ఉన్నతస్థాయి ప్రభుత్వ, పోలీసు ఆఫీసర్లకు అధికారాలు
సోషల్ మీడియా కంటెంట్ తొలగింపు ఆదేశాలు వారి చేతుల్లోనే
నవంబర్ 15 నుంచి అమల్లోకి
డిజిటల్ హక్కుల కార్యకర్తలు,
న్యాయ నిపుణుల నుంచి విమర్శలు
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్‌లో మార్పులు చేసింది. ఇటీవలే కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్‌ను తొలగించాలంటూ ఆదేశాలివ్వడానికి కేవలం ఉన్నతస్థాయి ప్రభుత్వ లేదా పోలీసు అధికారులు మాత్రమే అర్హులు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ అధికారుల్లో జాయింట్ సెక్రెటరీ లేదా అంతకంటే ఉన్నత స్థాయివారు, పోలీసు అధికారుల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) లేదా అంతకంటే పై స్థాయి అధికారులు మాత్రమే ఆదేశాలను ఇవ్వగలవారు. ఇంతకు ముందు కింది స్థాయి అధికారులు కూడా ఈ ఆదేశాలు ఇవ్వగలిగేవారు. అయితే కేంద్రం ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయటం గమనార్హం. కేంద్రం ఈ కొత్త రూల్స్‌ను నోటిఫై చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (ఐటీఆర్)లోని నిబంధన 3(1)(డి) సవరణ అనంతరం కొత్త రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఆదేశాలు ఏ విధంగా ఉండాలి?
ఈ ఆదేశాలు తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి. ఏ చట్టం లేదా నిబంధన ఆధారంగా ఆ కంటెంట్ తొలగించాలి, అది ఏ విధమైన తప్పుడు కంటెంట్ (ఉదాహరణకు : ద్వేషపూరిత వ్యాఖ్యలు, అబద్ధ సమాచారం మొదలైనవి), ఏ యూఆర్‌ఎల్ లేదా లింక్‌ను తొలగించాలన్న వివరాలు ఆ ఆదేశాల్లో స్పష్టంగా ఉండాలి. ప్రతి నెలా, ఆ ఆదేశాలు ఇచ్చిన శాఖలోని ఒక సెక్రెటరీ స్థాయి అధికారి ఆ ఆదేశాలను సమీక్షించాలి.
ప్రభుత్వం చెప్తున్నదేమిటి?
అయితే ఈ మార్పులు ఒక స్పష్టతను, జవాబుదారీతనాన్ని, సముచితతను తీసుకొస్తాయని ప్రభుత్వం చెప్తున్నది. కేవలం పెద్ద స్థాయి బాధ్యత కలిగిన అధికారులు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు (సోషల్ మీడియా కంటెంట్ కట్టడికి సంబంధించి) తీసుకోగలుగుతారని అంటు న్నది. డీప్‌ఫేక్ వీడియోలు, ఫేక్‌న్యూస్, ఆన్‌లైన్ మోసాలు వంటి సమస్యలను అరికట్ట డంలో తాజా మార్పులు సహాయప డుతాయని ప్రభుత్వం చెప్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా డీప్‌ఫేక్ వీడియో లు, ఫొటోలు, ఆడి యోలు పెరుగుతున్నాయనీ, వీటిని కట్టడి చేసేం దుకే తాజా మార్పులని కేంద్రం చెప్తున్నది. వీటిని ఉపయోగించి ప్రైవసీ ఉల్లంఘన, తప్పుడు రాజకీయ లేదా వార్తల ప్రచారం, మోసం చేస్తూ జరుగుతోన్న డబ్బు దోపిడీకి అడ్డుకట్ట వేయొచ్చని వాదిస్తున్నది.
మార్పులపై మేధావుల నుంచి ఆందోళనలు
అయితే డిజిటల్ హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు, విమర్శకుల వాదన మాత్రం ఇంకోలా ఉన్నది. ఈ విధానం అస్పష్టంగా ఉన్నదనీ, దుర్వినియోగానికి అవకాశం ఉన్నదని వారు అంటున్నారు. ప్రజలతో, సంబంధిత వర్గాలను సంప్రదించకుండా ఈ సవరణలు చేశారని వారు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను సమీక్షించేవారు కూడా అదే శాఖలోని అధికారులు కావడం వలన స్వతంత్ర పర్యవేక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి వార్తలు, వీడియోలను తొలగించడానికి రైల్వే అధికారులు సహయోగ్ పోర్టల్‌ను దుర్వినియోగం చేశారని వారు ఉదహరిస్తున్నారు. ఈ మార్పులు ‘సహయోగ్ పోర్టల్’ను మరింత బలపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ ఈ సహయోగ్ పోర్టల్?
సహయోగ్ పోర్టల్ అనేది భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం. దీని ద్వారా ప్రభుత్వ శాఖలు, పోలీస్ శాఖలు లేదా ఇతర అధికార సంస్థలు సోషల్ మీడియా లేదా వెబ్‌సైట్లలోని కంటెంట్‌ను తొలగించాలని ఆదేశాలు పంపగలవు. ఏదైనా శాఖ లేదా అధికారి ఒక పోస్ట్ లేదా వెబ్‌పేజ్ చట్టవిరుద్ధమని భావిస్తే.. వారు సహయోగ్ పోర్టల్ ద్వారా ఆ కంటెంట్ గురించి వివరాలు నమోదు చేస్తారు. ఆ ఆదేశం నేరుగా సోషల్ మీడియా కంపెనీలకు వెళ్తుంది. ఆ కంపెనీలు ఆ కంటెంట్‌ను తొలగించటం, చర్యలు తీసుకోవటం వంటివి చేయాలి. అయితే ఈ సహయోగ్ పోర్టల్‌పై చాలా విమర్శలు ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి ఎక్కువ అధికారాన్ని ఇస్తుందనీ, పారదర్శకత లేకుండా కంటెంట్ తొలగించడానికి ఉపయోగ పడుతుందనీ, స్వేచ్ఛా భావవ్యక్తీకరణకు ముప్పు తెస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఎక్స్ ఈ పోర్టల్‌పై కర్నాటక హైకోర్టులో కేసు వేసింది. అది తమ స్వేచ్ఛను, పారదర్శకతను ఉల్లంఘిస్తుందని వాదించింది. కానీ హైకోర్టు సదరు పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు ఎక్స్ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నది.
కొత్త ఐటీ రూల్స్‌పై ఆందోళనలు
- Advertisement -
- Advertisement -



