నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువన్ పోచంపల్లి మండలంలోని కప్రాయిపల్లి గ్రామంలో గ్రామకంఠ భూమిని కబ్జా కోరుల నుంచి కాపాడాలని సుంకరి రవికుమార్, సుంకరి కృష్ణ స్వామిలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 169 ,170 పట్టా భూమి పక్కన, గ్రామ కంఠం భూమిని ఆక్రమణకు గురి చేశారని, సుమారు 1000 గజాల భూమిని ఎర్రబోతు మధుసూదన్, ఎర్రబోతు నరసింహ, ఎర్రబోతు ప్రభాకర్ అక్రమంగా ఆక్రమించి ఫెన్సింగ్ చేశారని ఆరోపించారు.
ఈ విషయం మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినందుకు మాలల పై కక్ష కట్టి కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. భూమి విషయమై మండల, జిల్లా స్థాయి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు గ్రామపంచాయతీ కార్యదర్శి సర్వే చేయించి గ్రామ కంఠం భూమి గా నిర్ధారించారని గ్రామ రెవెన్యూ సదస్సులో ప్రకటించినట్లు వివరించారు. ఆక్రమణకు గ్రామ మండల స్థాయి అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సీ ల ఇళ్లకు సమీపంలో ఉన్న గ్రామ కంఠం లో కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు. గ్రామంలో ఎక్కడ స్థలం లేని కారణంగా కమ్యూనిటీ హాల్ నిర్మించడం కొరకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.