Sunday, June 22, 2025
E-PAPER
Homeహెల్త్షుగర్‌ టెస్ట్‌ పూర్తి వివరాలు...

షుగర్‌ టెస్ట్‌ పూర్తి వివరాలు…

- Advertisement -

ఈ మధ్య చాలామంది తిన్న తరువాత షుగర్‌ టెస్ట్‌ చేయించుకున్నప్పుడు వాటి స్థాయిలను చూసి ‘అమ్మో… షుగర్‌ లెవెల్స్‌ చాలా పెరిగాయి. ఏమౌతుందో ఏమిటో.. అని చాలా భయపడుతున్నారు. అసలు పోస్ట్‌ షుగర్‌ టెస్ట్‌లో అంత సుగర్‌ లెవల్స్‌ ఎందుకొస్తున్నాయో తెలుసుకుందాం.
రక్తంలో షుగర్‌ లెవల్స్‌ సరిగ్గా మానిటర్‌ చేయడం డయాబెటిస్‌ మెయింటెనెన్స్‌లో అత్యంత ముఖ్యమైన అంశం. కొంతమంది పేషెంట్స్‌ డాక్టర్‌ కన్సల్టేషన్‌కి వెళ్లే ముందు డీప్‌ ఫ్రై ఫుÛడ్స్‌, పూరీ లాంటి నూనెతో చేసిన ఆహారాలు తింటారు, బయట బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి, తర్వాత షుగర్‌ లెవల్స్‌ టెస్ట్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల షుగర్‌ లెవల్స్‌ అధికంగా కనిపిస్తాయి. తర్వాత ఆరోగ్యానికి హాని జరగవచ్చు సరైన పద్ధతిలో షుగర్‌ లెవల్స్‌ ఎలా చెక్‌ చేసుకోవాలో, జాగ్రత్తలు ఎలా పాటించాలో వివరంగా తెలుసుకుందాం.

ఎందుకు సరైన పద్ధతిలో షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాలంటే… చాలామంది పేషెంట్స్‌ డాక్టర్‌ కన్సల్టేషన్‌కి ముందు రోజు లేదా టెస్ట్‌ రోజు ఉదయం అసాధారణమైన ఆహారాలు (ఉదా: పూరీ, మసాలా దోశ, మైసూర్‌ బోండా, ఫాస్ట్‌ ఫుడ్‌, ఆయిల్‌ డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌) తింటారు. ఇలా చేయడం వల్ల పోస్ట్‌ ప్రాండియల్‌ షుగర్‌ (భోజనం చేసిన 2 గంటల తర్వాత చేసే షుగర్లెవల్స్‌) అధికంగా కనిపిస్తుంది.
ఫలితంగా ఎక్కువ షుగర్‌ లెవల్స్‌ రిపోర్ట్‌ వచ్చినప్పుడు, డాక్టర్‌ ఈ అధిక స్థాయిలను బట్టి మీ మందులను పెంచవలసి వస్తుంది. కానీ, ఇది నిజమైన షుగర్‌ స్థాయిని ప్రతిబింబించదు. తర్వాత మీరు ఇంటికి వెళ్లి సాధారణ ఆరోగ్యకరమైన ఆహారం తినడం మొదలుపెడితే, మందుల మోతాదు ఎక్కువగా ఉండి హైపోగ్లైసీమియా (షుగర్‌ అకస్మాత్తుగా తగ్గిపోవడం) రావచ్చు.
షుగర్‌ టెస్ట్‌ చేయడానికి సరైన పద్ధతులు :
1. ఫాస్టింగ్‌ షుగర్‌ కోసం:
– రాత్రి భోజనం చేసిన తర్వాత 8 నుండి 10 గంటల ఉపవాసం ఉండి, ఉదయం ఫాస్టింగ్‌ షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి.
– టెస్ట్‌కి ముందు ఏదైనా తినడం లేదా తీపి పానీయాలు తాగకూడదు.
– టెస్ట్‌ రోజు ముందు రాత్రి సాధారణంగా తినే ఆహారం మాత్రమే తినాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్లు లేదా నూనెతో చేసిన ఆహారాలు తినకూడదు.
2. పోస్ట్‌ ప్రాండియల్‌ షుగర్‌ కోసం:
– భోజనం చేసిన 2 గంటల తర్వాత టెస్ట్‌ చేయాలి.
– టెస్ట్‌కు ముందు భోజనంలో సాధారణంగా తినే పరిమాణంలో మాత్రమే తినాలి. ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తినకూడదు.
డాక్టర్‌ మీ షుగర్‌ లెవల్స్‌ ఆధారంగా మందులను ప్రిస్క్రైబ్‌ చేస్తారు. కాబట్టి, మీరు టెస్ట్‌ చేసే సమయంలో మీ వాస్తవిక ఆహార అలవాట్లను ప్రతిబింబించేలా చూసుకోవాలి. అలాగే మీరు రోజూ క్రమంగా మెడిసిన్‌ ఎలా వాడుతుంటారో అలాగే టెస్ట్‌ చేసుకునే రోజు కూడా సమయానికి మెడిసిన్‌ తగిన డోస్‌ తీసుకోవడంచాలా అవసరం.

అందుకే ఈ విషయాలను గమనించండి:
-డాక్టర్‌ కన్సల్టేషన్‌కి ముందు రోజు, అదే రోజు ఉదయం నూనెతో కరిగించిన ఆహారాలు తినకండి.
– మీకు సాధారణంగా ఉండే షుగర్‌ లెవల్స్‌ను డాక్టర్‌కి సరిగ్గా తెలియజేయండి
– సాధారణంగా మీరు తినే ఆరోగ్యకరమైన ఆహారాన్నే తిని, అప్పుడు షుగర్‌ టెస్ట్‌ చేయించుకోండి.
– డాక్టర్‌ సూచించిన మందులను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోండి.
– తరచుగా షుగర్‌ లెవల్స్‌ను మానిటర్‌ చేసుకోండి.
ముగింపు
డయాబెటిస్‌ మెయింటెనెన్స్‌లో స్థిరత్వం అత్యంత ముఖ్యం. డాక్టర్‌ వద్దకు వెళ్లే ముందు సరైన ఆహారాలు తినకపోవడం వల్ల తాత్కాలికంగా షుగర్‌ పెరిగినట్లు కనిపించవచ్చు. కానీ ఇది మీ వాస్తవ షుగర్‌ కంట్రోల్‌ను ప్రతిబింబించదు. అందుకే, ఎల్లప్పుడూ సాధారణమైన, ఆరోగ్యకరమైన ఆహారం తిని టెస్ట్‌ చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల డాక్టర్‌ సరైన మందులను సరైన మోతాదులో ఇస్తారు, మీ ఆరోగ్యం నియంత్రణలో ఉంటుంది.
గుర్తుంచుకోండి: తరచుగా షుగర్‌ లెవల్స్‌ను మానిటర్‌ చేసుకోవడం, సరైన ఆహారం తినడం, డాక్టర్‌ సలహాలను పాటించడం డయాబెటిస్‌ను విజయవంతంగా నిర్వహించుకోవడానికి మార్గం!
‘మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది’. సరైన అవగాహనతో డయాబెటిస్‌ను జాగ్రత్తగా నిర్వహించుకుందాం!

Dr.Prathusha. Nerella
MD;FID;NLP;CCEBDM;CCGDM
Senior General Physician,
Diabetes&Lifestyle Expert
Ph: 8897684912/040-49950314

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -