Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరం కమిషన్‌పై రేపటిలోగా వాదనలు పూర్తిచేయండి

కాళేశ్వరం కమిషన్‌పై రేపటిలోగా వాదనలు పూర్తిచేయండి

- Advertisement -

– ఇరుపక్షాలను ఆదేశించిన హైకోర్టు
– తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని సూచన
నవతెలంగాణ – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు జీవో 6ను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్‌ స్మిత సబర్వాల్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ జోషి వేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు ఈ నెల ఐదో తేదీ నాటికి వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతంలోని మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కమిషన్‌ ఏర్పాటు జీవోను కొట్టేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్‌ శైలేంద్ర కుమార్‌ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ విడివిడిగా వేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ కొనసాగించింది. రాష్ట్రం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ… కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవతవకలపై జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు కక్ష సాధింపు చర్యల్లో భాగం కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ కుంగిపోయిన నేపథ్యంలో ప్రజాప్రయోజనాల్లో భాగంగా బాధ్యులను గుర్తించడానికే కమిషన్‌ ఏర్పాటు అయ్యిందన్నారు. కమిషన్‌ విచారణ ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందన్నారు. కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. మేడిగడ్డ రిజర్వాయర్‌ నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదనీ, తరలించాలని నిపుణుల కమిటీ సిఫారసులను పట్టించు కోలేదన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ రిజర్వాయర్‌ పియర్‌ కుంగిపోయిన నేపథ్యంలో దానిపై విచారణ చేపట్టవద్దంటే ఎలా అన్నారు. మంత్రి మండలి ఆమోదం లేకుండా నిర్మాణం చేశారన్నారు. ప్రాజెక్టు వ్యయం 81 వేల కోట్లు అవుతుందని మొదలుపెట్టి రూ.1.47 లక్షల కోట్లతో పూర్తి చేశారన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందన్నారు. విద్యుత్‌ సమస్య కూడా వచ్చే విధంగా చేశారన్నారు. వాదనలు ఈ నెల 5వ తేదీకి వాయిదా పడ్డాయి.

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నికకు లైన్‌క్లియర్‌
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నికను మూడు నుంచి నాలుగు వారాల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. యాదగిరి అనే వార్డు కౌన్సిలర్‌ను కిడ్నాప్‌ చేశారంటూ ఆయన కొడుకు పిటిషన్‌ వేయడంతో ఆ ఎన్నికను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఆ ఆర్డర్‌ వెలువడే సమయానికే తనను చైర్మెన్‌గా ఎన్నుకున్నారనీ, అధికారికంగా ప్రకటించలేదని పేర్కొంటూ టి. సుదర్శన్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ మంగళవారం విచారించారు. ఫిబ్రవరి 17న మున్సిపల్‌ చైర్మెన్‌ ఎన్నికకు యాదగిరి హాజరయ్యారనీ, ఓటింగ్‌లో కూడా పాల్గొన్నారని పిటిషనర్‌ న్యాయవాది చెప్పారు. అయితే, అప్పటికే యాదగిరి కుమారుడు వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో ఎన్నిక నిర్వహించరాదని ఆదేశించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఫలితాన్ని వెల్లడించేలా ఆదేశించాలని కోరారు. దీనిపై యాదగిరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డిలు యాదగిరిని కిడ్నాప్‌ చేసి ఏపీలోని బాపట్లకు తరలించారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి యాదగిరి మద్దతు ఇవ్వలేదన్నారు. ఎస్‌ఈసీ లాయర్‌ వాదిస్తూ ఎన్నిక నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. ఏర్పాట్లు చేయాలని లెటర్‌ రాసినట్లు చెప్పారు. దీనిపై న్యాయమూర్తి.. మూడు నుంచి నాలుగు వారాల్లో ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించారు.

దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు బయటకొస్తారు ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలనే వాదన సరిగాదు : హైకోర్టు
మాజీ ఎంపీ కేకే (కె.కేశవరావు) కుమారుడు కె.వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్‌ పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలనే వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్‌ చేసింది. దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు బయటకొస్తాయంటూ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న గడీల రఘువీర్‌రెడ్డి వాదనను తిరస్కరించింది. కేకే కుమారుడు వెంకటేశ్వర్‌రావు, కూతరు, మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి భూ క్రమబద్దీకరణ చేస్తూ 2023 మే 23న విడుదల చేసిన జీవో నంబర్‌ 56ను సవాల్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ పిల్‌ను వాపస్‌ తీసుకోవాలంటే రూ. 3 కోట్లు ఇవ్వాలని రఘువీర్‌రెడ్డి డిమాండ్‌ చేశారంటూ వెంకటేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు కొట్టివేస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు బయటకొస్తాయనీ, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -