స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు
సర్కార్‌కు సమర్పించిన కలెక్టర్లు
హైకోర్టు విచారణ నేటికి వాయిదా
తేలని 27 జీపీల ఎన్నికల పంచాయితీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు సోమవారం లేఖ రాసింది. రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలను సమర్పించిన ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను ప్రభుత్వం ఎస్‌ఈసీకి పంపింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గత రెండు రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లతోపాటు, లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లను కూడా పూర్తి చేసింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీల్లోని 1,12,288 వార్డుల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సింది. అయితే, ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ జరగలేదు. మంగళవారం విచారణ తర్వాత హైకోర్టు ఇచ్చే ఆదేశాలకనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది.
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రాణికుముదిణి
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిణి ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఆమె జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వారీగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపునకు సంబంధించి రవాణా తదితర అంశాలపై వారికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
27 జీపీల్లో ఎన్నికలు వాయిదా
రాష్ట్రంలోని 27 పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతర వివాదాల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అందులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాలతో పాటు కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ మండలంలోని రెండు గ్రామాలు ఉన్నట్టు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తెలిపారు. మంగపేట మండలం:1).కమలాపూర్ 2)నర్సాపూర్ బోరే 3).కొమటి పల్లి 4).కొత్తూరు మొట్ల గూడెం 5).చెరుపల్లి 6).బాలన్నగూడెం 7).నర్సాయిగూడెం, 8).బుచ్చంపేట, 9).తిమ్మంపేట 10).మంగపేట 11).మల్లూరు 12).కొత్త మల్లూరు 13).నర్సింహసాగర్, 14).పూరేడుపల్లి, 15).రమణక్కపేట, 16).చుంచుపల్లి 17).వడగూడెం, 18).రాజుపేట, 19).రామచంద్రునిపేట, 20).వాగొడ్డుగూడెం, 21).కోతిగూడెం, 22).బ్రహ్మణపల్లి, 23).అక్కినపల్లి మల్లారం, 24).దోమెడ, 25).నిమ్మనగూడెం. సైదాపూర్ మండలం: 1).కుర్మపల్లి, 2).రామచంద్రాపూర్
పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



