Wednesday, November 5, 2025
E-PAPER
Homeజాతీయంమల్టీప్లెక్స్‌ టికెట్‌ ధరలపై ఆందోళన

మల్టీప్లెక్స్‌ టికెట్‌ ధరలపై ఆందోళన

- Advertisement -

తగ్గించకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయి : సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరిక
న్యూఢిల్లీ :
దేశంలోని మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్‌ ధరలతో పాటు, పాప్‌కార్న్‌ ఇతర పానీయాల ధరలు అధికంగా ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించాలని పేర్కొంది. లేదంటే ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడం మానేసి ఓటీటీల వైపు మొగ్గు చూపుతారని, అప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. కర్నాటక ప్రభుత్వం మల్టీప్లెక్స్‌ టికెట్‌ ధరలను రూ. 200కు పరిమితం చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మల్టీ ప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఏఏ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ”మీరు వాటర్‌ బాటిల్‌కు రూ. 100, కాఫీకి రూ. 700 వసూలు చేస్తున్నారు. ధరలను తగ్గించి, ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చేస్తే పరిశ్రమ బాగుపడుతుంది. లేకపోతే ప్రేక్షకులు రాక సినిమా హాళ్లు ఖాళీగా మిగిలిపోతాయి” అని ధర్మాసనం వెల్లడించింది. అదే సమయంలో జస్టిస్‌నాథ్‌ మాట్లాడుతూ.. ”సినిమా బిజినెస్‌ ఇప్పటికే పడిపోతోంది. ప్రేక్షకులు ఆనందపడేలా మరింత రీజనబుల్‌గా ధరలు ఉండాలి. లేకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయి. టికెట్‌ ధర రూ. 200 ఉండాలనే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నాం” అని స్పష్టం చేశారు.
అయితే దీనిపై పిటిషనర్‌ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదిస్తూ ధరలను నిర్ణయించడం తమ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ”తాజ్‌ హౌటల్‌ కాఫీకి రూ. 1000 వసూలు చేస్తే, ఆ ధరలను తగ్గించమని తాజ్‌ హౌటల్‌కి చెబుతారా? ఇది కూడా అంతే. టికెట్‌ ధరలను పెంచుకోవడం అనేది స్వేచ్ఛకు సంబంధించిన విషయం” అని ఆయన తెలిపారు.
మరోవైపు, రోహత్గీ కర్నాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు పెట్టిన షరతులు ఆచరణకు సాధ్యం కావని పేర్కొన్నారు. ముఖ్యంగా టికెట్‌ కౌంటర్లలో డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసే వారి గుర్తింపు కార్డు (ఐడీ) వివరాలు సేకరించాలన్న ఆదేశాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ రోజుల్లో చాలా టికెట్లు ‘బుక్‌మైషో’ వంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా అమ్ముడవుతున్నాయి. కౌంటర్లలో టికెట్లు అమ్మడం లేదు. పైగా సినిమా టికెట్‌ కొనడానికి ఎవరైనా ఐడీ కార్డు తీసుకెళ్తారా? అని ప్రశ్నిస్తూ హైకోర్టు ఆదేశాలు అవాస్తవమని వాదించారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఒకవేళ ప్రభుత్వం ఈ కేసులో గెలిస్తే ప్రేక్షకులు అధికంగా చెల్లించిన టికెట్‌ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు వీలుగా ఉండేందుకే హైకోర్టు ఆ రూల్‌ పెట్టిందని వివరణ ఇచ్చారు. ఈ కేసుపై ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై నోటీసులు జారీ చేసింది. అయితే, హైకోర్టు విధించిన మధ్యంతర షరతులు (టికెట్‌ కొనుగోలుదారుల ఐడీ వివరాలు సేకరణ వంటివి) తక్షణమే అమలు కాకుండా వాటిపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -