– రాజ్యాంగం, లౌకికతత్వ పరిరక్షణ ఎర్రజెండా లక్ష్యం : సీతారాం ఏచూరి వర్థంతి సభలో రాంభూపాల్
అనంతపురం : సమాజంలో దోపిడీ, వివక్ష, పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థ రూపుమాపాలన్నా, ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ అందించాలన్నా సోషలిజమే శరణ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ అన్నారు. దేశంలో సోషలిజం వచ్చినప్పుడే ప్రజలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు అని అన్నారు. సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సభను నగరంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిర్వహించారు. తొలుత లలిత కళాపరిషత్ నుంచి ఏచూరి చిత్రపటం చేతపట్టుకుని ఎర్రజెండాలతో భారీ ర్యాలీ చేశారు. సీపీఐ(ఎం) నగర కార్యదర్శి వి.రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు వి.రాంభూపాల్, అనంతపురం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప ముఖ్య అతిథులుగా హాజరై ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ.. దేశంలో మతతత్వం, కార్పొరేట్, ప్రయివేటీకరణ, దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు ఎర్రజెండాను ఆయుధంగా చేసుకుని సీతారాం ఏచూరి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తుది శ్వాస విడిచే వరకు ప్రజల పక్షాన గొంతెత్తి పోరాడిన గొప్ప నేత అని కొనియాడారు. కేంద్రం అమలు చేస్తోన్న కార్పొరేట్, ప్రయివేటీకరణ, మతతత్వ విధానాలతో రాజ్యాంగం, లౌకికతత్వానికి ఆటంకం కలుగుతోందన్నారు. ఎన్నికల కమిషన్(ఈసీ) భ్రష్టు పట్టిందని విమర్శించారు. అధికార, ప్రతిపక్షాలు రెండు మోడీకి మోకరిల్లుతుండటం రాష్ట్ర ప్రజల దౌర్భగ్యమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరిస్తున్న మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రాజ్యాంగం, లౌకికతత్వ పరిరక్షణే ఎర్రజెండా లక్ష్యమన్నారు. నల్లప్ప మాట్లాడుతూ.. ఈ నెల 12 వరకూ గ్రామ, పట్టణాల్లో ఏచూరి వర్థంతి వేడుకలు నిర్వహిస్తామని, హిందూత్వ, మతతత్వ విధానాలను ఎండగడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల రంగయ్య, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోషలిజంతోనే సంపూర్ణ స్వాతంత్య్రం
- Advertisement -
- Advertisement -