– సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్
– రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పోటీతత్వమే గెలుపుకు తొలిమెట్టని, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడమే ఒక గొప్ప విజయమని కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్-16 వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలను సర్పంచ్ కొత్తపల్లి హారిక ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉండగా, కేవలం 16 మంది మాత్రమే జిల్లా జట్టుకు ఎంపికవుతారని, అటువంటి ప్రతిభావంతులు ఇక్కడికి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా స్వీకరించాలని సూచించారు.
నిజ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుకు 60 శాతం, క్రీడలకు 40 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమని విద్యార్థులకు సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా క్రీడల వల్లే వస్తుందన్నారు. కమ్మర్ పల్లిలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అంతకు ముందు సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ చాంపియన్ షిప్ పోటీల ప్రారంభ సూచికంగా క్రీడ ప్రతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా జిల్లాల క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



