Tuesday, October 7, 2025
E-PAPER
Homeకరీంనగర్మళ్లీ పోటీ అంటే వణుకు!

మళ్లీ పోటీ అంటే వణుకు!

- Advertisement -

‘అప్పుల భారమే’ అంటున్న మాజీ సర్పంచులు
సర్పంచ్‌గా రూ.లక్షల్లో సొంత ఖర్చులు
ఇప్పటికీ రూ.1200 కోట్ల బిల్లులు పెండింగే!
బిల్లుల విడుదల కోసం ఆందోళనలు, ఆత్మహత్యాయత్నాలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

గ్రామపంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సందడి కనిపిస్తుంది. కానీ! ఈసారి ఎన్నికల బరిలో నిలవడానికి మాజీ సర్పంచులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అక్టోబర్‌ చివరి వారం నుంచి మూడు విడతల్లో (అక్టోబర్‌ 31, నవంబర్‌ 4, నవంబర్‌ 8) జరగనున్న ఈ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, పదవీకాలం పూర్తయిన మాజీ సర్పంచులు మళ్లీ పోటీ చేయాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నారు. సర్పంచిగా ఉన్నప్పుడు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండటం, సొంత డబ్బులు, అప్పులు చేసి పనులు చేసినా వాటికి సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. మళ్లీ లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని జంకుతున్నారు. ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు.

గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం సొంత డబ్బులు, అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. లక్షల్లో ఖర్చు చేసి గెలిచిన వారికీ, చేసిన అభివృద్ధి ఖర్చులు కూడా తిరిగి రాలేదు. దీంతో చాలా మంది అప్పుల పాలై, ఆస్తులు అమ్ముకుని దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక్కో చిన్న పంచాయతీకి కనీసంగా రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు, మేజర్‌ పంచాయతీలకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. కొన్ని పెద్ద పంచాయతీల్లో రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో 318, జగిత్యాల జిల్లాలో 385, పెద్దపల్లి జిల్లాలో 266, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 260 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.1,200 కోట్లు బకాయిలు ఉంటే అందులో కేవలం కరీంనగర్‌ జిల్లాలోనే రూ.118 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని మాజీ సర్పంచులు వాపోతున్నారు.

చేతికందని ‘అభివృద్ధి’ బిల్లులు కన్నీళ్లు తెప్పిస్తున్న ‘వడ్డీ’ భారాలు!
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మాజీ సర్పంచుల్లో చాలా మంది ఇప్పుడు అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం, లక్ష్మీదేవిపల్లి మాజీ సర్పంచ్‌ భర్త రూ.11 లక్షల బిల్లులు రాకపోవడంతో, అప్పుల బాధ తాళలేక మనస్తాపానికి గురై ఇటీవల గడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ మాజీ సర్పంచ్‌ కుటుంబం ఇప్పటికే పది గుంటల వ్యవసాయ భూమితో పాటు బంగారాన్ని కుదువపెట్టి కొంత అప్పు తీర్చినా, మిగతా అప్పుకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడింది. ఒక్క లక్ష్మీదేవిపల్లి సర్పంచే కాదు.. చిగురుమామిడి మండలంలోని ఓ మాజీ సర్పంచ్‌ అప్పులు తీర్చే మార్గం లేక, తన భార్యతో కలిసి ఉపాధి హామీ (కూలీ) పనులకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇదే మండలంలోని మరో మాజీ సర్పంచ్‌ రెెండు నెలల క్రితం తనకున్న 30 గుంటల భూమి అమ్మి రూ.22 లక్షల అప్పు చెల్లించాడు. ఇంకో రూ.11 లక్షల అప్పు మిగిలే ఉందంటూ తన సన్నిహితులతో వాపోతున్నాడు. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మెజార్టీ పంచాయతీల్లో ఏ ఒక్క మాజీ సర్పంచుల పరిస్థితి చూసినా ఇలాగే ఉంది.

ఎన్నికల బరిలో అంటేనే భయం
పెండింగ్‌ బిల్లులన్నీ ప్రధానంగా స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ) పద్దుల కింద చేసిన శాశ్వత అభివృద్ధి పనులకు సంబంధించినవే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో, లక్షల్లో అప్పులు చేసి పనులు చేసి, వాటికి బిల్లులు రాక నష్టపోయిన మాజీ సర్పంచులు మళ్లీ ఎన్నికల బరిలో నిలవడానికి జంకుతున్నారు. ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఒకవేళ గెలిచినా అభివృద్ధి పనులకు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తే పాత పరిస్థితే పునరావృతమవు తుందని వారు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు ప్రాతినిధ్యం వహించిన మాజీ సర్పంచుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇటీవల కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన చింతకుంట మాజీ సర్పంచ్‌కు రూ.75లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. తమ గ్రామం మున్సిపాలిటీలో విలీనం కావడం, రికార్డులు కూడా మున్సిపల్‌ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో తమ పెండింగ్‌ బిల్లులు రావడం మరింత కష్టమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -