కొత్తపల్లి శివకుమార్ సి.పి.ఐ( ఎం-ఎల్ )మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఇరాన్ పై, అమెరికా -ఇజ్రాయిల్ దేశాల సంయుక్త సామ్రాజ్యవాద దాడులను ఖండించాలని ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు, సి.పి.ఐ(ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ విజ్ఞప్తి చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ శనివారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరబ్ దేశాలలో ఉన్న ఆయిల్,సహజ వాయువుల దోచుకొనుట కొరకు ట్రంపు కుట్రలు పన్నిన్నారని ఆయన ఆరోపించారు.
ఒక కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అని ప్రచారం చేయాలని సామెతను ఆధారం చేసుకుని, ట్రంప్ తను ఏ దేశంలో అయితే దోపిడీ చేయాలనుకుంటున్నాడో, ఆ దేశం పై రకరకాల దుర్మార్గపు ప్రచారాలను, తన పెయిడ్ వార్తా సంస్థల ద్వారా ప్రపంచానికి చాటి, ఆ తర్వాత ఆదేశాలపై దాడి చేయడం ట్రంపు కు సహజ అలవాటైపోయిందని ఆయన ఆరోపించారు. వెనుజులపై దాడి చేసిన ఇరాన్ పై దాడి చేసిన తన గోబెల్స్ ప్రచారం ద్వారా ప్రపంచాన్ని నమ్మించి దాడులు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను మరిచిన ట్రంపు కనీసం పాఠశాలలను కూడా వదిలిపెట్టకుండా మిస్సైల్స్ దాడి చేయడం ద్వారా ఒక పాఠశాలలో 185 మంది పిల్లలు అందులో 165 మంది బాలికలు మరణించడం ట్రంపు అరాచకానికి అద్దం పడుతుందని ఆయన అన్నారు.
ఇంతటి హేయమైన చర్యలకు,దుర్మార్గాలకు పాల్పడుతున్న అమెరికన్ సామ్రాజ్యవాదులను, ఆయనకు తొత్తులుగా దళారులుగా వ్యవహరిస్తున్న భారత్,ఇజ్రాయిల్ పాలకుల చర్యలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసినారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ పేర్ల నాగయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ గొడ్డలి నరసయ్య,శేషగిరి, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు భీమనపల్లి ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి నితిన్, నవీన్, నారాయణ,బాలస్వామి,పజ్జూరి రేణుక తదితరులు పాల్గొన్నారు.



