– గోదావరి పుష్కరాలకు సకల ఏర్పాట్లు
– రూ.50 కోట్లతో నిర్మాణ పనులు :మాస్టర్ ప్లాన్ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గోదావరి పుష్కరాలకు సకల ఏర్పాట్లు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. రూ.50 కోట్లతో నిర్మాణ పనులను చేపట్టబోతున్నామని వివరించారు. ధర్మపురి ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హరీష్, ఇతర ఉన్నతాధికారులు, ధర్మపురి ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ వందల ఏండ్ల చరిత్ర గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికులు, భక్తుల మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు మూర్తి, ఋషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం, ఈ అంశం దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దాంతోపాటు 2027 జులైలో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. మాస్టర్‌ప్లాన్ కు అవసరమైన స్థల సేకరణ వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థల పురాణం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం రూ. 50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని చెప్పారు.
కొండా సురేఖకు ధన్యవాదాలు : మంత్రి అడ్లూరి
తన సొంత నియోజకవర్గంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ది పరుస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంత పని ఒత్తిడిలోనూ తమ ఆలయం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయం కోసం అయ్యే స్థల సేకరణకి సంబంధించిన అంశాల్లో తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని హామీనిచ్చారు. అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు కూడా విజయవంతంగా చేస్తామని అన్నారు.
ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్ కార్యక్రమాలు
- ప్రధాన దేవాలయ విస్తరణ, వైకుంఠ ద్వార నిర్మాణం, క్యూలైన్ కాంప్లెక్స్, టిన్ షెడ్స్.
 - వ్రత మండప నిర్మాణం, కాలక్షేప మండప నిర్మాణం
 - ప్రసాదం కౌంటర్ల నిర్మాణం, నిత్య కళ్యాణ మండప నిర్మాణం, మహా ప్రాకార నిర్మాణ, రథశాల నిర్మాణ, జల ప్రసాదం తాగునీటి వసతుల ఏర్పాట్లు.
గోదావరి తీరంలో చేపట్టే నిర్మాణాలు - పెద్ద డార్మిటరీ హాల్స్ నిర్మాణం, స్త్రీలు బట్టలు మార్చుకొనుటకు డ్రెస్ ఛేంజింగ్ గదుల నిర్మాణం
 - సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, షవర్స్ నిర్మాణం, జలప్రసాదం వసతి, మండప నిర్మాణం, నిత్యాన్నదాన భవనం నిర్మాణం.
 

                                    

