Friday, February 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి వేతనంలో అయోమయం

ఉపాధి వేతనంలో అయోమయం

- Advertisement -

జాతీయ బ్యాంకుల్లోనే కూలీల వేతనాలు
ప్రయివేట్‌ బ్యాంకుల్లో జమకావు
కొత్తగా అమలుకానున్న చట్టంలో మార్పులు

నవతెలంగాణ-మల్హర్‌రావు
కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టం వేతనాల చెల్లింపులపై తాజాగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై ఉపాధిహామీ చెల్లింపులను జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల ఖాతాల్లోనే లావాదేవీలు జరగనున్నాయని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి అదేశాలు వచ్చాయి. అయితే ఎప్పటినుంచి ఈ విధానం అమలవుతుందనేది స్పష్టతలేదు. కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి’ హామీ చట్టాన్ని ఇటీవల వీబీజీరామ్‌జీ పేరుగా మార్పులు చేర్పులు చేసి కొత్తగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాత పథకమే అమలవుతోంది. కొత్త వీబీజీరామ్‌ చట్టం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నదని అధికారులు అంటున్నారు.

వేతనాల చెల్లింపులపై కూడా కేంద్రం ప్రవేశపెట్టిన కొత్తరూల్స్‌ అమల్లోకి రావచ్చొని భావిస్తున్నారు. ఇప్పటివరకు కూలీలకు ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. కొత్తరూల్స్‌ ప్రకారం కూలీల ఖాతాలు ప్రయివేట్‌ బ్యాంకులు, జాతీయకరణ పొందని కొన్ని గ్రామీణ బ్యాంకుల్లో కలిగి ఉంటే వారి ఖాతాల్లో వేతనాలు జమకావు. కేవలం జాతీయ బ్యాంకులు పోస్టాఫీసు ఖాతాల్లో మాత్రమే వేతనాలు జమకానున్నాయి. జాతీయబ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాల్సి ఉంది. దీంతో కూలీలు వ్యయ ప్రయాసలకు గురికావల్సి వస్తుందంటూ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలో మొత్తం జాబ్‌ కార్డులు8,495, మొత్తం కూలీలు 18,873, యాక్టివ్‌ కూలీలు10,632 ఉన్నారు.

బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బంది
ఉపాధి కూలీల వేతనాలను పాతనిబంధనల ప్రకారమే కొనసాగించాలి. ప్రభుత్వ కొత్తరూల్స్‌తో కూలీలకు ఇబ్బందులు తప్పవు. కూలీలు కొత్త ఖాతాలు తెరవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
-బూడిద రాజసమ్మయ్య, ఉపాధి కూలీ

ప్రయివేట్‌ బ్యాంకుల్లో జమకావు
ఉపాధి కూలీలు జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఖాతాలు కలిగి ఉండాలి. డీసీసీబీ, మరికొన్ని ప్రయివేట్‌ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉంటే వేతనాలు జమకావు.
-హరీష్‌, ఉపాధి ఏపీఓ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -