Wednesday, February 18, 2026
E-PAPER
Homeజాతీయంఏఐ సదస్సులో గందరగోళం

ఏఐ సదస్సులో గందరగోళం

- Advertisement -

భారీగా తరలివచ్చిన ప్రజానీకం
ప్రధాని మోడీ రాకతో భద్రత పెంపు..ప్రజలకు తప్పని అవస్థలు


న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని భారత్‌ మండపంలో మంగళవారం ప్రారంభమైన ఏఐ సదస్సులో తొలి రోజు గందరగోళం నెలకొంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను అదుపు చేయడం లో నిర్వాహకులు విఫలమయ్యారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులకు తగిన భద్రత, రక్షణ కల్పించలేక ఇబ్బంది పడ్డారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హాజరయ్యే వారి కోసం క్యూఆర్‌ కోడ్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. సదస్సు ప్రారంభానికి ముందే రెండున్నర లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేదిక సామర్ధ్యానికి మించి రిజిస్ట్రేషన్లు జరగడంతో నిర్వాహకులు వాటిని నిలిపివేశారు. భారత్‌ మండపంలో ప్రతి సంవత్సరం ట్రేడ్‌ ఫెయిర్‌ జరుగుతుంటుంది. రోజుకు లక్ష మంది వరకూ రాకపోకలు సాగించవచ్చు.

కాగా సదస్సు మొదటి రోజు 80,000 మంది వచ్చారని, వీరంతా ఒకే సమయానికి రావడంతో గందరగోళం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. అదే సమయంలో వీవీఐపీల తాకిడి కూడా పెరగడంతో ప్రజలను అదుపు చేయడం సవాలుగా మారింది. ఒక దశలో పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపించినా ఆ తర్వాత అదుపులోకి వచ్చింది. సదస్సుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు క్యూ లైనులో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఏ గేటు ద్వారా లోపలికి పంపుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. సదస్సు ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో సామాన్య ప్రజలు మరింతగా ఇబ్బంది పడ్డారు. ప్రజలకు కనీసం తాగునీరు, ఆహారం కూడా అందించలేకపోయారు. అవి ఎక్కడ లభిస్తాయో తెలిపే సైన్‌ బోర్డులు కూడా కన్పించలేదు. భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో మోహరించడంతో ప్రజలు ముందుకు సాగలేని పరిస్థితి తలెత్తింది. నిర్వాహకులు, పోలీసులు, భద్రతా సిబ్బంది మధ్య సమన్వయం లోపించింది. కేంద్రప్రభుత్వ నిర్వహణ తీరుపై వచ్చిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ క్షమాపణలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -