Thursday, January 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినికరమైన ఉద్యమ శిఖరం కామ్రేడ్‌ బోస్‌

నికరమైన ఉద్యమ శిఖరం కామ్రేడ్‌ బోస్‌

- Advertisement -

ఒక మహిమాన్విత నేత్రం మూతపడ్డది. ధీర గంభీర మహాసముద్రం తనువు చాలించింది. మనకోసం మన మధ్యన నడయాడిన పోరాటశక్తి తన ప్రస్థానానికి విరామం పలికింది. దిక్సూచిగా ఆకాశాన నిలిచింది. ”నాయకులకు నాయకుడు”, ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమ పితామహుడు కామ్రేడ్‌ చంద్రశేఖర బోస్‌ పశ్చిమబెంగాల్‌ రాజధాని కలకత్తాలో ఈనెల పదహారున ఉదయం మరణించారు. ఈ వార్త కార్మికోద్యమ నాయకులను, మరీ ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ ఉద్యమ కార్యకర్తలను, ప్రజాతంత్ర ఉద్యమకారులను దిగ్భ్రాంతికి గురయ్యేలాగా చేసింది. ఆయన చనిపోవడానికి ఒక పదిహేను రోజులు వర్తమాన చరిత్రలో వెనక్కి వెళ్లి చూద్దాం.

అది ఒరిస్సాలోని భువనేశ్వర్‌. అక్కడ ఒక పెద్ద హాలులో జరుగుతున్నది డెబ్బయేళ్ల బీమా ఉద్యోగుల పోరాట చరిత్రకు అద్దం పట్టే ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) ప్లాటినం జూబ్లీ కాన్ఫరెన్స్‌. ఆ హాలులో ఐదడుగుల ఎత్తు ఉన్న వేదిక మీదకు వాలంటీర్ల సహాయంతో ఒక వంద ఏళ్లు పైబడిన వయోవృద్ధ నాయకుడు మెట్ల మీదుగా వేదిక మీదికి వచ్చారు. అతన్ని చూసిన వెంటనే ప్రతినిధుల సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. అవి నిస్సారపు చప్పట్లు కావు. లేక నూట నాలుగేళ్ల వయసు ఉన్న ఒక పెద్ద మనిషి వేదికను ఎక్కగలిగినందుకు ఆశ్చర్యంతో చేసిన కరతాళ ధ్వనులు కావు. అవి ఎల్‌ఐసి కార్మిక ఉద్యమ నాయకుడిగా ఆయన చూపిన పోరాట పటిమకు, ఎల్‌ఐసి ఉద్యోగుల ఉద్యమం పట్ల అయన చూపిన ఆచంచెల అంకిత భావనకు ఉత్తేజితులై, వినమ్రులై మహాసభ ప్రతినిధులు చేసిన లాల్‌ సలాములు.లక్షా పదివేల మంది సభ్యులున్న ఉద్యోగుల సంఘానికి బోస్‌ కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఎల్‌ఐసి ఉద్యోగుల చైతన్య స్ఫూర్తి ప్రతినిధి, ప్రదాత కూడా.

భారతదేశంలో ఇన్సూరెన్స్‌ కంపెనీల చరిత్ర చెబితే అది చరిత్ర కాబోదు. ఇన్సూరెన్స్‌ కంపెనీలతోపాటు ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల పోరాట చరిత్ర కూడా చెప్పాలి. అప్పటికి అది పూర్తి చరిత్ర కాబోదు. ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల సంఘ నిర్మాణానికి చెమటోడ్చి, అవిశ్రాంతంగా పనిచేసిన కార్మిక నాయకుల చరిత్రను చెప్పాలి. అయినా దాన్ని సంపూర్ణ చరిత్ర అనలేము. అందులో బోస్‌ చేసిన కృషి సాధించిన విజయాలు చెప్పకపోతే అది అసంపూర్ణమై తీరుతుంది. బీమా ఉద్యమ ఆవిర్భావ చరిత్ర నుండి, దాని పెరుగుదల నుండి, అది సాధించిన విజయాల నుండి చంద్రశేఖర్‌ బోస్‌ వ్యక్తిగత చరిత్రను విడదీయలేము. రెండు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి, ముందుకు సాగాయి. బీమా కార్మికుల సంఘం ఆవిర్భవించిన నాటి నుండి, ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది. అయినా మొక్కవోని దీక్షతో దేశవ్యాప్త కార్మిక పోరాటాలను నడిపింది. సార్వత్రిక సమ్మెల్లో ఇతర కార్మిక సంఘాలతో పాటు భాగస్వామి అయింది. ఈ పోరాటాలలోను, ఉద్యోగుల పని నిబంధనలు, వారి జీవితాలను మెరుగుపరచడంలో కామ్రేడ్‌ బోస్‌ తోడ్పాటు వెలగట్టలేనిది.

దేశ స్వాతంత్రోద్యమం స్ఫూర్తితో, కార్మిక వర్గ సిద్ధాంతంపై అచంచల విశ్వాసంతో, కామ్రేడ్‌ బోస్‌ తన జీవితాన్నంతా సామాజిక న్యాయం, కార్మికుల విముక్తి కోసం అంకితం చేశారు. 1951లో ఏఐఐఈఏ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తన సహచరులైన కామ్రేడ్‌ సునీల్‌ మైత్రా, కామ్రేడ్‌ సరోజ్‌ చౌధురి, కామ్రేడ్‌ ఎన్‌.ఎం. సుందరం, కామ్రేడ్‌ ఆర్‌.పి. మన్‌చందలతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ ఉద్యమానికి దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని అందించారు. మధ్యతరగతి సేవా రంగ కార్మిక ఉద్యమంలో తిరుగులేని స్థానం సంపాదించి పెట్టారు. బీమారంగ జాతీయీకరణ, వేతనాల క్రమబద్ధీకరణ, బోనస్‌, డిఏ, పెన్షన్‌ కోసం పోరాటం, ప్రయివేటీకరణకు వ్యతిరేక ఉద్యమం, బీమా రంగం ప్రభుత్వ రంగ స్వభావాన్ని పరిరక్షించడం వంటి బీమా ఉద్యోగుల ప్రతి ప్రధాన పోరాటంలోనూ కామ్రేడ్‌ బోస్‌ మార్గదర్శకత్వం వేసిన స్పష్టమైన ముద్ర కనిపిస్తుంది. ఆయన స్పష్టమైన ఆలోచన, వ్యూహాత్మక నైపుణ్యం, చర్చల సామర్థ్యం, నైతికత్వం ఏఐఐఈఏ నడిపిన అన్ని ఉద్యమాలపై చెరగని ముద్రవేశాయి.

దేశ స్వతంత్ర పోరాటం చంద్రశేఖర్‌ బోస్‌ను ఉత్తేజితుడిని చేసింది. దేశానికి కేవలం స్వాతంత్య్రం ఒక్కటే సరిపోదు, కార్మిక వర్గ విముక్తి కూడా అవసరమని బోధించిన కమ్యూనిస్టు పార్టీలో 1944లో చంద్రశేఖర్‌ బోస్‌ సభ్యత్వం తీసుకొన్నారు. అదే సంవత్సరం హిందూస్తాన్‌ కోఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాడు. ఇతని యూనియన్‌ కార్యకలాపాలకు జడిసి మేనేజ్‌మెంట్‌ రెండుసార్లు బోస్‌ను ఉద్యోగం నుంచి బయటికి గెంటింది. అయినా, రెండుసార్లూ యూనియన్‌ పోరాటంతో తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకున్నారు. 1951లో ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) ఏర్పాటులో వ్యవస్థాపక సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. యూనియన్‌ ఏర్పాటు తర్వాత సునీల్‌ మైత్రా, సరోజ్‌ చౌదరి, ఎన్‌ ఎం సుందరం, ఆర్‌ పి మన్‌చందలతో కలిసి దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని అందించారు. ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ప్రతి పోరాటంలోనూ చంద్రశేఖర బోస్‌ అడుగుజాడల గుర్తులు కనబడతాయి. బీమా రంగ జాతీయకరణ కోసం కావచ్చు, లేక ఉద్యోగుల జీతభత్యాల పెంపు, బోనస్‌, డిఏ, పెన్షన్‌ లాంటి వాటి కోసం కావచ్చు, లేక ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కావచ్చు, లేక ఇన్సూరెన్స్‌ పరిశ్రమకున్న ప్రభుత్వ రంగ లక్షణాన్ని కాపాడటంలో కావచ్చు కామ్రేడ్‌ బోస్‌ ముద్ర స్పష్టంగా కనపడుతుంది. ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమ గొంతుక ”ఇన్సూరెన్స్‌ వర్కర్‌” స్థాపించి, 32 ఏళ్ల పాటు సంపాదకత్వం బాధ్యతలు నెరవేర్చిన ఘనత బోస్‌కే చెల్లుతుంది.

సాధించిన విజయాల మించి, ఆయన ఎన్నుకున్న బాటే కామ్రేడ్‌ బోస్‌ను ప్రత్యేకంగా నిలిపింది. బోసుకున్న విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఆయనకే కాదు, బీమా రంగ ఉద్యోగుల ఉద్యమానికి ఒక బలం. ఆయనకున్న ముందుచూపు, ఏ ప్రతికూల పరిస్థితులలోనూ చెదరని సహనం ఒక అర్ధ శతాబ్దం పాటు ఎంతోమంది కార్యకర్తలను, నాయకులను తయారు చేసింది. వారిలో అనేకులు ఇప్పుడు బీమా కార్మిక ఉద్యమ సారధులుగా ఉన్నారు. తను ఎన్నుకున్న బాట పట్ల నిబద్దత, ఉద్యోగుల పట్ల వినమ్రత, ఊగిసలాటకు తావివ్వని విలువల ఆచరణ ప్రతి ఒక్క కార్మిక నాయకుడు అతని జీవితం నుంచి నేర్చుకోదగ్గ పాఠాలు. చంద్రశేఖర్‌ బోసు వ్యక్తిత్వ లక్షణాల గురించి, ఎల్‌ఐసి ఉద్యోగుల ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన సునీల్‌ మెయిత్రా చెప్పిన అభిప్రాయం ఎంతో విలువైనది. ” ఆలోచనలు సాగించేటప్పుడు కూడా చంద్రశేఖర్‌ అబద్ధాలు చెప్పడు. ఆయనతో నాకున్న 35-36 సంవత్సరాల సుదీర్ఘమైన, సన్నిహిత అనుబంధంలో, ఆయన ఒక్కసారి కూడా అసత్యం మాట్లాడటం నేను వినలేదు. నేటి ప్రమాణాల ప్రకారం, చాలామంది ఆయన్ను పాతవాడిగా భావించవచ్చు.” ఏది ఏమైనా, కామ్రేడ్‌ చంద్రశేఖర్‌ బోస్‌ మరణంతో బీమా రంగంలో ఒక శకం ముగిసింది. ఏ లక్ష్యాల కోసమైతే తాను నిరంతరం పనిచేశాడో ఆ ఉద్యమ ఆశయాల సాధన బాధ్యత నేటితరం నాయకత్వానికి, బీమా ఉద్యోగులపై వున్నది.

”వసంతంలో విరబూసిన అందమైన పువ్వు కాదు నువ్వు
నువ్వే ఒక వసంతమై వచ్చావు
ప్రకృతి ఆలపించిన రంగుల స్వరానివి నువ్వు
ఆ స్వరరాగం భైరవి అయినా, దీపక్‌ అయిన, మల్హర్‌ అయినా మనసును పరవశింప చేసే రాగమే నువ్వు”.

  • కర్లపాలెం
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -