నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల స్పౌజ్, పరస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యూఆర్‌ఎస్)తోపాటు సమగ్ర శిక్షలో 2025-26 విద్యాసంవత్సరంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల స్పౌజ్, పరస్పర బదిలీలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. స్పౌజ్, పరస్పర బదిలీలకు అర్హులైన ఉద్యోగులకే బదిలీలుంటాయని స్పష్టం చేశారు. ఈనెల 26 నాటికి దరఖాస్తులను సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులు స్పౌజ్ లేదా పరస్పర బదిలీల్లో ఒక్క దానికే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల స్థానచలనానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో), సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారుల (డీపీవో)ను ఆదేశించారు.
ఖాళీల్లో సాధారణ బదిలీలకూ అవకాశమివ్వాలి : టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్రంలోని కేజీబీవీలు, యూఆర్‌ఎస్ లతో పాటు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న దంపతులు (స్పౌజ్), పరస్పర (మ్యూచు వల్) బదిలీలకు దరఖాస్తు చేసుకోవా లనీ, వారి వివరాలను ఈ నెల 26 లోగా ఎస్పీడీ కార్యాలయానికి పంపాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ ఉత్తర్వులిచ్చారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ తెలిపారు. ఈ ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నా. ఇటీవల పలు కేజీబీవీలు అప్‌గ్రేడ్ అయ్యాయని వివరించారు. కొందరు సిబ్బంది ఇతర ఉద్యోగాలకు పోవడంతో ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపారు. పలువురు ఉద్యోగులు అతి తక్కువ వేతనంతో దూరప్రాంతాల్లో పనిచేస్తూ బదిలీలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గత మూడేండ్లలో బదిలీలు జరిగినా వారిలో చాలా మందికి అవకాశం రాలేదని తెలిపారు. వారికి మేలు జరిగే విధంగా నూతనంగా మంజూరైన, ఖాళీగా ఉన్న పోస్టుల్లో సాధారణ బదిలీలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించాలని సూచించారు.
సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల స్పౌజ్, పరస్పర బదిలీలకు ఉత్తర్వులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES