అనిరుధ్ ఈమధ్య కొంత దిగులుగా ఉన్నాడు. స్నేహితులు అడిగితే తాను ఏది చేసినా ఇతరులకంటే బాగా చేయలేకపోతున్నానని బాధపడ్డాడు. ఇది యూత్‌లో బాగా గమనిస్తుంటాం. ఈవిధమైన పోటీ, పోలికలు అంత ఆరోగ్యకరం కాదు. ఆరోగ్యకరమైన పోటీ మనిషి అభివద్ధికి తోడ్పడుతుంది.
అలాకాకుండా ఇతరులకంటే తాము గొప్పగా సాధించలేకపోతున్నామని, వారి విధానాలతో పోల్చుకోవడం సబబు కాదు. వాటిని అనుకరించడమూ మంచిది కాదు. అను కరణ కొంతవరకే ఉపకరిస్తుంది. ఎల్లవేళలా, అన్నింటా సహకరించకపోగా వ్యతిరేక ధోరణులకు, మానసిక ఒత్తిడికీ దారితీస్తుంది.
అసలు పోలిక దేనికి?
అభివద్ధిపథంలో ముందడుగు వేయడానికేగదా! ఉదాహరణకు ఓ చిత్రకారుడు ఉన్నాడనుకోండి. అతను కష్టపడి వేసిన పెయింటింగ్ తనకు తనవాళ్లకు నచ్చకపోదు. కానీ దాన్నే తనకంటే మరింత మంచి ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్‌తో పోల్చుకున్నపుడే సమస్య తలెత్తుతుంది. సీనియర్లు తమ జ్ఞానం, నైపుణ్యాం, అనుభవాలతో పనులు చేస్తారన్నది గుర్తుంచుకోవాలి. అలాకాకుండా వారితో పోటీపడి చేయాలంటే మనం చేయగలిగినది కూడా పూర్తిచేయలేం. అంతేగాదు, అవమానానికి, వొత్తిడికీ గురికావడం తథ్యం.
పోలిక, పోటీ అనేదానికంటే ముందు మనస్థాయి, తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు గ్రహించుకోవాలి. అపుడే పోటీ లేదా పోలిక గురించి ఆలోచించవచ్చు. ఎవరి సామర్థ్యం వారిది. కొందరు ఎంతో బాగా మరెంతో సులువుగా పనులు చేసేస్తుంటారు. మరికొందరు చాలా నిదానంగా, బాగానూ చేయగలరు. ఇంకొందరు తమ సత్తామీద నమ్మకం కోల్పోయి పనిచేస్తుంటారు. అందువల్ల ప్రప్రథమంగా మన సామర్థ్యం గురించి పూర్తి అవగాహన ఉండాలి. లోపాలు సరిదిద్దుకునే మనస్తత్వం ఉండాలి. ఇతరులు చెప్పింది వినాలి. అపుడే మనలో ఒక పనిని సక్రమరగా, స్వీయ సామర్థ్యంతో మరింత బాగా చేయగలం. లేకపోతే అనిరుధ్‌లా దిగులు, విచారాల్లోకి పడిపోయే ప్రమాదం ఉంది.
ప్రమాదకరం :
మీరు చేసిన పనిని మీరే తక్కువగా భావిస్తే, మీపైన మీకే నమ్మకం తగ్గిపోతుంది. ఫలితంగా ఆ పనిచేయలేరు, ఆలోచనలు రాణించవు. ఇక ప్రతి పనిలో అదేవిధంగా ఇబ్బంది పెడతాయి. తోటివారిపట్ల ఈర్ష్యతో వ్యవహరిస్తారు. ఆగ్రహిస్తారు. మీ శక్తి సామర్థ్యాలను మర్చిపోయి వివాదాస్పదంగా మారి ఆఖరికి స్నేహితుల్నీ కోల్పోతారు. అక్కడితో మీ భవిష్యత్‌కు ఫుల్ స్టాఫ్ పడుతుంది.
మరొక దశ ఉంది. మీరు ఇతరులకంటే ఎంతో బాగా చేశారన్నది. దీంతో ఇగో రెండింతలవుతుంది. ఎంతో తెలిసినట్టు వ్యవహరిస్తారు. ఫలితంగా ఇతరులను వినరు, పట్టించుకోరు. తెలియనిది నేర్చుకోవాలన్న అభిలాష ఆసక్తి పోయి మూర్ఖులుగానూ తయారవుతారు. ఇది క్రమంగా మీ శత్రువుగా మారుతుంది. అందుకనే పోలిక మీరు మీతోనే ఆరంభించాలంటారు. గతంలో చేసిన పనితో పోల్చుకోవాలి. మెరుగుపడిందీ లేనిదీ మీకు స్పష్టమవుతుంది. అదే మీ అభివద్ధికి తొలిమెట్టు కాగలదు.
స్వీయ పరిశీలన :
నిజమే. స్వీయ పరిశీలన అవసరం. మన పనిని గతంలో మనం చేసిన ఇలాంటి పనితోనే పోల్చుకోవాలి. ఏ మాత్రం మెరుగ్గా చేశామన్నది లేదా తక్కువస్థాయిలో చేశామా అన్నది అవగతమవుతుంది. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవడం ఆరంభమవుతుంది. ఇది మంచిది. మీకు మీరే రాజు, బంటు అనుకోండి. రెండు నెలల క్రితం చేసినదానికి, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం గమనిస్తారు. ఇది ఉత్సాహాన్ని రెండింతలు చేస్తుంది. ఇదో గొప్ప మార్పు. ఈ మార్పు రావాలి. ఇందుకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, తర్కించుకోవాలి. ఇందుకు చేయాల్సిందల్లా…
– చేయవలసిన పనిపై దష్టిపెట్టండి. అందుకు అవసరమైన వనరులు, వసతులు కల్పించుకోండి.
– పనికి అడ్డంకులు సష్టించేవారిని దూరంగా ఉంచండి.
– పనికి సంబంధించి సమస్యలు, ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాలు ఆలోచించాలి.
– సహకరించేవారుంటే తప్పకుండా సలహాలు తీసుకోవాలి. అవసరం మేరకు చర్చించండి.
– సమర్ధవంతంగా చేస్తున్నామన్న ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.
మధ్యలో ఇతరులతో పోలిక అస్సలు వద్దు.
దీంతో మరింత బాగా, సులభంగానూ చేయగల సామర్థ్యాన్ని మీరే ప్రదర్శిస్తారు. ఫలితంగా ఎలాంటి పని చేయాల్సివచ్చినా ఇట్టే చేసేస్తారు. ప్రయత్నించండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్
మీకు మీరే పోటీ…
- Advertisement -
- Advertisement -