ఆందోళనలో పలువురు అధ్యాపకులు
ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం
ట్రాన్స్‌పోర్టు సహకారం శూన్యం
సమస్యను పరిష్కరించాలని టీజీజేఎల్‌ఏ-475 విజ్ఞప్తి
అవసరమైన చర్యలు తీసుకుంటాం : డీఐఈఓ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో అధికారుల విధుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోనే అత్యధిక పరీక్షా కేంద్రాలు కలిగిన హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో.. ముఖ్యంగా వందల సంఖ్యలో ఉన్న ప్రయివేట్ జూనియర్ కళాశాలల్లో పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లుగా(డీవో) ప్రభుత్వ అధ్యాప కులు నియమితులయ్యారు. అయితే ఈ నియా మకాల ప్రక్రియలో అనుసరించిన విధానం గందరగోళంగా మారింది. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సెంటర్ల ఏర్పాటు జరగలేదని తెలుస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులు, ట్రాన్స్ పోర్టు కొరతలను దృష్టిలో పెట్టుకోకుండా దగ్గర గా ఉన్న వారిని కాకుండా దూరంగా ఉన్న వారిని ఆయా సెంటర్లకు కేటాయింపులు చేశారని తెలుస్తోంది. దీనిపై చాలా మంది అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
మారిన విధానం.. మొదలైన కష్టాలు..!
గతంలో ప్రతియేటా హైదరాబాద్ జిల్లాలో పరీక్షల విధుల కేటాయింపు స్థానిక జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ(డీఈసీ) కన్వీనర్ లేదా అధికారి ఆధ్వర్యంలో జరిగేది. దీనివల్ల అధ్యాపకుల నివాస ప్రాంతాలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని విధులు కేటాయించేవారు. కానీ, ఈసారి నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులే ఈ విధులను అన్‌లైన్‌లో కేటాయించారని సమాచారం. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగానో, లేదా యాదృచ్ఛికంగానో కేటాయింపులు జరపడం వల్ల అసలు సమస్య మొదలైందని తెలుస్తోంది.
మహిళా అధ్యాపకులకు ఇబ్బందులు
తాజా కేటాయింపుల్లో చాలా మంది మహిళా అధ్యాపకులకు వారి నివాసాలకు అత్యంత దూరంగా ఉన్న సెంటర్లలో విధుల కేటాయింపు జరిగినట్టు తెలిసింది. పరీక్షల నిబంధనల ప్రకారం.. సీఎస్, డీవోలు ఉదయాన్నే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ప్రశ్నాపత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేటాయించిన దూరప్రాంతాలకు వెళ్లాలంటే, అధ్యాపకులు తెల్లవారుజామున 4గంటలకే ఇంటి నుంచి బయలుదేరాల్సిన పరిస్థితి ఉంది. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, ప్రజా రవాణా లేకపోవడం వంటి కారణాల వల్ల ఏమాత్రం ఆలస్యమైనా.. సకాలంలో పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకోవడం కష్టమవుతుంది. ఇది అంతిమంగా విద్యార్థులకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది. పరీక్షలు సజావుగా జరగాలంటే నిర్వహణ సిబ్బందికి కూడా మానసిక ప్రశాంతత అవసరమని అధ్యాపకులు అంటున్నారు. హైదరాబాద్‌లోనే దాదాపు వందమం దికి పైగా ఇబ్బందులు తెలియజేస్తూ వినతిప త్రాలు అందించినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
అధికారులకు విజ్ఞప్తి..
ఈ సమస్యపై ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(టీజీజేఎల్‌ఏ-475) నాయకులు స్పందించారు. అధ్యాపకుల సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నించారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) వెంటనే స్పందించాలని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ విషయమై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న స్పందిస్తూ.. అధ్యాపకులు, ముఖ్యంగా మహిళా అధ్యాపకులకు సంబంధించిన పరీక్షల విధుల కేటాయింపుల్లో అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందనీ, పరీక్షలకు ఎలాంటి అటంకం కలగకుండా సాఫీగా జరిగేలా.. పై అధికారుల ఆదేశాల మేరకు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.



