల నుంచి రూ.30 వేలు ముందస్తు కౌలు చెల్లించి పంటలు సాగు చేస్తే భారీ వర్షాల మూలంగా పంటలు దెబ్బతిని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం అందించాలని, పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అవసరమైన యూరియాను సకాలంలో సరఫరా చేయటంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకోవటంతో సమస్య పక్కదారి పడుతోందని, రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా యూరియా సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అందుకు తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు కూడా బాధ్యత వహించాలన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించే బాధ్యత ముగ్గురు మంత్రులపై ఉందన్నారు. ఆగస్టు 15 నుంచి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ అధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే ఖమ్మం జిల్లాలో తగిన స్పందన లేదని, పంట నష్టం నమోదుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం లేదని, దాటవేత వైఖరిని అధికారులు అనుసరిస్తు న్నారని అన్నారు. రైతులకు పరిహారం అందించకుండా ఉంటే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు చెరకుమల్లి కుటుంబరావు, చింతనిప్పు నరసింహారావు, చెరకుమల్లి పురుషోత్తం, కరుణాకర్, పులి నరసింహా రావు, ఐనాల రాజేష్, దమ్మలపాటి మురళి పాల్గొన్నారు.