జల వివాదాలతో లబ్దిపొందాలని బీఆర్‌ఎస్ కుట్ర
కేసీఆర్ నిర్ణయాలే రాష్ట్రానికి శాపంగా మారాయి
శాసనసభకు రండి చర్చిద్దాం
మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదు : ప్రతిపక్షనేతకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
నీళ్లు, నిజాలపై మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు
నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘నీళ్లు-నిజాలు’ అనే అంశంపై గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మెన్లు ఇతర ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత నీటివాటాలు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటివల్ల ఎదురైన ఇబ్బందులు, ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. అనంతరం ఇదే అంశంపై జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో నీటి హక్కుల విషయంలో అడుగడుగునా అన్యాయం జరిగిందని విమర్శించారు. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారం ఏర్పడిన జస్టిస్ బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్-1 (కేడబ్ల్యూడీటీ) ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించిందని చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలపై పోరాటం చేయకపోగా సమ్మతిస్తూ అపెక్స్ కౌన్సిల్‌లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంతకాలు చేసిందన్నారు. 2014 నుంచి వరుసగా మూడేండ్లు ఒక్కో సంవత్సరం చొప్పున, ఆ తర్వాత 2020లో కేడబ్ల్యూడీటీ తుది అవార్డు వచ్చే వరకు పాత పంపకాలకు కట్టుబడతామని లిఖితపూర్వకంగా ఒప్పుకున్నారని వివరించారు. కేసీఆర్ చేసిన సంతకాల వల్లే కృష్ణా నదిలో తెలంగాణ నీటి హక్కులను కోల్పోయిందని గుర్తు చేశారు. బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం కేటాయించిన 811 టీఎంసీల్లో 70 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు న్యాయబద్దంగా 555 టీఎంసీలు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ మధ్యంతర అవార్డు ప్రకారం 763 టీఎంసీలు దక్కాల్సి ఉందని సీఎం చెప్పారు. న్యాయమైన వాటాలు రాబట్టుకోవడం కోసం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేలేదని ఆక్షేపించారు.
శ్రీశైలానికి మార్చడం వెనుక కుట్ర కోణం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం ద్వారా కృష్ణాలో ఏపీ జల దోపిడీకి బీఆర్‌ఎస్ ద్వారాలు తెరిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ మార్పునకు సంబంధించి కనీసం మంత్రివర్గ అనుమతి కూడా తీసుకోలేదన్నారు. మూడు టీఎంసీల నుంచి ఏకంగా ఏపీ రోజుకు 13 టీఎంసీలను తరలించుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాపై ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 0.25 శాతం నీళ్లు కూడా తీసుకుపోయే మెకానిజం లేదనీ, ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, దిండి తదితర ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయినా రోజుకు నాలుగు టీఎంసీలు కూడా తీసుకుపోలేమని చెప్పారు. ఆనాడు రూ.32 వేల కోట్లతో వేసిన ప్రాజెక్ట్ అంచనా, ఇప్పుడు రూ.84 వేల కోట్లకు చేరిందని తెలిపారు. మూడు లిఫ్ట్‌లను ఐదు లిఫ్ట్‌లకు మార్చడంలో దోపిడీ దాగుందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూడా కమిషన్ల కోసమే కేసీఆర్ మార్చారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో రూ.35 వేల కోట్లున్న ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.1.5లక్షల కోట్లకు చేర్చారని చెప్పారు. అంచనాలు పెంచడం ద్వారా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
మనుగడ కోసమే బీఆర్‌ఎస్ జలవివాదం
2023 తర్వాత వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలైందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడ కష్టమనే భావించి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకునేందుకు కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీని బతికించుకునేందుకు తాను ఏపీ సీఎం చంద్రబాబుకు సహకరిస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లు అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరి పోయారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు కృష్ణాలో నీటి దోపిడీ జరుగుతోందని గగ్గోలు పెట్టిన బీఆర్‌ఎస్.. అపెక్స్ కౌన్సిల్‌లో వారు చేసిన సంతకాలను బయట పెట్టడంతో పాటు జూరాల స్థల మార్పుపై విచారణకు ఆదేశించాలని నిర్ణయించిన క్రమంలో రూటు మార్చి గోదావరి నల్లమల సాగర్‌ను ఎత్తుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ చేసిన ఆర్థిక నేరాలకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే బహిరంగంగా ఉరి తీస్తారని వ్యాఖ్యానించారు. అన్నింటా దొరికి పోవడంతో తెలంగాణ నీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ ఆంధ్రకు చెందిన వారని కొత్త నాటకానికి తెరతీశారని చెప్పారు. ఆయన ఆంధ్రా క్యాడర్‌లో పని చేసిన బీహార్‌కు చెందిన వ్యక్తి అని వివరణ ఇచ్చారు. కేసీఆర్ తన పదేండ్ల కాలంలో ఉమ్మడి ఏపీలో పని చేసిన ఎంతో మంది ఐఏఎస్ అధికారులను తీసుకున్నారని గుర్తు చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కృష్ణా నీటి వాటాలో 71 శాతం తెలంగాణకు, 29శాతం ఏపీకి ఇవ్వాలని పోరాడుతామని స్పష్టం చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.
కేసీఆర్ వల్లే నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్
బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలోనే నీటి వాటాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా తెలంగాణకు బీఆర్‌ఎస్ చేసిన అన్యాయాన్ని అంకెలతో సహా వివరించారు. ”బచావత్ ట్రిబ్యూనల్ పంపకాల్లో జరిగిన వివక్షను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అడ్డుకోలేదు. బచావత్ అవార్డు ప్రకారం ఏపీకి 66 శాతం (512టీఎంసీలు), తెలంగాణకు 34 శాతం (299టీఎంసీలు) కేటాయింపులను అంగీకరిస్తూ అపెక్స్ కౌన్సిల్, కేఆర్‌ఎంబీ బోర్డు మీటింగుల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు సంతకాలు చేశారు. వారి సంతకాలే తెలంగాణకు నేడు మరణశాసనం అయ్యాయి.
2015లో పాలమూరు అంచనా వ్యయం రూ.35 వేల కోట్లు. జీవో ఇచ్చిన ఏడేండ్ల తర్వాత ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ పంపించింది. అందులో ఆయకట్టు వివరాలు లేక పోగా రూ.55 వేల కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఎకరానికి కూడా నీరివ్వలేదు. ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఇంకా రూ.80 వేల కోట్లు కావాల్సి ఉంది. 36 శాతం పనులు పూర్తయితే 90 శాతం పూర్తయ్యాయని అబద్ధాలు చెబుతున్నారు. తమ ప్రభుత్వం రెండేండ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. తట్టెడు మట్టి తీయలేదని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. వాస్తవాలను ఇక్కడికొచ్చిన ప్రజా ప్రతినిధులు వాస్తవాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలి” అని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ సభకొచ్చి సలహాలివ్వాలి
రాష్ట్రానికి పదేండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ శాసనసభకొచ్చి నీటి హక్కుల సాధనలో చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ”మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది. ఎలాంటి భేషజాలకు తావు లేదు. మీ అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికి అందించాలని కోరుకుంటున్నాం. సభలో మంచి సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. మీరు సభకు రండి. వీలు కాని పక్షంలో తెలంగాణ నీటి హక్కులను సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై లేఖ రాయండి” అని సీఎం కోరారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కేకే, జానారెడ్డి లాంటి సీనియర్లు ప్రెస్‌మీట్ పెట్టి సభకు రావాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయాలని కోరారు.



