డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మిర్యాలగూడ లో నిరసన
నవతెలంగాణ – మిర్యాలగూడ
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాదం బహిరంగ దాడికి దిగడం, ఆ దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న అధ్యక్షుడు నికోలాస్ మదురోను, ఆయన భార్యను అక్రమంగా అరెస్టు చేయడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని డి.వై.ఎఫ్.ఐజిల్లా అధ్యక్షులు రవినాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సైదా నాయక్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వతంత్ర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రజల తీర్పును కాలరాసి ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేయడం అమెరికా సామ్రాజ్యవాదానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. వెనిజులా సహజ వనరులపై కన్నేసిన అమెరికా, అక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని, స్వయం నిర్ణయ హక్కును తుంగలో తొక్కుతూ దౌర్జన్య చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
అమెరికా దాడుల వల్ల వెనిజులా ప్రజలు తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని, ఇది అంతర్జాతీయ చట్టాలకు, మానవ హక్కుల సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి, ప్రజాస్వామ్య విలువలకు పెను ముప్పుగా మారిన ఈ సామ్రాజ్యవాద దుర్మార్గ చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ ప్రజల పోరాటాలకు వ్యతిరేకంగా సాగుతున్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, అక్రమంగా అరెస్టు చేసిన వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను, ఆయన భార్యను వెంటనే నిర్బంధం నుంచి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు, ఈ. కార్యక్రమంలో నాయకులు ఆశీర్వాదం, జయచంద్ర, దేవిలాల్,రాజు, రవి, వినోద్ కుమార్, గోపాల్, రంగ, వివేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



