జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశ వస్తు వాణిజ్య లోటు 34.7 నుంచి 27.1 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు తమ భుజాలను తామే చరుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కానీ,అసలు విషయం ఏమంటే గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే అది 14.4 బిలియన్ డాలర్ల నుంచి పెరిగి రెండింతలైంది.ఒక నెలలో పెరిగి మరొక నెలలో తగ్గటం సర్వసాధారణం, మొత్తంగా ఏడాదిలో ఏం జరిగిందన్నదే గీటురాయి. పారిశ్రామిక అవసరాలకు వెండి దిగుమతులు 142 శాతం పెరిగితే బంగారం దిగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 28.7శాతం పెరిగాయి, ఎందుకంటే నిత్యావసర వస్తువు కదా! ఇంకా ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు గనుక మోడీ సర్కార్ వ్యాపార లాభనష్టాల గురించి మరోసారి చెప్పుకుందాం.
మన మీడియాలో మరోసారి చైనా మీద ఆధారపడటం ఎంతో ప్రమాదకరమంటూ హితోక్తుల రూపంలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒక దాని శీర్షిక ఏమంటే ”102 బిలియన్ డాలర్ల షాక్” వారు గ్రహించాల్సిందేమంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే రేటింగ్‌లు పెరిగే తరుణం కాదిది.బీజింగ్‌తో ఇక మాటల్లేవ్, మాట్లాడుకోవటం లేదంటూ తలుపులు మూసుకున్న మనం పెట్టుబడుల కోసం వాటిని తెరిచాం, గత ఏడేళ్లుగా మూతపడిన సరిహద్దు వాణిజ్యం ఉత్తరాఖండ్‌లో భారత్-చైనా-నేపాల్ సరిహద్దులు కలిసే లిపులేక్ కనుమదారిలో జూన్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొద్ది నెలలుగా నేపాల్ వ్యతిరేకిస్తున్నప్పటికీ మన దేశం ముందుకు పోతున్నది. ఇలా చైనా కమ్యూనిస్టులకు ఎర్రతివాచీని పరిచామని తెలిసినప్పటికీ పుట్టుకతో పుట్టిన బుద్ధి గనుక కొందరు హెచ్చరికలు చేస్తున్నారు.
ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు చైనాతో వాణిజ్య లోటు 102 బిలియన్ డాలర్లు దాటింది.మోడీ సర్కార్ సాధించిన మరో రికార్డు ఇది.మార్చి నెల కూడా గడచిన తర్వాత ఈ తేడా 111.4 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. ఏడాది క్రితం 91బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతుల ప్రోత్సాహ పిఎల్‌ఐ, వికసిత్ భారత్ వంటి నినాదాల అమలు, ఆచరణ ఫలితమిది. పెట్టుబడికి కనిపించేది లాభం తప్ప భావజాలం కాదు, దీని అర్ధం భావజాలాన్ని వాడుకోదని కాదు.1970 దశకం వరకు చైనాకు ఐరాసలో ప్రవేశం కల్పించకుండా అడ్డుకున్న వాషింగ్టన్ తనకు లాభం వస్తుందని గ్రహించే కదా పక్కా కమ్యూనిస్టు చైనాతో సంబంధాలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టింది.దాని కమ్యూనిస్టు వ్యతిరేకత ఏమైనట్లు ? మనదేశంలో కూడా దాని ఏజంట్లు కమ్యూనిస్టు వ్యతిరేకతను వంటబట్టించుకున్నారు. ఇప్పటికీ రెచ్చిపోతున్నారు.
గాల్వన్‌లోయ ఉదంతం తరువాత కేంద్ర ప్రభుత్వం అనేక చైనా యాప్‌లను నిషేధించింది.నేరుగా పెట్టుబడులను అడ్డుకోకుండా సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే వాటిని పూర్తిగా పరిశీలించాకే అనుమతించాలనే వంకతో ఆరేళ్లుగా అడ్డుకుంటున్నది కాస్తా ఎలాంటి కారణం చెప్పకుండానే పదిశాతం వరకు పెట్టుబడులు నేరుగా చైనా వాటాదారుగా ఉన్న విదేశీ కంపెనీల నుంచి వచ్చేందుకు అనుమతించింది. దీని గురించి చైనా ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ ఇది చాలదు అన్నట్లుగా ఉందని వార్తలు వచ్చాయి. అందువలన రానున్న రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించవచ్చు.అవసరం మనది మరి ! కేంద్రంలో ఉన్న బీజేపీ, దాని వెనుక ఉండి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ యంత్రాంగానికి ఏమీ తెలియకుండానే మోడీ సర్కార్ వైఖరిలో మార్పు వచ్చిందనుకుంటే అమాయకత్వం తప్ప మరొకటి కాదు.
కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత రెచ్చగొట్టటం తమను గుడ్డిగా అనుసరిస్తున్న వారిని నిలబెట్టుకొనేందుకు, సంతుష్టీకరించేందుకు కాషాయదళాలు నిత్యం చేస్తున్నదే, దానిలో ఎలాంటి మార్పు లేదు. చైనా వస్తువులు కార్పొరేట్లకు అవసరం. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని అధికారానికి దూరం చేయటం పెద్దపనేమీ కాదు. ఇప్పుడు వారి ప్రయోజనాలే ముందుకు వచ్చాయి గనుక కాస్త తగ్గండి లేకపోతే మీ గురించి ఆలోచించాల్సి వస్తుందన్న హెచ్చరికతో తాజా పరిణామాలు సంభవిస్తున్నాయన్నది పచ్చినిజం. సంఘపరివార్ తన అజెండాను దేశం మీద రుద్దేందుకు అధికారం కావాలి గనుక వారి వత్తిడికి లొంగి మౌనంగా ఉంది.చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి, దాని వస్తువులను బహిష్కరించాలంటూ వీధుల్లో వీరంగం వేసిన అపర దేశభక్తులు ఇప్పుడెక్కడా కానరారు, సంఘపరివార్ స్వదేశీ జాగరణ్ మంచ్ విదేశీ కంపెనీల సేవలో తరిస్తున్నది.
గతంలో చైనా బజార్ల పేరుతో పెద్ద ఎత్తున కొందరు దుకాణాలను ఏర్పాటు చేసి మనదేశంలో తయారు చేసే నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగట్టారు.అదే సమయంలో చైనా చాలా తక్కువ ధరలకు వస్తువులను అందచేస్తున్న కారణంగా అనేక మంది అవి చౌక, నాశిరకం అని కూడా ప్రచారం చేశారు.కాని తరువాత కాలంలో నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే చైనా వస్తువులు లేని ఇల్లు లేదు.ప్రస్తుతం మన ప్రభుత్వ పెద్దలు ఎన్ని కబుర్లు చెప్పినా ఔషధరంగం, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాలు,సూర్యరశ్మి పలకల వంటి రంగాలలో చైనా నుంచి ముడి సరకులు లేదా సగం తయారైన వస్తువులు, యంత్రాలు, విడిభాగాలు లేకుండా మన దేశంలో అనేక పరిశ్రమలకు మనుగడలేదు.
అందుకే కార్పొరేట్ శక్తులు మోడీ సర్కార్ మీద వత్తిడి తెస్తున్నాయి తప్ప కమ్యూనిజం, చైనా మీద ప్రేమతో కాదు. అవే వస్తువులను మరొక దేశం ఏదైనా అందచేస్తే పొలోమంటూ అటే వెళతారు.చైనా అంత తక్కువ ధరలకు ఎలా అందిస్తున్నదని అనేకమంది ప్రశ్నించటాన్ని చూస్తున్నాము. ఆధునిక పద్ధతుల్లో వస్తూత్పత్తిని తక్కువ ఖర్చుతో చేయవచ్చని వేరే చెప్పనవసరం లేదు. తన 140 కోట్ల జనానికి పనికల్పించాలంటే అవసరాలకు మించి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి పెట్టుబడులు సమకూర్చుకోవాలన్న విధానంలో భాగంగా ఇప్పటివరకు పని చేసింది. ఇప్పుడు తన కార్మికులకు గణనీయంగా వేతనాలు పెంచిన కారణంగా గతంలో మాదిరి చౌకగా అన్ని వస్తువులను అందించటానికి వీలుకాదు గనుక విలువ ఎక్కువగా ఉంటే వస్తూత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నది.గతంలో తక్కువ ధరకు ఫోన్లు అందించిన చైనా నుంచి ఇప్పుడు ఎక్కువ విలువగల ఫోన్లే వస్తున్నాయి, లేకపోతే మనదేశంలోనే తయారు చేస్తున్నారు.
ప్రతి యేటా సగటున మన వద్ద నుంచి 65 బిలియన్ డాలర్ల మేర వస్తు, సేవలను పశ్చిమాసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న మన ఎగుమతుల గురించి పైకి చెప్పుకోలేని ఆందోళన పడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తలెత్తిన పశ్చిమాసియా పరిస్థితి ఎలాంటి పర్యవసానాలకు దోహదం చేయనుందో తరువాత గానీ వెల్లడికాదు. మార్చినెలలో అమెరికా కుదురుతుందని చెబుతున్న ఒప్పందం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు.అమెరికాలో పన్నులు పెంచిన కారణంగా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది మన ఎగుమతులు 12.8శాతం తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం గత పన్నెండేళ్లుగా ఎన్నికబుర్లు చెప్పినా ప్రపంచ ఫ్యాక్టరీగా మారలేదు, సమీప భవిష్యత్‌లో అలాంటి సూచనలు కూడా లేవు.వస్తు, సేవారంగాలను చూస్తే మన దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి, ఎగుమతులు తక్కువగా ఉన్నందున ఏటా మొత్తం మీద వాణిజ్య లోటు వందబిలియన్ డాలర్ల వరకు ఉంటున్నది.
వర్తమాన ఆర్థిక సంవత్సరం 2025-26లో ఫిబ్రవరి వరకు 5.8శాతం వృద్ధి రేటుతో 791 బిలియన్ డాలర్ల మేర వస్తు, సేవలను ఎగుమతి చేశాము. ఇదే సమయంలో 7.4శాతం వృద్ది రేటుతో 900 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాం. ఇతర దేశాలతో మన వాణిజ్యం మిగులు ఉన్న కారణంగా కేవలం ఒక్క చైనాకే వంద బిలియన్ డాలర్లకు పైగా చెల్లిస్తున్నప్పటికీ మన మొత్తం వాణిజ్య లోటు వంద బిలియన్ డాలర్లకు అటూ ఇటూగా ఉంది. అంటే మరో మాటలో చెప్పాలంటే మిగతా దేశాల నుంచి సంపాదించిన మొత్తాన్ని చైనాకు అప్పగిస్తున్నాం. ప్రవాస భారతీయులు యేటా 135బిలియన్ డాలర్లు మనదేశానికి పంపుతున్న కారణంగా డాలర్ల కొరతను గణనీయంగా తీర్చుతున్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉండి వృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు బడాయిచెప్పుకోవటం తప్ప ఎగుమతులను పెంచలేని కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే దీనికి కారణం.
మన వస్తువుల కంటే సేవల ఎగుమతుల రేటు ఎక్కువగా ఉంది. ధరల విషయంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ తదితర దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవటమే ప్రధాన కారణం. మొత్తం ఎగుమతుల్లో 403 డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరుగుతున్నాయి. దిగుమతుల్లో 900బిలియన్ డాలర్లలో 714 బి.డాలర్లు వస్తువులే ఉన్నాయి. మన దిగుమతుల్లో ఎరువుల వాటా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 64.5శాతం పెరిగాయి, ధరలు కూడా ఎక్కువే. వర్తమాన పశ్చిమాసియా సంక్షోభం వీటి దిగుమతుల బిల్లును ఎంతగా పెంచుతుందో చెప్పలేము. ఇప్పటికే గల్ఫ్ నుంచి దిగుమతలకు అంతరాయ కలిగిన కారణంగా మన యూరియా ఫ్యాక్టరీలు సగం సామర్ధ్యంతో మాత్రమే పని చేస్తున్నాయి. ప్రయివేటు పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలు వచ్చే రంగాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఎరువుల వంటివి అంతర్జాతీయ ధరలతో ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున వాటి జోలికి పోవటం లేదు.
నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు నిలిపివేసిన తరువాత తప్పనిసరై రామగుండం వంటి మూతబడిన వాటిని పునరుద్ధరించటం తప్ప కొత్త వాటిని నెలకొల్పటం లేదు. చివరకు యూరియా దిగుమతులకు సైతం చైనా మీద ఆధారపడ్డాం. గతేడాది మన దేశంలో యూరియా కొరతకు చైనా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణం. అందువలన మన మీడియా విశ్లేషకులు, ఇతరులు గమనించాల్సిందేమంటే తమ వస్తువులను కొనాలని చైనా వారు మనలను ఎప్పుడూ దేబిరించలేదు. రెండు దేశాల మధ్య ఎలాంటి ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు లేవు. అది చేసే ఎగుమతులు మనకు పెద్దమొత్తంగా కనిపించవచ్చుగానీ మొత్తం ఎగుమతుల్లో 3-4శాతం మధ్యనే మన వాటా ఉంది. అందువలన వీధుల్లో వీరంగం వేసేవారిని చూసి మనం తలుపులు మూసుకుంటే ఆ మాత్రం ఎగుమతులకు నూతన మార్కెట్లను చూసుకోలేని స్థితిలో చైనా లేదని గ్రహించటం అవసరం.
-సత్య
చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజానిజాలేమిటి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



